ఆకాశ యుద్ధానికి మహిళలు
యుద్ధ విమానాల పైలట్లుగా నియమించేందుకు కేంద్రం ఓకే
♦ నేరుగా యుద్ధక్షేత్రంలో పనిచేసే దళాల్లో తొలిసారిగా చోటు
♦ ఇప్పటికే వైమానిక దళ అకాడమీలో శిక్షణ ప్రారంభం
♦ 2017 జూన్ నాటికి పూర్తిస్థాయిలో పైలట్ బాధ్యతలు
న్యూఢిల్లీ: వాయుసేనలో మహిళా పైలట్ల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దేశంలోని సైనిక దళాల్లో నేరుగా యుద్ధ క్షేత్రంలో పనిచేసే విభాగాల్లో మహిళలు నియామకం కానుండడం ఇదే తొలిసారి. ప్రస్తుతం వైమానిక దళ అకాడమీలో శిక్షణ పొందుతున్న బ్యాచ్‌లోంచి తొలి మహిళా యుద్ధ విమాన పైలట్లను ఎంపికచేయనున్నట్లు రక్షణశాఖ శనివారం ప్రకటించింది. తొలి మహిళా పైలట్ల బ్యాచ్ 2016 జూన్ నాటికి వాయుసేనలో నియామకం అవుతుందని, ఒక సంవత్సరంపాటు అడ్వాన్స్‌డ్ శిక్షణ అనంతరం 2017 జూన్ నాటికి వారు నేరుగా యుద్ధవిమానాలు నడుపుతారని వెల్లడించింది.
భారతీయ మహిళల ఆకాంక్షలను, అభివృద్ధి చెందిన దేశాల సైనిక దళాల ధోరణికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. వాయుసేనలో హెలికాప్టర్లు, రవాణా విభాగాల్లో ఇప్పటికే నియామకమైన మహిళా ఉద్యోగులు.. వారి సహచర పురుషుల కంటే బాగా పనిచేస్తున్నారని ప్రశంసించింది. తాజాగా యుద్ధ విమానాల పైలట్లుగా అవకాశం కల్పించడం... యుద్ధరంగంలోనూ వారి సామర్థ్యాన్ని చూపేందుకు అవకాశమని రక్షణశాఖ పేర్కొంది. అయితే త్రివిధ దళాల్లో నేరుగా యుద్ధంలో పాల్గొనే విభాగాలు మినహా మిగతా విభాగాల్లో ఇప్పటికే మహిళలు పనిచేస్తున్నారు.
సిగ్నల్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీర్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఎయిర్ డిఫెన్స్, ఇంటలిజెన్స్ కార్ప్స్, ఎడ్యుకేషన్ కార్ప్స్, లాజిస్టిక్స్, అబ్జర్వర్. నావల్ కన్‌స్ట్రక్టర్స్ వంటి పలు విభాగాల్లో మహిళలను నియమిస్తుండగా... తాజాగా యుద్ధ విమానాల పైలట్లుగా అవకాశం కల్పిస్తున్నారు. వాయుసేనలో ప్రస్తుతం 1,500 మహిళలు పనిచేస్తుండగా... అందులో 94 మంది పైలట్లు, 14 మంది నావిగేటర్లు. కానీ వీరు రవాణా, హెలికాప్టర్ విభాగాల్లో ఉన్నారు.