ప్రాణహితపై సర్వే అంశాలు యథాతథంగా ఇవ్వలేమంటున్న సర్వే ఆఫ్ ఇండియా
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పులో భాగంగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నిర్మించదలిచిన బ్యారేజీ పరివాహక ప్రాంతంలో అత్యాధునిక పద్ధతిలో నిర్వహించిన లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ (లైడార్) సర్వే వివరాలను యథాతథంగా ఇచ్చేందుకు సర్వే ఆఫ్ ఇండియా కొర్రీలు పెడుతోంది. సర్వే ద్వారా తీసిన త్రీడీ, టోఫోగ్రఫిక్ చిత్రాలను అన్నింటినీ ఇవ్వడం కుదరదని, ఏ వివరాలు, ఎందుకు కావాలో కోరితే ఆ వివరాలే సమర్పిస్తామని ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా ప్రభుత్వం చెక్‌లిస్ట్‌ని సర్వే ఆఫ్ ఇండియాకు పంపినట్లుగా తెలిసింది.
గోదావరి నీటిని తీసుకునేందుకు ప్రతిపాదించిన కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఇచ్ఛంపల్లి మార్గాల వద్ద గత నెలలో మొదటి విడత లైడార్ సర్వే జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మిడ్‌మానేరు నుంచి తడ్కపల్లి, పాములపర్తి, నిజాంసాగర్‌ల మధ్య రెండో విడత సర్వే కొనసాగుతోంది. సర్వేలో భాగంగా హెలికాప్టర్ ద్వారా లేజర్ కిరాణాలు పంపి దూరాలు, లోతును కొలిచే పనిని పూర్తిచేశారు. దీనిద్వారా సర్వే చేసిన ప్రాంతంలో రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంతో త్రీడీ చిత్రాలను తీయవచ్చు.
తొలి విడత సర్వేలో ఈ ప్రక్రియంతా పూర్తయింది. అయితే ఈ వివరాలను పూర్తిగా ఇవ్వడానికి సర్వే ఆఫ్ ఇండియా ఒప్పుకోవడం లేదు. దీంతో అధికారులు తమ అవసరాలను పేర్కొంటూ సర్వే ఆఫ్ ఇండియాకు జాబితా పంపారు. వీటిని పరిశీలించాక సర్వే ఆఫ్ ఇండియా ఒక బ్యాచ్ నంబర్‌ను రాష్ట్రానికి ఇస్తుంది. నంబర్‌ను తీసుకొని కేంద్ర రక్షణ శాఖ వద్దకు వెళితే ఏయే వివరాలు కావాలో వాటిని మాత్రమే రాష్ట్రానికి ఇస్తారని తెలుస్తోంది.
లైడార్ సర్వే వివరాలు సెన్సార్!
Published Thu, Oct 8 2015 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM
Advertisement
Advertisement