
తొలి ఫొటో..
- భూమిపై కూలనున్న సోవియట్ అంతరిక్ష నౌక!
- శుక్ర గ్రహంపై దిగాల్సిన ల్యాండర్
- ప్రయోగం విఫలమై 53 ఏళ్లుగా భూకక్ష్యలోనే
- మే 8-11 తేదీల్లో భూమిపై కూలే అవకాశం.
సోవియట్ యూనియన్ ఎప్పుడో అర్ధ శతాబ్దం క్రితం ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘కాస్మోస్ 482’ త్వరలో భూమిపై కూలబోతోంది. మే నెల 8-11 తేదీల మధ్య అది భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. శుక్ర గ్రహాన్ని పరిశోధించడానికి 1972 మార్చి 31న సోవియట్ ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. వాస్తవానికి ‘కాస్మోస్ 482’ ఓ లాండింగ్ మాడ్యూల్. 495 కిలోల ల్యాండరును శుక్రగ్రహంపై దింపడం ఈ మిషన్ ఉద్దేశం. సాంకేతిక లోపం తలెత్తి ప్రయోగం విఫలమవడంతో ‘కాస్మోస్ 482’ స్పేస్ క్రాఫ్ట్ ముందుకు ప్రయాణించడానికి అవకాశం లేక భూకక్ష్యలోనే ఇరుక్కుపోయింది. గత 53 సంవత్సరాలుగా అది భూమి కక్ష్యలోనే పరిభ్రమిస్తోంది.
ఇప్పుడు కూలే సమయం ఆసన్నమవడంతో శాస్త్రవేత్తలు దాని ఆర్బిటల్ ఎత్తును నిరంతరాయంగా గమనిస్తున్నారు. అంతరిక్ష నౌక కచ్చితంగా ఏ తేదీన భూమిపై కూలుతుందో త్వరలో తెలుస్తుంది. మే 8-11 తేదీల్లో ‘కాస్మోస్ 482’ భూమిపై కూలవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ... ‘సూర్యుడి క్రియాశీలత’ ప్రభావంతో సదరు తేదీలకు కాస్త ముందుగా గానీ, లేదా ఆ తర్వాత గానీ నౌక కూలే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే సూర్యుడి క్రియాశీలత అధికంగా ఉంటే భూమి ఎగువ వాతావరణం త్వరగా వేడెక్కి వ్యాకోచిస్తుంది. ఫలితంగా దిగువ కక్ష్యలో పరిభ్రమించే వస్తువులను భూ వాతావరణం త్వరితగతిన లాక్కుంటుంది. అంటే ‘కాస్మోస్ 482’ అంతరిక్ష నౌక మనం అనుకున్న సమయం కంటే ముందుగానే కూలిపోవచ్చు.
52 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల్లో కూలవచ్చు!
భూ వాతావరణంలోకి అనియంత్రిత ప్రవేశం’ కనుక ‘కాస్మోస్ 482’ స్పేస్ క్రాఫ్ట్ భూమిపై ఏ ప్రాంతంలో కూలిపోతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ ప్రస్తుతం నౌక కక్ష్యను పరిశీలిస్తే భూమిపై 52 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 52 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య గల సువిశాల ప్రదేశంలో... అంటే ఉత్తరాన బ్రిటన్ మొదలుకొని దక్షిణాన న్యూజిలాండ్ దాకా ఎక్కడైనా అది కూలవచ్చు. భూమిపై జలావరణమే అధికం కనుక నౌక నేలపై కాకుండా సముద్రాల్లో కూలిపోయే అవకాశాలే ఎక్కువ.
సముద్ర ప్రదేశాలు కాకుండా భూభాగంపై లేదా జనావాస ప్రాంతాలపై అది కూలిపోయే అవకాశాలు స్వల్పమే అయినప్పటికీ ఓ అంశం శాస్త్రవేత్తలను కొంచెం కలవరపెడుతోంది. ‘కాస్మోస్ 482’కు ఓ విశిష్టత ఉంది. అది ‘వెనెరా’ మిషన్ ల్యాండర్ల తరహా అంతరిక్ష నౌక. శుక్ర గ్రహంపై దిగేటప్పుడు అక్కడి కఠినాతి కఠినమైన అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర పీడనాన్ని తట్టుకునేలా ‘కాస్మోస్ 482’ను రూపొందించారు.
సాధారణంగా ఖగోళ వస్తువులు భూవాతావరణంలోకి ప్రవేశించాక గాలి ఒరిపిడికి మండిపోయి చిన్న శకలాలుగా రాలిపోతాయి. వాటిలోని పెద్ద, బరువైన భాగాలు మాత్రమే భూమిని తాకుతాయి. డిజైన్ ప్రత్యేకత దృష్ట్యా ‘కాస్మోస్ 482’ మాత్రం భూ వాతావరణంలోకి ప్రవేశించినా ధ్వంసం అవదు. సముద్రాల్లో కాకుండా అది భూభాగంపై కూలిపోవడమంటూ సంభవిస్తే... ఏమాత్రం చెక్కు చెదరకుండా 495 కిలోల ‘కాస్మోస్ 482’ ధడేల్మని ‘ఒకే ముక్క’గా నేల రాలుతుంది! అలా చిన్న ఉల్క మాదిరి ప్రభావం చూపుతుంది. శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తున్న అంశం ఇదే.
- జమ్ముల శ్రీకాంత్