
ఆర్మీ, రెవెన్యూ ‘ఫైరింగ్’ రేంజ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రక్షణశాఖ ఆధీనంలో ఉన్న భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కిచ్చేందుకు మొండికేసింది. గడువు ముగియడంతో స్థల స్వాధీనానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై తిరగబడింది. శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో సర్వే నంబర్ 502-937 వరకు గల 617 ఎకరాలను ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అవసరాల కోసం 1968లో రాష్ట్ర సర్కారు కేటాయించింది. క్షిపణుల ప్రయోగం, ఆయుధాల పరీక్షలకు ఈ భూమిని రక్షణ శాఖ వాడుకుంటోంది.
రెండేళ్ల క్రితం కాలపరిమితి ముగియడంతో స్థలాన్ని ఖాళీ చేయాలని జిల్లా యంత్రాంగం కోరింది. అయితే, నిర్దేశిత ఫైరింగ్ రేంజ్ పరిసరాల్లో ఇబ్బడిముబ్బడిగా జనావాసాలు రావడం, నగరీకరణ నేపథ్యంలో లీజు పొడగింపునకు అభ్యంతరం వ్యక్తంచేసింది. దీనికితోడు ఫైరింగ్ రేంజ్ సమీపాన ఔటర్ రింగ్‌రోడ్డు కూడా ఉండడంతో ప్రమాదకరమని భావించిన హెచ్‌ఎండీఏ కూడా లీజు పొడిగించకూడదని ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఈ అంశాలను పరిగణనలో తీసుకున్న కలెక్టర్ రఘునందన్‌రావు మార్చిలో లీజును రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన స్థానిక తహసీల్దార్ దేవుజాకు ఆర్మీ అధికారుల నుంచి చుక్కెదురైంది. ‘సర్కారు స్థలం’గా పేర్కొంటూ బోర్డులు పాతేందుకు చేసిన ప్రయత్నాన్ని ఆర్మీ అధికారులు అడ్డుకున్నారు. ఈ భూమిపై రెవెన్యూశాఖకు ఎలాంటి హక్కులు లేవ ని.. ఇది పూర్తిగా తమకే చెందుతుందని వాదనకు దిగారు. అంతేగాకుండా బోర్డులు ఏర్పాటు చేస్తే.. చర్యలు తీసుకుంటామని తమదైన శైలిలో హెచ్చరించారు.
దీంతో వెనక్కి తగ్గిన రెవెన్యూ అధికారులు ఈ విషయాన్ని డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లారు. భూమిని స్వాధీనం చేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడితే ఖాళీ చేస్తాం తప్ప.. వాదనలు అనవసరమని తెగేసి చెప్పారు. దీంతో చేసేదిలేక రెవెన్యూ గణం వెనుదిరిగింది.
ఇదిలావుండగా, సర్కారు భూమిలో పాగా వేయడమేగాకుండా.. ఖాళీ చేయించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను ఆర్మీ జవాన్లు అడ్డుకున్న సంఘటనను జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. దీంతో జరిగిన పరిణామాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ వ్యవహారంపై రక్షణశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సానుకూలంగా పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.