legs problems
-
ఎటపాక మండలంలోనూ కాళ్లవాపు లక్షణాలు
నెల్లిపాక : ఏజెన్సీలో ఆందోళన కలిగిస్తున్న కాళ్లవాపు వ్యాధి లక్షణాలు ఎటపాక మండలంలో కూడా కనిపిస్తున్నాయి. గౌరిదేవిపేట పంచాయతీలోని బాడిసవారి గుంపులోని ముగ్గురు గిరిజనులకు ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కాళ్లవాపుతో వీఆర్‌పురం మండలంలో వరుస మరణాలు సంభవిస్తుండడంతో బాడిసవారి గుంపు వాసులు ఆందోళన చెందుతున్నారు. మాజీ సర్పంచ్ కారం వెంకట్రావుకు కొన్ని రోజుల క్రితం జ్వరం వచ్చి తగ్గింది. అప్పటి నుంచీ కీళ్ల నొప్పులతో పాటు, పది రోజులుగా కాళ్లవాపు కూడా ఉందని ఆయన తెలిపారు. అదేవిదంగా మడకం భద్రమ్మ, గుండి రాంబాబులకు కూడా కాళ్లు వాపుగా ఉన్నట్టు కనపడుతున్నాయి. కాళ్లు, చేతులు, కీళ్లు తీవ్రమైన నొప్పిగా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. జ్వరం వచ్చినప్పటి నుంచీ నొప్పులు, వాపులు ఉన్నాయని తెలిపారు. ఆందోళన కలిగిస్తున్న కాళ్లవాపు లక్షణాలు ఇవే అయి ఉంటాయని వారు భయపడుతున్నారు. వైధ్యశాఖ అధికారులు తక్షణమై గ్రామాన్ని సందర్శించి తమకు పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించాలని కోరుతున్నారు. -
వీఆర్‌పురంపై అధికారుల పూర్తి దృష్టి
వీఆర్‌పురం : కాళ్లవాపు వ్యాధి ప్రభావంతో వీఆర్‌పురం మండలం రాష్ట్ర స్థాయిలో సంచలన వార్తగా నిలిచింది. దీంతో ఈ వ్యాధి ప్రభావాన్ని అరికట్టేందుకు జిల్లా స్థాయి అధికారులు నిత్యం మండల పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. డీసీహెచ్ఎస్ రమేష్ కిషోర్ రేఖపల్లి పీహెచ్‌సీని గురువారం సందర్శించారు. టీముల వారిగా మండలంలో చేపడుతున్న సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అదనంగా కాకినాడ నుంచి వచ్చిన డాక్టర్లతో ఆయన సమావేశం నిర్వహించి పలు విషయాలను చర్చించారు. అన్ని వేళలా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ ఎం.పవన్‌కుమార్, ప్రత్యేకాధికారి పి. శ్రీరామచంద్రమూర్తులు మండల కేంద్రంలో ఉంటూ సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు మండల పరిస్థితిపై సమాచారం అందిస్తున్నారు. మరో ఆరుగురి తరలింపు ... కాళ్లవాపు వ్యాధి లక్షణాలతో ఉన్న మరో ఆరుగురిని గురువారం అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మంగళ, బుధవారాల్లో మండలం నుంచి కాకినాడకు చికిత్స కోసం 24 మందిని అధికారులు తరలించారు. తాజాగా గురువారం తరలించిన ఆరుగురితో కలిపి మొత్తం 30 మంది కాకినాడ జీజీహెచ్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాళ్లవాపు వ్యాధి బారిన పడి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకు వచ్చిన వారికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖర్చుల కింద రూ.1500 పంపిణీ చేసినట్లు అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ ఎం.పవన్‌కుమార్ తెలిపారు.