
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జూబ్లీ బస్టాండ్ (జేబీఎస్) నుంచి శామీర్‌పేట మధ్యలో డబుల్ డెక్కర్ స్కైవే నిర్మాణంతో కరీంనగర్–హైదరాబాద్ రూట్‌లో ప్రయాణానికి మహర్దశ పట్టినట్టే. ఇటీవల ఈ ప్రతిపాదనను కేంద్రం వద్ద ఉంచగా, సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. డబుల్ డెక్కర్ స్కైవే మూడంచెల పద్ధతి ఉంటుందని, పైభాగంలో మెట్రోరైలు, మధ్యలో ఫ్లైఓవర్, కిందిభాగంలో రోడ్డు ఉంటుందని వివరించారు.
పనులు పూర్తయ్యే నాటికి రూ.ఐదువేల కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. కరీంనగర్ మార్గంలో జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు 18.5 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్కైవే నిర్మాణంతో సిద్దిపేట, కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు హైదరాబాద్‌కు సాఫీగా రాకపోకలు సాగించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డిలతో కలిసి తాను కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన చర్చల ఫలితంగానే ఈ ప్రతిపాదన ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment