సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 19న గ్రేటర్‌లో నిర్వహించనున్న సమగ్ర కుటుంబ (సామాజిక, ఆర్థిక ఇంటింటి) సర్వేకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికను సిద్ధం చేసింది. జనగణన సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్యూమరేషన్ బ్లాకుల వారీగా దీన్ని నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ఎన్యూమరేటర్లను నియమించనున్నారు. వీరి పనితీరును సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకునేందుకు వీరిపైన క్లస్టర్ సూపర్‌వైజర్లను..వారి పైన వార్డు సూపర్‌వైజర్లను నియమించాలని నిర్ణయించారు. వార్డు సూపర్‌వైజర్లే నోడల్ అధికారులుగానూ వ్యవహరించనున్నారు.
వీరి వివరాలతో కూడిన జాబితాను సిద్ధం చేసే పనిని ఇప్పటికే ప్రారంభించారు. నోడల్ ఆఫీసర్లపైన డిప్యూటీ కమిషనర్లు/అడిషనల్ కమిషనర్లు/ జోనల్ స్థాయి కమిషనర్లు పూర్తి స్థాయిలో పర్యవేక్షించనున్నారు. వీరికి ఎప్పటికప్పుడు తగిన సూచనలిచ్చే బాధ్యతలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ నిర్వర్తిస్తారు. శుక్రవారం నుంచి వివిధ స్థాయిల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఒక్కో ఎన్యూమరేటర్ 25-30 ఇళ్లను సర్వే చేయాల్సి ఉంటుంది. మొత్తం 20వేల మంది ఎన్యూమరేటర్ల సేవలను వినియోగించుకుంటారు. వీరు తమకు సహాయకులుగా ఎన్జీఓలు, కళాశాల విద్యార్థులు తదితరులను నియమించుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఒక్కో ఎన్యూమరేటర్ ఐదుగురి వరకు నియమించుకోవచ్చు. వారికి తగిన శిక్షణనిచ్చి, సాయం తీసుకుంటారు. దాదాపు రెండువేల మంది క్లస్టర్ సూపర్‌వైజర్లుగా, 250 మంది నోడల్ అధికారులుగా విధులు నిర్వహించనున్నారు.
కేంద్రం నుంచి సైన్యం వస్తే వారి సేవలనూ వినియోగించుకుంటారు. ఎన్యూమరేటర్లు.. వారి సహాయకులు వెరసి దాదాపు లక్షమంది విధుల్లో పాల్గొనే అవకాశం ఉంది. సర్వే 19వ తేదీన అయినప్పటికీ, 18వ తేదీ నుంచే ఎన్యూమరేటర్లు తమ పని ప్రారంభించాలని నిర్దేశించారు. తమకు కేటాయించిన ప్రాంతాలకు వెళ్లడం.. ప్రజలకు ముందస్తుగానే సమాచారం ఇవ్వడం తదితర పనులు చేయనున్నారు.ఈమేరకు సర్వేకు సంబంధించి వివిధ స్థాయిల్లోని అధికారులతో జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్లు గురువారం సమావేశం నిర్వహించారు. దీని నిర్వహణపై సూచనలిచ్చారు.
సర్వేకి సర్వం సిద్ధం
Published Fri, Aug 8 2014 4:04 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM
Advertisement