ముంబై: హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి నారాయణ్ రాణె కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణె బుధవారం సాయంత్రం సింధుదుర్గ్ జిల్లా కోర్టులో లొంగిపోయారు. దీంతో జిల్లాకోర్టు ఆయనను జ్యూడీషియల్ కస్టడీకి పంపించినట్లు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరట్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. నితేష్ రాణెను పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టులో వాదించాల్సి ఉందని తెలిపారు. అంతకుముందే బోంబే హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు. కోర్టులో రాణె లొంగిపోతానని, విచారణకు సహకరిస్తానని ఒప్పుకున్నట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.
నితేశ్ రాణేకు కోర్టులో చుక్కెదురు
బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణెకు సింధుదుర్గ్ జిల్లా సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. అరెస్టుకు ముందు బెయిల్ ఇవ్వాలని పెట్టుకున్న దరఖాస్తును మంగళవారం సెషన్స్ కోర్టు తిరస్కరించింది. దీంతో నితేష్ రాణె అరెస్టు విషయం ఆయన మెడపై వేలాడుతున్న కత్తిలా తయారైంది. డిసెంబరు 18న సింధుదుర్గ్ జిల్లా బ్యాంకు ఎన్నికల ప్రచార సభలో శివసేన కార్యకర్త సంతోష్ పరబ్‌పై దాడి జరిగింది.
ఈ దాడి ఘటన వెనుక నితేష్ రాణెతోపాటు ఆయన సహచరుడు గోట్యా సావంత్ హస్తముందని ఆరోపిస్తూ స్థానిక కణకావ్లీ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే రాణే అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని స్థానిక కణకావ్లీ సివిల్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అందుకు సివిల్ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించా రు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు సింధుదుర్గ్ జిల్లా సెషన్స్ కోర్టునే ఆశ్రయిం చాలని సలహా ఇచ్చింది. ఆయనకు రక్షణ కల్పిస్తూ పది రోజుల వరకు అరెస్టు చేయవద్దని కూడా ఆదేశించింది.
దీంతో ఆయనకు ఊరట లభించింది. అయితే జనవరి 31నాటి విచారణలో నితేష్ రాణె తరఫు న్యాయవాది సతీశ్ మాన్‌షిండే, ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రదీప్ ఘరత్ ఈ అంశంపై వాదనలు విన్పించారు. తీర్పు మంగళవారం మధ్యాహ్నం వెల్లడిస్తామని చెప్పి వాయిదా వేశారు. వాదోపవాదాల అనంతరం నితేష్ రాణె బెయిల్ దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment