Skyway
-
Double-Decker Skyways: జేబీఎస్ టు శామీర్‌పేట డబుల్ డెక్కర్ స్కైవే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జూబ్లీ బస్టాండ్ (జేబీఎస్) నుంచి శామీర్‌పేట మధ్యలో డబుల్ డెక్కర్ స్కైవే నిర్మాణంతో కరీంనగర్–హైదరాబాద్ రూట్లో ప్రయాణానికి మహర్దశ పట్టినట్టే. ఇటీవల ఈ ప్రతిపాదనను కేంద్రం వద్ద ఉంచగా, సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. డబుల్ డెక్కర్ స్కైవే మూడంచెల పద్ధతి ఉంటుందని, పైభాగంలో మెట్రోరైలు, మధ్యలో ఫ్లైఓవర్, కిందిభాగంలో రోడ్డు ఉంటుందని వివరించారు. పనులు పూర్తయ్యే నాటికి రూ.ఐదువేల కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. కరీంనగర్ మార్గంలో జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు 18.5 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్కైవే నిర్మాణంతో సిద్దిపేట, కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు హైదరాబాద్‌కు సాఫీగా రాకపోకలు సాగించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డిలతో కలిసి తాను కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన చర్చల ఫలితంగానే ఈ ప్రతిపాదన ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిపారు. -
స్కైవేకు సైసై!
- ‘జూబ్లీ’ నుంచి లోతుకుంట వరకు - పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ ఆసక్తి - అంచనా వ్యయం రూ.1,400 కోట్లు సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మార్చే ప్రక్రియలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కీలకపాత్ర పోషించబోతోంది. నగరవాసులు ప్రధానంగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ వెతలపై అధ్యయనం చేసిన హెచ్ఎండీఏకు చెందిన కాంప్రహెన్సివ్ ట్రాఫిక్ స్టడీ(సీటీఎస్) సూచనల మేరకు నగరంలో నూతన ఫ్లైఓవర్లు, స్కైవే పనులను చేపట్టడంపై దృష్టి సారించింది. బాలానగర్‌లోని నర్సాపూర్ చౌరస్తాపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు శోభనా థియేటర్ నుంచి ఐడీపీఎల్ వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్ పనులకు ఇటీవల భూమిపూజ చేసింది. ఇప్పుడు జూబ్లీ బస్టాండ్ నుంచి లోతుకుంట వరకు ఆరు కి.మీ మేర స్కైవే నిర్మాణ పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ ఆసక్తి చూపుతోంది. స్కైవే నిర్మాణం, భూ సేకరణకు రూ.1,400 కోట్లు అంచనా వ్యయం అవుతుండగా ఇప్పటికే హెచ్ఎండీఏ వద్ద జైకా నుంచి తీసుకున్న రుణంలో రూ.600 కోట్లు ఉన్నాయి. మిగిలిన రూ.800 కోట్లు ప్రభుత్వం సమకూరిస్తే స్కైవే పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ సిద్ధమవుతోంది. అద్భుత రీతిలో స్కైవే.. నగరానికే తలమానికమైన 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన హెచ్ఎండీఏ.. అవకాశం వస్తే ఈ స్కైవేను అంతకుమించి అద్భుత రీతిలో నిర్మించాలని యోచిస్తోంది. ఈ స్కైవే నిర్మాణం వల్ల ఓఆర్ఆర్కు అనుసంధానం కావడంతో పాటు కరీంనగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. స్కైవే నిర్మాణం చేపట్టాలనుకుంటున్న ప్రాంతంలో రక్షణ శాఖ భూములు ఉండటంతో వాటిని ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం కోరింది. దీనికి రక్షణ శాఖ అంగీకారం తెలిపినా.. అధికారికంగా ఆదేశాలు రాలేదు. అవి రాగానే స్కైవే నిర్మాణానికి అడుగు పడనుంది. అలాగే ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న స్కైవేకు నిధులు మంజూరు చేస్తే ఆ పనులు కూడా హెచ్ఎండీఏ చేపట్టేందుకు రెడీగా ఉందని ఓ అధికారి పేర్కొన్నారు. హెచ్ఎండీఏ భూముల వేలం.. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించిన పదేళ్ల తర్వాత హెచ్ఎండీఏ రూ.369.53 కోట్లతో బాలానగర్ నుంచి ఐడీపీఎల్ వరకు 1.09 కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల ఫ్లైఓవర్ పనులను చేపట్టింది. ఈ నిధుల కోసం హెచ్ఎండీఏకు చెందిన భూములను వేలం వేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదనలు పంపింది. ఉప్పల్ భగాయత్ లే అవుట్‌తో పాటు హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఉన్న స్ట్రేబీట్స్ను వేలం వేయడం ద్వారా రూ.400 కోట్లు సమీకరించి బాలానగర్ ఫ్లైఓవర్ పనులకు వెచ్చించాలని యోచిస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వేలం పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక్క ఉప్పల్ భగాయత్ లే అవుట్లో ప్లాట్లను విక్రయించడం ద్వారానే రూ.250 కోట్లు వస్తాయని హెచ్ఎండీఏ అధికారులు లెక్కలు వేసుకుంటున్నారు. -
స్కైవేలు, రోడ్లకు తొలివిడత నిధులు
టెండర్లు పిలవాలని జీహెచ్ఎంసీకి సీఎం ఆదేశం హైదరాబాద్: రాజధాని నగరంలో స్కైవేలు, మేజర్ కారిడార్లు, మేజర్ రోడ్లు, గ్రేడ్ సెపరేటర్లు, ఇతర రహదారుల నిర్మాణాలకు సంబంధించి టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ పనులకు తొలి విడత కింద రూ.3,981 కోట్ల అంచనా వ్యయంతో 12 పనులకు టెండర్లు పిలవాలని సూచించారు. మిగిలని పనులకు కూడా దశల వారీగా టెండర్లు పిలవాలని నిర్ణయించారు. మంగళవారం సచివాలయంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని, పద్మారావు, మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌తో పలు అంశాలపై సీఎం సమీక్షించారు. నగర వ్యాప్తంగా మొత్తం 135 కిలోమీటర్ల స్కై వేలు, 166 కిలోమీటర్ల మేజర్ కారిడార్లు, 348 కిలోమీటర్ల మేజర్ రోడ్లు, 54 గ్రేడ్ సెపరేటర్లు నిర్మించాలని నిర్ణయించారు. -
‘విశ్వ’మంత గమ్యం..
తడబడుతున్న అడుగులు ప్రభుత్వ విభాగాల్లో సిబ్బంది కొరత ప్రస్తుత పనులకే ఇక్కట్లు భవిష్యత్తు అవసరాలకు మరిన్ని కష్టాలు నిధులు సరే.. విధులు ఎలా.. ? ‘విశ్వ’నగరంగా హైదరాబాద్... ఇదీ ప్రభుత్వ లక్ష్యం. ఆకాశ హర్మ్యాలు... అందమైన రహదారులు... ఆకుపచ్చని పరిసరాలు... స్కైవేలు... వీటన్నిటితో నగర కీర్తిని విశ్వమంతటా చాటాలనేది సర్కారు తాపత్రయం. ఈ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలూ సిద్ధమవుతున్నాయి. నిధులూ సమకూరుతున్నాయి. ఈ ‘విశ్వ’రథం నడిచేందుకు అవసరమైన సారథులు... సహకరించాల్సిన ఉద్యోగులూ కనిపించడం లేదు. నిధుల సేకరణలో నిమగ్నమైన సర్కారు సారథులు... కీలకమైన ఉద్యోగులు లేరనే విషయాన్ని మరచిపోవడం చర్చకు తావిస్తోంది. సిటీబ్యూరో: నగరంలో రూ.10 వేల కోట్లతో రహదారుల అభివృద్ధి.. మరో రూ.10 వేల కోట్లతో నాలాల ఆధునికీకరణ. ఇంకా గ్రేడ్ సెపరేటర్లు, స్కైవేలు. వీటిలో తొలి దశ పనులకు రూ.2700 కోట్లతో ప్రతిపాదనలు.. డీపీఆర్‌లకు జీహెచ్ఎంసీ సిద్ధం. కన్సల్టెంట్లకు ఆహ్వానం. ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు.. ఆకుపచ్చ నగరంగా మార్చేందుకు హరితహారం.. క్లీన్ అండ్గ్రీన్లో భాగంగా పారిశుద్ధ్యం మెరుగుపరచడం... ఇవన్నీ జీహెచ్ఎంసీ లక్ష్యాలు. ఇవే కాదు.. ఇంకా చాలా ఉన్నా యి. వీటన్నిటికీ అవసరమైన నిధుల సంగతలా ఉంచితే.. నిర్వహణ, పర్యవేక్షణకు అవసరమైన క్షేత్ర స్థాయి సిబ్బందితో పాటు కార్యాలయ ఉద్యోగులు సైతం లేరు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తల పెట్టిన బహుళ పనులు ఎలా నిర్వహిస్తారనేది అంతుపట్టడం లేదు. ఏటా దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్‌ను జీహెచ్ఎంసీ ఆమోదిస్తు న్నా... నిధులు మంజూరవుతున్నా... సిబ్బంది కొరతతో పనులు సగం కూడా ముందుకు సాగడం లేదు. మరి అంత పెద్ద లక్ష్యాలు సాధిం చడం ఎలా సాధ్యమవుతుందన్నది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. ఉత్తర్వులకే పరిమితం జీహెచ్ఎంసీ సాధారణ పనుల నిర్వహణకే 2,607 పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరముందని రెండేళ్ల క్రితం ప్రసాదరావు కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు అప్పటి ప్రభుత్వం వాటిని మంజూరు చేయడంతో పాటు తొలిదశలో 1,307 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ పరిణామాల నేపథ్యంలో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. పదోన్నతులు, ఇతరత్రా చర్యలతో దాదాపు 30 అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ పోస్టులు భర్తీ చేశారు.కీలకమైన ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, ఆరోగ్యం-పారిశుద్ధ్యం తదితర విభాగాల్లో ఖాళీలు అలాగే ఉన్నాయి. పదోన్నతులతో సరి నగరాన్ని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో పోస్టుల సంఖ్య పెరగాల్సి ఉంది. రహదారుల ఆధునికీకరణ, స్కైవేలు, ఫ్లైఓవర్లు తదితర పనులకు తగినంతమంది ఇంజినీర్లు లేరు. గత అవసరాల దృష్ట్యానే వివిధ విభాగాల్లో సుమారు 500 మంది ఇంజినీర్లు అవసరమని ప్రసాదరావు కమిటీ సిఫారసు చేసింది. గతంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా ఉన్న పలువురికి సూపరింటెండింగ్ ఇంజినీర్లుగా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతులిచ్చారు తప్ప ఖాళీలను భర్తీ చేయలేదు. టౌన్‌ప్లానింగ్ విభాగంలోనూ తగినంతమంది ప్లానర్లు, ఉద్యోగులు లేరు. రహదారుల అభివృద్ధి, భూ సేకరణ తదితర పనులకు టౌన్‌ప్లానింగ్ విభాగమే కీలకం. ఇంకా నగరాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. ఇప్పటికే ఎక్కడి చెత్త అక్కడ అనే ఫిర్యాదులు తప్పడం లేదు. ఆ విభాగంలోనూ అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ విభాగంలోనూ ఇదే దుస్థితి. రోజురోజుకూ పెరుగుతున్న చెత్తతో ఘన్యర్థాల నిర్వహణ తీవ్ర సమస్యగా మారింది. ఇలా వివిధ విభాగాల్లోని అరకొర సిబ్బంది, అధికారులతో సమస్యలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌ను విశ్వనగరంగా ఎలా తీర్చిదిద్దుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్‌లు ఓకే... పరిపాలన విధులకు సంబంధించి ఐదుగురు ఐఏఎస్‌లను ప్రభుత్వం గత వారమే జీహెచ్ఎంసీకి కేటాయించింది. భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు తగినంతమంది ఇంజినీర్లు, టౌన్ప్లానర్లతో పాటు క్షేత్ర స్థాయిలో పనులు పర్యవేక్షించాల్సిన అధికారులు, సిబ్బంది లేరు. కార్యాలయాల్లోనూ అవసరమైనంత మంది ఉద్యోగులు లేరు. జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లోనూ తగిన సిబ్బంది, వనరులు లేకపోవడంతో వాటి పని తీరు మెరుగుపరచాల్సిన అవసరాన్ని ప్రసాదరావు కమిటీ గుర్తు చేసింది. ఆ సిఫార్సులకు అనుగుణంగానే అప్పట్లో ప్రభుత్వం పోస్టులు కేటాయించింది. ప్రస్తుత అవసరాల దృష్ట్యా మరిన్ని పోస్టులు అవసరం. అడిషనల్ కమిషనర్ల నుంచి బిల్ కలెక్టర్ల వరకు .. ప్రధాన కార్యాలయం నుంచి సర్కిల్ కార్యాలయం వరకు ఉద్యోగుల అవసరం ఉంది. పాత అంచనాల ప్రకారమే ప్రధాన కార్యాలయంలో 264 మంది, జోనల్ కార్యాలయాల్లో 295 మంది, సర్కిల్ కార్యాలయాల్లో 2,148 మంది అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది.