
తమిళనాడు ‘తన్నీరు’ కోసం తల్లడిల్లిపోతోంది.
సాక్షి, చైన్నై : తమిళనాడు ‘తన్నీరు’ కోసం తల్లడిల్లిపోతోంది. ముఖ్యంగా 50 లక్షల మంది జనాభా కలిగిన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో మంచి నీళ్లు దొర క్క ప్రజల గొంతల తడారిపోతోంది. నగరానికి నీరందించే ప్రధాన రిజర్వాయర్ ‘లేక్ పుఝాల్’లో బుక్కెడు నీళ్లు లేవు. గత ఏడాది జూన్ 15వ తేదీన తీసిన శాటిలైట్ చిత్రంతో, సరిగ్గా ఏడాది తర్వాత గత ఆదివారం శాటిలైట్ తీసిన ఛాయా చిత్రాన్ని పోల్చి చూసినట్లయితే పరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది. గతేడాది ఈపాటికి బాగానే నీళ్లు ఉండగా, ఈసారి ఎండిపోయి అట్టడుగున చిన్న బురద గుంట మిగిలిపోయింది. నగరానికి మంచినీరు సరఫరా చేసే మరో చిన్న రిజర్వాయర్ చెమ్మరమ్‌బాక్కమ్ రిజర్వాయర్ కూడా ఎండిపోవస్తోంది.
ఈ పరిస్థితిపై అంతర్జాతీయ పత్రికయిన ‘న్యూయార్క్ టైమ్స్’ కూడా ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించింది. చెన్నైకి ఈపాటికి ఎప్పుడో వర్షాలు రావాలి. ఈసారి రుతుపవనాల రాక దేశవ్యాప్తంగా ఆలస్యం కాగా ఇప్పటికీ తమిళనాడుకు వర్షాలు రాలేదు. మంచినీటి కోసం తల్లడిల్లుతూ నగర ప్రజలో వీధుల్లోకి వచ్చి ఆందోళన చేసినా తేవడానికి నీళ్లు లేవంటూ రాజకీయ నాయకులు తప్పించుకు తిరుగుతున్నారు. తమిళనాట ప్రభుత్వాలకు ముందు చూపులేక పోవడం వల్ల పరిస్థితి ఇంతదూరం వచ్చింది.