సాక్షి, ముంబై: టోల్‌నాకా సిబ్బందిపై దాడికి పాల్పడినందుకు స్వాభిమాన్ సంఘటన్ సంస్థ అధ్యక్షుడు నితేశ్ రాణే సహా పదిమందిని పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. అదే రోజు రాత్రి పొద్దుపోయాక పోలీసులు వీరిని ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా నితేశ్ తోపాటు మరో నలుగురిని బెయిల్‌పై విడుదల చేసింది. నితేశ్‌ని అరెస్టు చేసినట్లు తెలియగానే ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ముందు జాగ్రత్తచర్యగా పోలీసు బలగాలను మోహరించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సింధుదుర్గ్ జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ముంబై-గోవా జాతీయ రహదారిపై ధార్గల్-పేడ్నే టోల్ నాకా ఉంది. ఆరు నెలల క్రితం నుంచి గోవాకి వెళ్లే పర్యాటకుల వద్ద నుంచి అక్కడ ప్రవేశ రుసుంవసూలు చేస్తున్నారు. అయితే సింధుదుర్గ్ జిల్లా వాహనాలకు మినహాయింపు ఇచ్చారు.
మంగళవారం సాయంత్రం నితేశ్ రాణే, మరికొందరు ఈ టోల్‌నాకా మీదుగా వాహనంలో వెళుతుండగా ఆపిన అక్కడి సిబ్బంది ప్రవేశ రుసుము చెల్లించాలని అడిగారు. ఇందుకు నితేశ్ స్పందిస్తూ తాను సింధుదుర్గ్ ప్రాంతవాసినేనని, అందువల్ల డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అయితే రాణే వాహన సంఖ్య సింధుదుర్గ్ జిల్లాకు చెందినది కాకపోవడంతో డబ్బులు చెల్లించాల్సిందేనంటూ టోల్‌నాకా సిబ్బంది పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో సిబ్బంది, రాణే మద్దతుదారుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన రాణే మద్దతుదారులు టోల్‌నాకా కార్యాలయం అద్దాలను పగుల గొట్టారు. అంతటితో ఊరుకోకుండా సిబ్బందిపై చేయిచేసుకున్నారు.
ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పేడ్నే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రాణేతోపాటు తొమ్మిది మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ సమీపంలోని అంజునా కారాగారానికి తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరైంది. ఈ విషయం తెలుసుకున్న నితేశ్ సోదరుడు, ఎంపీ నీలేశ్ రాణే తన మద్దతుదారులతో అక్కడి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సోదరుడి తరఫున బహిరంగ క్షమాణలు కోరుతున్నానన్నారు. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానన్నారు. సింధుదుర్గ్ జిల్లా పరిధిలోని పేడ్నే పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
నితేశ్ రాణే అరెస్టు
Published Thu, Dec 5 2013 6:04 AM | Last Updated on Tue, Aug 28 2018 4:00 PM
Advertisement
Advertisement