సాక్షి, ముంబై: శివసేన దసరా ర్యాలీ ఈసారి కూడా వార్తల్లోకెక్కింది. శివాజీ పార్కులో ఏటా నిర్వహించే ఈ ర్యాలీపై కోర్టు కొంతకాలంగా అనేక ఆంక్షలు విధిస్తోంది. దీంతో ర్యాలీ నిర్వహణకు కోర్టు అనుమతిని ఇస్తుందా? లేదా? అనే కథనాలతో వార్తల్లో నిలిచే ఈ ర్యాలీ ఈసారి మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, సంధిస్తున్న వ్యంగ్యాస్త్రాలతో వార్తల్లోకెక్కింది. ఇప్పటిదాకా నిర్వహించిన ప్రతి ర్యాలీలో శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్‌ఠాక్రే పాల్గొనేవారు. ఆయన ప్రసంగమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. అయితే ఠాక్రే మరణించడంతో ఆయన లేకుండా జరుపుకుంటున్న తొలి ర్యాలీ ఇదేనని చెప్పవచ్చు.
గతంలో బాల్‌ఠాక్రే ఆరోగ్యం బాగాలేకపోయినా ముందుగా రికార్డు చేసిన ప్రసంగాన్ని ర్యాలీలో ప్రసారం చేశారు. అయితే ఈసారి ఆయన ప్రసంగం లేకుండానే ర్యాలీ నిర్వహించాల్సిన పరిస్థితి. దీనిని ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుంటున్నాయి. పరిశ్రమలశాఖ మంత్రి నారాయణ రాణే కుమారుడైన నితేశ్ రాణే ఈ ర్యాలీనుద్దేశించి విమర్శలు చేశారు. శివాజీపార్‌కలో ఈ సారి జరగనున్న దసరా ర్యాలీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం ట్విటర్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ‘ఏటా శివాజీ పార్‌కలోని దసరా ర్యాలీలో పులి గాండ్రించేది. ఇప్పుడు ఆ లోటు ఎవరు తీరుస్తారు.
ఈ సారి పులి గాండ్రింపులకు బదులుగా మ్యావ్... మ్యావ్ మంటూ పిల్లి కూతలు వినాల్సిందే. ఎప్పటిలా ధ్వని ఎన్ని డెసిబుల్‌స దాటిందో లెక్కించాల్సిన అవసరం కూడా ఉండదు’ అంటూ నితేశ్ చేసిన వ్యాఖ్యలపై శివసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నితేశ్ ట్విటర్‌లో రాసిన ప్రతి అక్షరం తమ నేత ఉద్ధవ్‌ను ఉద్దేశించే రాశారంటూ మండిపడుతున్నారు. ఉద్ధవ్‌ను పిల్లితో పోల్చడాన్ని శివసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉన్న ఇటువంటి సమయంలో నితేశ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రత్యర్థులను రెచ్చగొట్టడమేంటంటూ రాజ కీయ విశ్లేషకులు కూడా తప్పుబడుతున్నారు. రాజకీయంగా ఎంత వైరమున్నా ఠాక్రే లేకుండా ర్యాలీ నిర్వహిస్తున్న శివసేనకు అండగా నిలిస్తే వ్యక్తిగతంగా నితేశ్ ప్రతిష్ట పెరిగేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఉద్ధవ్‌ఠాక్రేపై ట్విటర్‌లో నితేశ్ రాణే పరోక్ష విమర్శలు
Published Thu, Oct 10 2013 1:34 AM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM
Advertisement
Advertisement