పిల్లల్లో దొడ్డికాళ్లు, కారణాలు తెలుసుకోండి! | Know the main cause of bow legs in Babies and treat it well | Sakshi
Sakshi News home page

పిల్లల్లో దొడ్డికాళ్లు, కారణాలు తెలుసుకోండి!

Published Tue, Nov 26 2024 4:53 PM | Last Updated on Tue, Nov 26 2024 4:58 PM

Know the main cause of bow legs in Babies and treat it well

మూడేళ్లు... విల్లు కాళ్లు 

సరిచేద్దాం 

పిల్లల్లో మోకాళ్ల వద్ద దూరం ఎక్కువగా ఉండి, చిన్నారుల అరికాళ్లు దగ్గరగా ఉంచినప్పుడు ఈ రెండు కాళ్లూ బయటివైపునకు విల్లులా ఒంగి ఉండే కండిషన్‌ను ఇంగ్లిష్‌లో బౌడ్‌ లెగ్స్, వైద్యపరిభాషలో జీనూవేరమ్‌ అంటారు. తెలుగు వాడుక భాషలో ఈ కండిషన్‌ను ‘దొడ్డికాళ్లు’ అంటుంటారు. 

నిజానికి పుట్టిన పిల్లలందరూ చిన్నతనంలో కొన్నిరోజుల  పాటు ఎంతోకొంత దొడ్డికాళ్ల (బౌడ్‌ లెగ్స్‌) కండిషన్‌ను కలిగి ఉంటారు. శిశువు తన పిండ దశలో దగ్గరగా ముడుచుకుని (ఫోల్డెడ్‌  పొజిషన్‌లో) ఉండటమే దీనికి కారణం. అందువల్ల అప్పుడే  పుట్టిన పిల్లల్లో కాళ్లు ఇలా ఉండటం చాలా సాధారణం. 

పిల్లలు నడక మొదలు పెట్టాక, వాళ్లు తమ కాళ్లపై కొంత బరువు మోపుతుండటం మొదలుకావడంతో... అంటే... ఒకటిన్నర–రెండు సంవత్సరాలప్పటి నుంచి వాళ్ల కాళ్లు మామూలుగా కావడం మొదలవుతుంది. దాదాపు మూడేళ్ల వయస్సు వచ్చేసరికి కాళ్లు రెండూ నార్మల్‌ షేప్‌కు వస్తాయి. 

ఒకవేళ చిన్నారుల్లో వారు మూడేళ్లు పైబడ్డాక కూడా బౌడ్‌ లెగ్స్‌ (సివియర్‌ బౌడ్‌ లెగ్స్‌) కండిషన్‌ ఎక్కువగా కనిపిస్తుంటే అందుకు కారణాలు ఏమై ఉంటాయా అని ముందుగా ఆలోచించాలి. అంటే ఆ పరిస్థితికి... రికెట్స్‌ వంటి వ్యాధులు గానీ; లేదా   లెడ్‌ (సీసం), ఫ్లోరైడ్స్‌ వంటి విష పదార్థాల ప్రభావం ఎక్కువ కావడం గానీ; లేదా ఎముకల షేప్‌ మారడం (బోన్‌ డిస్‌ప్లేసియాస్‌) వంటివి గానీ కారణం కావచ్చా అని ఆలోచించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాలతోనే ఒకవేళ బౌడ్‌ లెగ్స్‌ వచ్చి ఉంటే, దాన్ని కాస్తంత తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ జీనూవేరమ్‌ కండిషన్‌ ఉన్న పిల్లలకు ఎక్స్‌రే, రక్తపరీక్షల వంటివి చేసి కారణాలను నిర్ధారణ చేయాలి. కారణం తెలిశాక తగిన చికిత్స అందించాలి. 

అయితే మొదట్లో ఈ బౌడ్‌ లెగ్స్‌ కండిషన్‌ కనిపిస్తున్నప్పటికీ చిన్నారుల్లో మూడేళ్ల వయసు వచ్చే వరకు ఈ సమస్య గురించి ఆలోచించాల్సిన లేదా ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. మూడేళ్ల తర్వాత కూడా అలాగే ఉంటే మాత్రం అప్పుడు పిల్లల నిపుణులను లేదా ఆర్థోపెడిక్‌ నిపుణులను తప్పక  సంప్రదించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement