‘విశ్వ’మంత గమ్యం..
తడబడుతున్న అడుగులు
ప్రభుత్వ విభాగాల్లో సిబ్బంది కొరత
ప్రస్తుత పనులకే ఇక్కట్లు
భవిష్యత్తు అవసరాలకు మరిన్ని కష్టాలు
నిధులు సరే.. విధులు ఎలా.. ?
‘విశ్వ’నగరంగా హైదరాబాద్... ఇదీ ప్రభుత్వ లక్ష్యం. ఆకాశ హర్మ్యాలు... అందమైన రహదారులు... ఆకుపచ్చని పరిసరాలు... స్కైవేలు... వీటన్నిటితో నగర కీర్తిని విశ్వమంతటా చాటాలనేది సర్కారు తాపత్రయం. ఈ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలూ సిద్ధమవుతున్నాయి. నిధులూ సమకూరుతున్నాయి. ఈ ‘విశ్వ’రథం నడిచేందుకు అవసరమైన సారథులు... సహకరించాల్సిన ఉద్యోగులూ కనిపించడం లేదు. నిధుల సేకరణలో నిమగ్నమైన సర్కారు సారథులు... కీలకమైన ఉద్యోగులు లేరనే విషయాన్ని మరచిపోవడం చర్చకు తావిస్తోంది.
సిటీబ్యూరో: నగరంలో రూ.10 వేల కోట్లతో రహదారుల అభివృద్ధి.. మరో రూ.10 వేల కోట్లతో నాలాల ఆధునికీకరణ. ఇంకా గ్రేడ్ సెపరేటర్లు, స్కైవేలు. వీటిలో తొలి దశ పనులకు రూ.2700 కోట్లతో ప్రతిపాదనలు.. డీపీఆర్‌లకు జీహెచ్‌ఎంసీ సిద్ధం. కన్సల్టెంట్లకు ఆహ్వానం.
ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు.. ఆకుపచ్చ నగరంగా మార్చేందుకు హరితహారం.. క్లీన్ అండ్‌గ్రీన్‌లో భాగంగా పారిశుద్ధ్యం మెరుగుపరచడం... ఇవన్నీ జీహెచ్‌ఎంసీ లక్ష్యాలు. ఇవే కాదు.. ఇంకా చాలా ఉన్నా యి. వీటన్నిటికీ అవసరమైన నిధుల సంగతలా ఉంచితే.. నిర్వహణ, పర్యవేక్షణకు అవసరమైన క్షేత్ర స్థాయి సిబ్బందితో పాటు కార్యాలయ ఉద్యోగులు సైతం లేరు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తల పెట్టిన బహుళ పనులు ఎలా నిర్వహిస్తారనేది అంతుపట్టడం లేదు. ఏటా దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్‌ను జీహెచ్‌ఎంసీ ఆమోదిస్తు న్నా... నిధులు మంజూరవుతున్నా... సిబ్బంది కొరతతో పనులు సగం కూడా ముందుకు సాగడం లేదు. మరి అంత పెద్ద లక్ష్యాలు సాధిం చడం ఎలా సాధ్యమవుతుందన్నది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న.
ఉత్తర్వులకే పరిమితం
జీహెచ్‌ఎంసీ సాధారణ పనుల నిర్వహణకే 2,607 పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరముందని రెండేళ్ల క్రితం ప్రసాదరావు కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు అప్పటి ప్రభుత్వం వాటిని మంజూరు చేయడంతో పాటు తొలిదశలో 1,307 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ పరిణామాల నేపథ్యంలో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. పదోన్నతులు, ఇతరత్రా చర్యలతో దాదాపు 30 అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ పోస్టులు భర్తీ చేశారు.కీలకమైన ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, ఆరోగ్యం-పారిశుద్ధ్యం తదితర విభాగాల్లో ఖాళీలు అలాగే ఉన్నాయి.
పదోన్నతులతో సరి
నగరాన్ని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో పోస్టుల సంఖ్య పెరగాల్సి ఉంది. రహదారుల ఆధునికీకరణ, స్కైవేలు, ఫ్లైఓవర్లు తదితర పనులకు తగినంతమంది ఇంజినీర్లు లేరు. గత అవసరాల దృష్ట్యానే వివిధ విభాగాల్లో సుమారు 500 మంది ఇంజినీర్లు అవసరమని ప్రసాదరావు కమిటీ సిఫారసు చేసింది. గతంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా ఉన్న పలువురికి సూపరింటెండింగ్ ఇంజినీర్లుగా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతులిచ్చారు తప్ప ఖాళీలను భర్తీ చేయలేదు. టౌన్‌ప్లానింగ్ విభాగంలోనూ తగినంతమంది ప్లానర్లు, ఉద్యోగులు లేరు. రహదారుల అభివృద్ధి, భూ సేకరణ తదితర పనులకు టౌన్‌ప్లానింగ్ విభాగమే కీలకం. ఇంకా నగరాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. ఇప్పటికే ఎక్కడి చెత్త అక్కడ అనే ఫిర్యాదులు తప్పడం లేదు. ఆ విభాగంలోనూ అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ విభాగంలోనూ ఇదే దుస్థితి. రోజురోజుకూ పెరుగుతున్న చెత్తతో ఘన్యర్థాల నిర్వహణ తీవ్ర సమస్యగా మారింది. ఇలా వివిధ విభాగాల్లోని అరకొర సిబ్బంది, అధికారులతో సమస్యలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌ను విశ్వనగరంగా ఎలా తీర్చిదిద్దుతారనేది చర్చనీయాంశంగా మారింది.
ఐఏఎస్‌లు ఓకే...
పరిపాలన విధులకు సంబంధించి ఐదుగురు ఐఏఎస్‌లను ప్రభుత్వం గత వారమే జీహెచ్‌ఎంసీకి కేటాయించింది. భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు తగినంతమంది ఇంజినీర్లు, టౌన్‌ప్లానర్లతో పాటు క్షేత్ర స్థాయిలో పనులు పర్యవేక్షించాల్సిన అధికారులు, సిబ్బంది లేరు. కార్యాలయాల్లోనూ అవసరమైనంత మంది ఉద్యోగులు లేరు. జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాల్లోనూ తగిన సిబ్బంది, వనరులు లేకపోవడంతో వాటి పని తీరు మెరుగుపరచాల్సిన అవసరాన్ని ప్రసాదరావు కమిటీ గుర్తు చేసింది. ఆ సిఫార్సులకు అనుగుణంగానే అప్పట్లో ప్రభుత్వం పోస్టులు కేటాయించింది. ప్రస్తుత అవసరాల దృష్ట్యా మరిన్ని పోస్టులు అవసరం. అడిషనల్ కమిషనర్ల నుంచి బిల్ కలెక్టర్ల వరకు .. ప్రధాన కార్యాలయం నుంచి సర్కిల్ కార్యాలయం వరకు ఉద్యోగుల అవసరం ఉంది. పాత అంచనాల ప్రకారమే ప్రధాన కార్యాలయంలో 264 మంది, జోనల్ కార్యాలయాల్లో 295 మంది, సర్కిల్ కార్యాలయాల్లో 2,148 మంది అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది.