వీఆర్‌పురంపై అధికారుల పూర్తి దృష్టి
వీఆర్‌పురంపై అధికారుల పూర్తి దృష్టి
Published Thu, Sep 22 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
వీఆర్‌పురం :
కాళ్లవాపు వ్యాధి ప్రభావంతో వీఆర్‌పురం మండలం రాష్ట్ర స్థాయిలో సంచలన వార్తగా నిలిచింది. దీంతో ఈ వ్యాధి ప్రభావాన్ని అరికట్టేందుకు జిల్లా స్థాయి అధికారులు నిత్యం మండల పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. డీసీహెచ్‌ఎస్ రమేష్ కిషోర్ రేఖపల్లి పీహెచ్‌సీని గురువారం సందర్శించారు. టీముల వారిగా మండలంలో చేపడుతున్న సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అదనంగా కాకినాడ నుంచి వచ్చిన డాక్టర్లతో ఆయన సమావేశం నిర్వహించి పలు విషయాలను చర్చించారు. అన్ని వేళలా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ ఎం.పవన్‌కుమార్, ప్రత్యేకాధికారి పి. శ్రీరామచంద్రమూర్తులు మండల కేంద్రంలో ఉంటూ సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు మండల పరిస్థితిపై సమాచారం అందిస్తున్నారు.
మరో ఆరుగురి తరలింపు ...
కాళ్లవాపు వ్యాధి లక్షణాలతో ఉన్న మరో ఆరుగురిని గురువారం అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మంగళ, బుధవారాల్లో మండలం నుంచి కాకినాడకు చికిత్స కోసం 24 మందిని అధికారులు తరలించారు. తాజాగా గురువారం తరలించిన ఆరుగురితో కలిపి మొత్తం 30 మంది కాకినాడ జీజీహెచ్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాళ్లవాపు వ్యాధి బారిన పడి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకు వచ్చిన వారికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖర్చుల కింద రూ.1500 పంపిణీ చేసినట్లు అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ ఎం.పవన్‌కుమార్ తెలిపారు.
Advertisement