చెమ్మ దొరకని చెన్నపట్నం | Water Crisis In Chennai | Sakshi
Sakshi News home page

నీటి చెమ్మ దొరకని చెన్నపట్నం

Published Sat, Jun 22 2019 8:05 PM | Last Updated on Sun, Jun 23 2019 1:49 PM

Water Crisis In Chennai - Sakshi

ఎండిపోయిన బోర్లు. నిండుకున్న రిజర్వాయర్లు. నీటికోసం తల్లడిల్లే పల్లెలు అనగానే మనకు వెంటనే గుర్తువచ్చేది మహారాష్ట్రలోని వెనుకబడిన మరఠ్వాడా, విదర్భ. నీటికోసం అల్లాడిపోతున్న మరాఠాలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా రైలు భోగీలను ఏర్పాటు చేసి.. నీటిని తరలించిన పరిస్థితిని గతంలో లాతూర్‌లో చూశాం. కానీ ఇప్పుడు మహారాష్ట్ర సరసన తమిళనాడు చేరింది. తమిళనాట నీటి కటకట. నీరు కోసం తమిళ తంబీల తండ్లాట. నీటి చెమ్మ దొరకని చెన్నపట్నం. గుక్కెడు జలం కోసం జనం విలవిళ్లాడుతున్న పరిస్థితి. మొన్న మహారాష్ట్ర, నేడు తమిళనాడులో నీటి కోసం చిన్నపాటి యుద్ధలే జరుగుతున్నాయి. 

సాక్షి, చెన్నై: గుక్కెడు మంచినీళ్ల కోసం తమిళనాడులోని చెన్నై నగరం విలపిస్తోంది. మునుపెన్నడూ లేనంతగా తీవ్ర నీటి సంక్షోభంతో చెన్నై విలవిలలాడుతోంది. రిజర్వాయర్లలో నీళ్లు పూర్తిగా అడుగంటిపోయాయి. బోర్లు ఎండిపోయాయి. వాటర్ ట్యాంకర్ బుక్ చేసినా.. వస్తుందో రాదో తెలియని పరిస్థితి. బిందెడు నీళ్లు కావాలంటే.. లక్కీ డ్రాలో గెలవాల్సిందే. మంచినీళ్ల కోసం టోకెన్లు తీసుకోవాల్సిన పరిస్థితి. ఆఖరికి కాలకృత్యాలు తీర్చుకుందామన్నా ఎక్కడా నీళ్లు దొరకడం లేదు. వంటలకు నీళ్లు లేక హోటళ్లు మూతపడుతున్నాయి. నీటికోసం ఏకంగా యుద్ధాలే జరుగుతున్నాయి. ఒక ట్యాంకరు వస్తే చాలు నీళ్ల కోసం పెద్ద క్యూలలో ప్రజలు నిలబడుతున్నారు. గంటలకొద్దీ నీటికోసం క్యూలో నిలబడి సహనం కోల్పోయి గొడవలు పడుతున్నారు. తంజావూరులో నీటిని అక్రమంగా నిల్వ చేసుకుంటున్నారని ప్రశ్నించిన సామాజిక కార్యకర్త ఆనంద్ బాబును కొట్టి చంపారు. చెన్నైలో నీళ్ల పంపకాల విషయంలో జరిగిన గొడవలో మహిళపై పదునైన పరికరంతో దాడి చేశారన్న ఆరోపణలతో.. అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ కారు డ్రైవర్ ఆదిమూలంను పోలీసులు అరెస్ట్ చేశారు.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చేయూత...
ఎక్కడ నీళ్లు ఎక్కువ వాడాల్సి వస్తుందోనని.. తమకిష్టమైన సాంబారు కూడా చేసుకోవడం లేదు తమిళ తంబీలు. ఇదీ ప్రస్తుతం తమిళనాడును వెంటాడుతున్న దుర్భర నీటి కష్టం. చెన్నైలో ఓవైపు నీటి ట్యాంకర్ల వద్ద నీటియుద్ధాలు జరుగుతుంటే.. మరోవైపు అధికార, విపక్ష పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. నీటిఎద్దడిపై డీఎంకే ఆందోళన చేస్తుంటే.. ఏమంత ఎద్దడి లేదంటూ కొట్టిపారేస్తోంది అధికార అన్నాడీఎంకే. జలాశాయాలు అడుగంటిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. పక్క రాష్ట్రాల నుంచి చైన్నై రావాల్సిన నీరు రావడం లేదని చెబుతోంది పళని సర్కార్. ప్రభుత్వ వైఫల్యంపై సాక్షాత్తు మద్రాస్‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చే వరకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని తీవ్రంగా మందలించింది. అప్పటికి గాని సీఎం పళనిస్వామి పరిస్థితిపై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయలేదు. ప్రజల కష్టాలను చూసి చలించిన సూపర్‌ స్టార్‌​ రజనీకాంత్‌ తన సొంత ఖర్చుతో నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి.. ప్రజల దాహర్తిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే తమిళనాడులో పరిస్థితి ఏవిధంగా ఉండో అర్థమవుతోంది.  

వాటర్‌ ట్యాంకర్‌ బుకింగ్‌..
సాధారణంగా చెన్నై నగరం నీటి పేరుచెబితే భయంతో వణుకుతుంది. ఎందుకంటే.. దేశంలో వరదల తాకిడికి ఎక్కువగా గురయ్యే నగరం అదే. కానీ, ఇప్పుడదే చెన్నై నీటి చుక్క కోసం తపిస్తోంది. తీవ్ర నీటి ఎద్దడితో తమిళ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కళ్లెదుట మహా సముద్రం కనిపిస్తున్నా.. కనీసం గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు దొరక్క ప్రజలు విలవిలలాడుతున్నారు. స్నానాలు చేసి రెండు, మూడులు రోజులవుతున్నా భరిస్తున్న చెన్నై వాసులు.. మంచినీటి కోసం మాత్రం దాహం.. దాహం అంటూ తపిస్తున్నారు. పుజల్, పాండీతో సహా.. చెన్నై నగరానికి దాహార్తిని తీర్చే రిజర్వాయర్లన్నీ అడుగంటిపోయాయి. బోరుబావులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో జనం ఆగచాట్లు పడుతున్నారు. నీటి ట్యాంకర్లు బుక్ చేసినా వస్తుందో లేదో తెలియని పరిస్థితి. నీళ్లు లేక హాస్టళ్లు, హోటళ్లు మూతపడుతున్నాయి. కొన్ని హాస్టళ్లలో కేవలం ఒక గంట పాటు మాత్రమే నీటిని సప్లై చేస్తున్నారు. ఆ గంటలోనే స్నానాలు, బట్టలు ఉతుక్కోవడం అన్నీ పూర్తికావాలి. లేదంటే అంతే. మరోవైపు నీళ్లు ఎక్కువగా వాడాల్సి రావడంతో.. తమకిష్టమైన సాంబారును కూడా వదులుకుంటున్నారు చెన్నై ప్రజలు. కొన్ని హోటళ్లలో సాంబారు వండటం లేదు. నీళ్లు లేక కొన్ని హోటళ్లను పూర్తిగా మూసేశారు. చెన్నై నగరవాసుల నీటి అవసరాలు తీర్చేందుకు ప్రతి రోజు 80 కోట్ల లీటర్ల నీరు అవసరం. అయితే ప్రభుత్వం ప్రతి రోజు 50 కోట్ల లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తోంది. దీంతో నీటి కోసం చెన్నైవాసులు అష్టకష్టాలు పడుతున్నారు.

ఐటీపై ఆంక్షలు..
ప్రైవేటు ట్యాంకర్ల వద్ద మహిళలు రోజంతా బారులు తీరుతున్నారు. ఉదయం 4 గంటలకు బయటకు వస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా తమ వంతు రావడం లేదని, కుటుంబానికి పది బిందెలకు మించి నీరు సరఫరా కావడం లేదని గృహిణులు ఆవేదిన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే, నీటి ఎద్దడిని ఎదుర్కోవడం కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి రైలు ట్యాంకర్ల ద్వారా చెన్నైకి నీటిని తరలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్క చెన్నైలోనే కాదు.. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి. బిందెడు నీళ్ల కోసం బావుల వద్ద మహిళలు కిలోమీటర్ల కొద్దీ క్యూ కడుతున్నారు.  జ‌నం నీటి అవ‌స‌రాల‌ను అవ‌కాశంగా తీసుకుంటున్న కొంద‌రు ట్యాంక‌ర్ య‌జ‌మానులు, బిందె నీటిని 50 రూపాయ‌లకు అమ్ముతున్నార‌ట‌. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొచ్చే కుటుంబాలు.. సాధారణ అవసరాలకు కూడా ప్రతీరోజూ నీళ్లను కొనుగోలు చేయాలంటే తమవల్ల కాదంటున్నారు. నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని చెన్నైలోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఆంక్షలు విధించాయి. కొన్ని సంస్థలు ఇంటి వద్దే పనిచేయమంటే, మరికొన్ని సంస్థలు భోజనం ఇంటి నుండే తెచ్చుకోమని సూచిస్తున్నాయి.

రైళ్ల ద్వారా మంచినీటిని సరఫరా
వేసవి వచ్చిందంటే నీటి కొరత గురించి గుర్తుకొస్తుంది. అంతకుముందు నీటి అవసరం పెద్దగా లేకపోవడం వల్ల నీళ్ల గురించి ఎవరికీ పట్టింపు వుండదు. వేసవిలో భూగర్భల జాలాలు అడుగంటినప్పుడు మళ్లీ నీటి గురించి వెతుక్కునే పరిస్థితులు, నీటి కటకటలు మొదలవుతాయి. ఇక ఎక్కడ చూసినా దాహార్తులే. గుక్కెడు మంచినీటికోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు. అందుబాటులో వున్న జలాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్ల తలెత్తే పరిణామాలివి. ప్రస్తుతం తమిళనాడు లాగే.. గతంలో మహారాష్ట్ర కూడా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంది. 2016లో తీవ్ర కరువు తాండవించినప్పుడు మరఠ్వాడాలోని లాతూరు వంటి ప్రాంతాల్లో తాగడానికి కూడా మంచినీరు లభించలేదు. దీంతో రైళ్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాల్సివచ్చింది. మహారాష్ట్రలోని మొత్తం 358 తాలూకాల్లో సగానికిపైగా కరువు కోరల్లో మగ్గుతున్నాయి. ఈ తాలూకాల్లోని దాదాపు 30 వేల గ్రామాలు నీటి ఎద్దడితో అలమటిస్తున్నాయి. వందకు పైగా పల్లెలు నరకం చూస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర మాత్రమే కాదు.. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సైతం నీటి ఎద్దడి ఎక్కువగా వుంటోంది. ముఖ్యంగా మహానగరాల్లో ప్రతీ ఏటా నీటి ఎద్దడి పెరుగుతూనేవుంది. నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోవడంతో.. వర్షపు నీరు నేల ఒడికి చేరడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement