ముంబై: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై పోటీకి సిద్ధంగా ఉన్నట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే కుమారుడైన నితేష్ రాణే ప్రకటించారు. ఆయన కొల్హాపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఆదేశిస్తే రాష్ట్రంలో ఏ అసెంబ్లీ స్థానం నుంచైనా ఉద్ధవ్ ఠాక్రేపై పోటీచేసి తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
‘పాపం ఉద్ధవ్ ఠాక్రే.. ముఖ్యమంత్రి కావాలని కలలు గంటున్నాడు.. ఆయన పార్టీకి ఏ నియోజకవర్గంలోనూ పట్టులేదు.. సీఎం పదవి వరకు ఎందుకు.. ఉద్ధవ్‌కు సర్పంచ్‌గా కూడా గెలిచే సత్తాలేదు..’ అని ఎద్దేవా చేశారు. ‘ముఖ్యమంత్రి కావాలని ఎవరైనా అనుకోనొచ్చు.. చివరకు ఇటీవల ఆర్పీఐలో చేరిన సినీనటి రాఖీ సావంత్ కూడా సీఎంను కావాలని కలగనొచ్చు.. ’ అని రాణే వ్యాఖ్యానించారు. కన్కవాలీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని, అక్కడి ప్రజలతో సత్సంబంధాలకు ఇప్పటినుంచే కార్యాచరణ చేపట్టాలని తన తండ్రి నారాయణ్ రాణే సూచించారని తెలిపారు. కాగా, ఇప్పటికే తాను స్థానిక నాయకులు, కార్యకర్తలతో మాట్లాడానని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో తాను కొన్ని కారణాల వల్ల ఓడిపోయానని, ఈసారి మాత్రం గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వారసత్వాలు, బంధుత్వాలకు తావులేదని, గెలుపుగుర్రాలకే ప్రాధాన్యత ఇస్తామని ఇటీవల సీఎం చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. ‘ఆయన నన్ను ఒక్కడినే టార్గెట్ చేశారని అనుకోవడంలేదు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే కుమార్తె ప్రణతి షిండే, మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు అమిత్ దేశ్‌ముఖ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అలాగే ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే కుమారుడు రాహుల్ ప్రస్తుతం ఎన్నికల్లో పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు.. అందువల్ల సీఎం నన్ను ఒక్కడినే దృష్టిలో పెట్టుకుని ఆ వ్యాఖ్యలు చేశారనుకోవడంలేద’న్నారు.
ఉద్ధవ్‌పై పోటీకి సిద్ధం
Published Fri, Aug 15 2014 10:40 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement