స్కైవేకు సైసై!
స్కైవేకు సైసై!
Published Thu, Aug 24 2017 1:04 AM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM
- ‘జూబ్లీ’ నుంచి లోతుకుంట వరకు
- పనులు చేపట్టేందుకు హెచ్‌ఎండీఏ ఆసక్తి
- అంచనా వ్యయం రూ.1,400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మార్చే ప్రక్రియలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) కీలకపాత్ర పోషించబోతోంది. నగరవాసులు ప్రధానంగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ వెతలపై అధ్యయనం చేసిన హెచ్‌ఎండీఏకు చెందిన కాంప్రహెన్సివ్ ట్రాఫిక్ స్టడీ(సీటీఎస్) సూచనల మేరకు నగరంలో నూతన ఫ్లైఓవర్లు, స్కైవే పనులను చేపట్టడంపై దృష్టి సారించింది. బాలానగర్‌లోని నర్సాపూర్ చౌరస్తాపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు శోభనా థియేటర్ నుంచి ఐడీపీఎల్ వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్ పనులకు ఇటీవల భూమిపూజ చేసింది. ఇప్పుడు జూబ్లీ బస్టాండ్ నుంచి లోతుకుంట వరకు ఆరు కి.మీ మేర స్కైవే నిర్మాణ పనులు చేపట్టేందుకు హెచ్‌ఎండీఏ ఆసక్తి చూపుతోంది. స్కైవే నిర్మాణం, భూ సేకరణకు రూ.1,400 కోట్లు అంచనా వ్యయం అవుతుండగా ఇప్పటికే హెచ్‌ఎండీఏ వద్ద జైకా నుంచి తీసుకున్న రుణంలో రూ.600 కోట్లు ఉన్నాయి. మిగిలిన రూ.800 కోట్లు ప్రభుత్వం సమకూరిస్తే స్కైవే పనులు చేపట్టేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమవుతోంది.
అద్భుత రీతిలో స్కైవే..
నగరానికే తలమానికమైన 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) నిర్మించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన హెచ్‌ఎండీఏ.. అవకాశం వస్తే ఈ స్కైవేను అంతకుమించి అద్భుత రీతిలో నిర్మించాలని యోచిస్తోంది. ఈ స్కైవే నిర్మాణం వల్ల ఓఆర్‌ఆర్‌కు అనుసంధానం కావడంతో పాటు కరీంనగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. స్కైవే నిర్మాణం చేపట్టాలనుకుంటున్న ప్రాంతంలో రక్షణ శాఖ భూములు ఉండటంతో వాటిని ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం కోరింది. దీనికి రక్షణ శాఖ అంగీకారం తెలిపినా.. అధికారికంగా ఆదేశాలు రాలేదు. అవి రాగానే స్కైవే నిర్మాణానికి అడుగు పడనుంది. అలాగే ప్యారడైజ్ నుంచి బోయిన్‌పల్లి వరకు ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న స్కైవేకు నిధులు మంజూరు చేస్తే ఆ పనులు కూడా హెచ్‌ఎండీఏ చేపట్టేందుకు రెడీగా ఉందని ఓ అధికారి పేర్కొన్నారు.
హెచ్‌ఎండీఏ భూముల వేలం..
పీవీ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించిన పదేళ్ల తర్వాత హెచ్‌ఎండీఏ రూ.369.53 కోట్లతో బాలానగర్ నుంచి ఐడీపీఎల్ వరకు 1.09 కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల ఫ్లైఓవర్ పనులను చేపట్టింది. ఈ నిధుల కోసం హెచ్‌ఎండీఏకు చెందిన భూములను వేలం వేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదనలు పంపింది. ఉప్పల్ భగాయత్ లే అవుట్‌తో పాటు హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఉన్న స్ట్రేబీట్స్‌ను వేలం వేయడం ద్వారా రూ.400 కోట్లు సమీకరించి బాలానగర్ ఫ్లైఓవర్ పనులకు వెచ్చించాలని యోచిస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వేలం పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక్క ఉప్పల్ భగాయత్ లే అవుట్‌లో ప్లాట్లను విక్రయించడం ద్వారానే రూ.250 కోట్లు వస్తాయని హెచ్‌ఎండీఏ అధికారులు లెక్కలు వేసుకుంటున్నారు.
Advertisement
Advertisement