చిక్కుల్లో నితేశ్ రాణే
ముంబై: పరిశ్రమలశాఖ మంత్రి నారాయణ్ రాణే తనయుడు, స్వాభిమాన్ సంఘటన సంస్థ అధ్యక్షుడు నితేశ్ రాణే చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. స్వాభిమాన్ సంఘటన కార్యాలయంలో చింటూ షేక్‌పై కాల్పులు జరిపిన కేసులో రాణే నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ హత్యాయత్నం కేసుకు సంబంధించి ఫైలును మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ రెండోసారి చేసిన అభ్యర్థనను స్థానిక మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది.
ఆగస్టు, 2013లో కూడా నితేశ్ రాణే కేసును మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది. అప్పుడు తిరస్కరించిన కోర్టు తాజాగా మరోసారి కూడా తిరస్కరించింది. దీంతో కేసు దర్యాప్తును కొనసాగించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై నితేశ్ తరఫు న్యాయవాది పర్వేజ్ మీనన్ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ... ‘కేసు మూసివేసేందుకు అనుమతిని ఇవ్వాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనను తిరస్కరించడానికిగల రెండు కారణాలను కోర్టు తెలిపింది. సీబీఐ సమర్పించిన నివేదికను తాము అంగీకరించకపోవడం మొదటి కారణమైతే కేసు బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున మూసివేతకు అంగీకరించలేమని తెలిపింద’న్నారు.
ఆగస్టు, 2013లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి చింటూ షేక్ సెప్టెంబర్ 23న పొవాయి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు. ఖార్‌లోని స్వాభిమాన్ సంఘటన కార్యాలయంలో తనపై నితేశ్ రాణే రెండుసార్లు కాల్పులు జరిపారని, అందులో ఓ బుల్లెట్ తన చెంపను చీల్చుకుంటూ వెళ్లిందన్నారు. దీంతో తాను తీవ్రంగా గాయపడ్డానని పిటిషన్‌లో ఆరోపించారు. దీంతో భారత శిక్షాస్మృతి, సెక్షన్ 307 ప్రకారం నితేశ్ రాణేపై పొవాయి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసులో పొవాయి పోలీసుల దర్యాప్తు అనుమానాస్పదంగా ఉందని పేర్కొంటూ బాంబే హైకోర్టు 2011, మార్చిలో సీబీఐకి అప్పగించింది.
కేసును దర్యాప్తు చేసిన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నితేశ్ రాణేకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని మార్చి 2012లో ఓ నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను సవాలు చేస్తూ చింటూ షేఖ్ కోర్టులో పిటిషన్ వేశారు. మళ్లీ దర్యాప్తు చేయాలని పిటిషన్‌లో కోరారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు మళ్లీ దర్యాప్తు ప్రారంభించి ఆగస్టులో కేసును మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అందుకు కోర్టు తిరస్కరించడంతో మళ్లీ ఈ ఏడాది మే 20వ తేదీన తుది నివేదికనిచ్చిన సీబీఐ కేసును మూసివేసేందుకు అనుమతిని ఇవ్వాలని మంగళవారం కోరింది. రెండోసారి కూడా కోర్టు తిరస్కరించింది.