ముంబై : ప్రస్తుతం మహారాష్ట్రలో కొన్ని గ్రామాల్లో ఇంటి ద్వారం మీద మరాఠీలో ‘దయచేయండి.. భోజనం చేయండి.. కానీ మంచి నీళ్లు మాత్రం అడక్కండి’ అని రాసి ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ కరువు ఎంత తీవ్రంగా ఉందో. మహారాష్ట్రలోని మరఠ్వాడాలో గత 32 వారాల నుంచి కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఈ ప్రాంతానికి నీరు అందించే రిజార్వయర్లు పూర్తిగా అడుగంటిపోయాయి. బోర్లు, బావులు ఎండిపోయాయి. ప్రస్తుతం ఔరంగబాద్, మధ్య మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో కరవు కోరలు చాచింది. దాంతో ప్రజలు నీటిని అతి జాగ్రత్తగా, పొదుపుగా ఒక్క చుక్క కూడా వృథా కాకుండా వాడుకుంటున్నారు.
దానిలో భాగంగా ఒంటికి సబ్బు పెట్టి స్నానం చేయడం మానేశారు. ఓ నులక మంచంలో కూర్చుని.. కింద మరో టబ్బు పెట్టుకుని స్నానం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల నీరు వృథా కాకుండా టబ్బులో పడుతుంది. తర్వాత ఆ నీటితోనే మిగతా కుటుంబ సభ్యులు స్నానం చేయడం ఆఖరున వాటిని బట్టలు ఉతకడానికి వినియోగించడం వంటివి చేస్తున్నారు. దాదాపు ప్రతి గ్రామంలో ఇదే తంతు. దీని గురించి ఓ గ్రామస్థుడు మాట్లాడుతూ.. ‘ఇది మీకు షాకింగ్‌గా.. చండాలంగా అనిపించవచ్చు. కానీ మాకు మాత్రం ఇదే సరైన మార్గంగా తోస్తుంది. తీవ్ర నీటి ఎద్దడి ఉన్నప్పుడు మీ ముందు రెండే మార్గాలుంటాయి. ఒకటి చావడం రెండు బతకడం. చావలేం కాబట్టి మాకు తోచిన రీతిలో ఉన్న నీటినే ఇలా వాడుకుంటున్నాం’ అని తెలిపారు.
ఈ ప్రాంతాలకు ప్రభుత్వం వారంలో మూడు రోజుల పాటు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది. అలా పట్టుకున్న నీటినే అతి జాగ్రత్తగా.. పొదుపుగా వాడుకోవాల్సి వస్తుంది. లేదంటే డబ్బు చెల్లించి నీళ్లు కొనుక్కోవాలి. పది లీటర్ల నీటికి రూ. 12, వంద లీటర్ల నీటిని రూ. 80 చెల్లించాల్సిందే. కానీ ఇంత డబ్బు ఖర్చు పెట్టే స్థోమత ఇక్కడి జనాలకు లేదు. దాంతో ప్రభుత్వం సరఫరా చేసే నీటిని పట్టుకుని జాగ్రత్తగా వాడుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment