500 ఎకరాలు.. రూ.96 కోట్లు
- రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి పరిహారం
- రాష్ట్ర ప్రభుత్వం ముందు రక్షణ శాఖ ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న వాహనదారులకు ఊరట కల్పించేందుకు ఉద్దేశించిన రెండు ఎలివేటెడ్ కారిడార్లకు అవసరమైన 100 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రక్షణ శాఖ పెద్ద డిమాండ్‌నే రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ కూడలి నుంచి రాజీవ్ రహదారిపై శామీర్‌పేట వరకు, ప్యాట్నీ కూడలి నుంచి నిజామాబాద్ హైవేపై సుచిత్ర కూడలి వరకు రెండు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ రహదారుల నిర్మాణానికి కచ్చితంగా రక్షణ శాఖ భూములు సమీకరించాల్సి ఉంది.
ఇందుకు అంగీకరిస్తే దాదాపు 100 ఎకరాల భూమిని రక్షణ శాఖ కోల్పోవాల్సి వస్తుంది. ఈ భూమికి ప్రతిగా హైదరాబాద్ శివారులోని జవహర్‌నగర్ పరిధిలో 500 ఎకరాల భూమి, రూ.96 కోట్ల నగదు ఇవ్వాలని తాజాగా రక్షణ శాఖ ప్రతిపాదించింది. రెండు రోజుల కింద ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులతో రోడ్లు, భవనాల శాఖ అధికారి సునీల్‌శర్మ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ భూమిపై దాదాపు కొలిక్కి తెచ్చారు.
ఫైరింగ్ రేంజ్ కోసం..
రక్షణ శాఖ చాలాకాలం నుంచి రాష్ట్రంలో ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు యత్నిస్తోంది. ఇందుకు రంగారెడ్డి జిల్లా, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో పలు ప్రాంతాల్లో భూమిని పరిశీలించింది. జవహర్‌నగర్ పరిధిలోకి వచ్చే యాప్రాల్ వద్ద తాత్కాలిక పద్ధతిలో ఫైరింగ్ రేంజ్ నిర్వహిస్తోంది. 503 ఎకరాల భూమిని 1995లో లీజు పద్ధతిలో ప్రభుత్వం నుంచి పొంది ఫైరింగ్ రేంజ్‌గా వాడుకుంటోంది. 2011లో లీజు గడువు పూర్తయింది. దీంతో ఆ స్థలాన్ని వెనక్కు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు లేఖలు రాసింది. అయితే దాన్ని తమకే అమ్మాలని కోరుతున్న రక్షణ శాఖ ఆ భూమిని ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించలేదు.
ఇప్పుడు కంటోన్మెంట్‌లో 100 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా ఈ భూమి ఇవ్వాలని లింకు పెట్టింది. కంటోన్మెంట్ భూములు అతి ఖరీదైనవి అయినందున ఈ 503 ఎకరాలతో పాటు మరో రూ.96 కోట్లు కూడా ఇవ్వాలని అడిగింది. దీనిపై రాష్ట్ర అధికారులు ప్రభుత్వంతో సంప్రదించి సూత్రప్రాయ అంగీకారం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు రాష్ట్రానికి నివేదిక సమర్పించారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.