వారు వెనక్కిరాక తప్పదు
- టీఆర్‌ఎస్‌లో చేరిన వారిపై రక్షణ శాఖ మంత్రి పరీకర్
- రాష్ట్రంలో బీజేపీ ఎదగడానికి చాలా అవకాశాలు
- బీజేపీ పదాధికారులు, కార్యవర్గ సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఇష్టారాజ్యంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, కానీ ఆ పార్టీలో చేరుతున్నవారంతా తిరుగుముఖం పట్టక తప్పదని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో పార్టీ పదాధికారులు, కార్యవర్గ సభ్యుల సమావేశం ఓ హోటల్‌లో జరిగింది. కేంద్రమంత్రి మనోహర్ పరీకర్ ప్రారంభోపన్యాసం చేస్తూ తెలంగాణలో వాస్తుపాలన కొనసాగుతున్నదన్నారు. స్వంతగా బలపడాలే తప్ప పార్టీ ఫిరాయింపులు ఎక్కువ కాలం పనికిరావని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయని ఆయన విశ్లేషించారు. ముందుగా ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగితే అధికారం అదే సాధ్యమవుతుందన్నారు. మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలో కొంత వెనకబడ్డామన్నారు. జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర శాఖతో కొంత సమాచారలోపం ఉన్నట్టుగా కనిపిస్తోందని, భవిష్యత్తులో అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పరీకర్ చెప్పారు. కాగా, పరీకర్ ప్రసంగంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అని సంబోధించడంతో పార్టీ నేతలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
టీఆర్‌ఎస్ పాలన దారి తప్పింది: లక్ష్మణ్
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పాలన దారి తప్పిందన్నారు. అభద్రతాభావంతో ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని విమర్శిం చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని, పార్టీ ఫిరాయింపులతోనే సమ యం గడిపేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం 80 వేల ఇళ్లను మంజూరుచేసినా రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదన్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్‌తో ప్రభుత్వం కాంట్రాక్టర్లకు మేలు చేస్తోందని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రూ.700 కోట్లు ఇస్తే వాటిని రైతులకు ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం నిద్రపోతున్నదన్నారు.
భూసేకరణ చట్టాన్ని అమలుచేయకుండా తూట్లు పొడిచేవిధంగా జీఓ 123 తెచ్చిం దని విమర్శించారు. టీఆర్‌ఎస్ నేతలు అవగాహన లేకుండా, అబద్ధాలు మాట్లాడుతున్నారని లక్ష్మణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదనడం ఎంపీ కవిత అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలపై టీఆర్‌ఎస్ దుష్ర్పచారం చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. పార్టీ శాసనసభాపక్షనేత జి.కిషన్‌రెడ్డి, అగ్రనేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, ఎన్.రామచందర్‌రావు, వెదిరె శ్రీరాం, ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, పేరాల చంద్రశేఖర్‌రావు, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.