చేప విసిరి కొట్టిన ఎమ్మెల్యే అరెస్టు
ముంబయి: ఆగ్రహంతో అధికారి పైకి చేప విసిరి కొట్టిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నితేష్ రాణేను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీసులే ధృవీకరించారు. రాణేతో సహా మొత్తం 23మందిని అరెస్టు చేసి తీర కొంకణ్ కోర్టులో హాజరుపరిచినట్లు వివరించారు. విధుల్లో ఉన్న ఓ ప్రభుత్వ అధికారిపై కుట్రపూరితంగా దాడికి పాల్పడటమే కాకుండా అల్లర్లకు పాల్పడటం, నేరపూరిత ఆలోచనతో దాడి చేయడం వంటి ఆరోపణలు వివిధ సెక్షన్ల కింద నమోదు చేశారు.
ముంబయిలో గత గురువారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన నితేష్ రాణే ఓ ప్రభుత్వాధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మత్యశాఖకు చెందిన కమిషనర్‌తో మాట్లాడుతూ కోపాన్ని ఆపుకోలేక అక్కడే ఉన్న ఓ చేపను ఆయనపై విసిరి కొట్టాడు. చేయి కూడా చేసుకోబోయి ఊగిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్ ఇంట్లో అడుగుపెట్టి తెగ వైరల్ అయింది. తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని పలువురు మత్స్యకారులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నితేష్‌ను కలిసిన నేపథ్యంలో అడిగేందుకు వెళ్లిన ఎమ్మెల్యే ఇలా దాడికి పాల్పడి బుక్కయ్యారు.