బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు రక్షా మంత్రి అవార్డులు
ఢిల్లీలో అందజేసిన రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ శాఖ పరిధిలోని పబ్లిక్ సెక్టార్ సంస్థ (డీపీఎస్‌యూ)లకు రక్షణ శాఖ అందించే రక్షా మంత్రి అవార్డులు హైదరాబాద్‌లోని పలు సంస్థలకు దక్కాయి. 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను మంగళవారం కేంద్ర రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో అందజేశారు. 2014–15 సంవత్సరానికి సంస్థల విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఎగుమతుల్లో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గోవాకు చెందిన గోవా షిప్‌యార్డ్ రక్షా మంత్రి అవార్డులు అందుకున్నాయి. డివిజన్, ఫ్యాక్టరీ, షిప్‌యార్డు విభాగంలో ఉత్తమ డీపీఎస్‌యూ డివిజన్ కేటగిరీలో హైదరాబాద్‌కు చెందిన హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్, ఉత్తమ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ విభాగంలో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఈ అవార్డులను కైవసం చేసుకున్నాయి. బృందం, వ్యక్తిగత విభాగంలో సృజనాత్మక కేటగిరీలో హైదరాబాద్‌కు చెందిన మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లోని డిజైన్ అండ్ ఇంజనీరింగ్ డివిజన్ ఈ అవార్డులను కైవసం చేసుకున్నాయి.
2015–16 సంవత్సరానికి: 2015–16 ఆర్థిక సంవత్సరానికి ఉత్తమ డివిజన్, ఫ్యాక్టరీ విభాగంలో మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి అవార్డు దక్కింది. బృందం, వ్యక్తిగత విభాగంలో సృజనాత్మక కేటగిరీలో విశాఖపట్నంలోని హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు చెందిన షిప్‌బిల్డింగ్ డివిజన్, ఇంజనీరింగ్ షిప్ రిపేర్ కాంప్లెక్స్, ఇంజనీరింగ్ విభాగం సంయుక్తంగా అవార్డు దక్కించుకున్నాయి. మెదక్ జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నెలకొల్పిన 16 మెగా వాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టును వీడియో లింక్ ద్వారా జైట్లీ ప్రారంభించారు.