
మృత్యుంజయ ముఖ్యమంత్రి
మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌కు తప్పిన ముప్పు
► ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్
► విద్యుత్ తీగలకు తగిలి గుడిసెపై కూలిపోయిన చాపర్
► లాతూర్ జిల్లాలోని నీలాంగ పట్టణంలో ఘటన
► ఫడ్నవీస్ సహా ఆరుగురూ సురక్షితం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. లాతూర్ జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి ఫడ్నవిస్‌లో పాటు హెలికాప్టర్‌లో ఉన్న ఆరుగురూ సురక్షితంగా బయటపడ్డారు. రైతుల కోసం బీజేపీ చేపట్టిన ‘శివార్ సంవాద్ సభ’ కార్యక్రమంలో భాగంగా ఫడ్నవిస్ గురువారం లాతూర్ జిల్లాలోని నీలాంగ పట్టణానికి వచ్చారు. కార్యక్రమం ముగించుకుని 11.45 గంటలకు ముంబైకి బయలుదేరేందుకు హెలికాప్టర్‌లో కూర్చున్నారు. 11.58 నిమిషాలకు హెలికా ప్టర్ టేకాఫ్ అయ్యింది. టేకాఫ్ అయిన 50 సెకన్లలోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్‌కు యత్నించా రు.
ఈ క్రమంలో సమీపంలో ఉన్న విద్యుత్ వైరుకు హెలికాప్టర్ బ్లేడ్లు తగిలి మంటలు లేచాయి. ఏం జరిగిందో తెలుసు కునేలోపే 50–60 అడుగుల ఎత్తు నుంచి దూసుకొచ్చిన చాపర్.. ఓ రేకుల గుడిసె, ఆ పక్కనే ఉన్న ట్రక్కుపై కూలింది. ఈ ఘటనలో గుడిసెలో ఉన్న ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. హెలికాప్టర్‌లో ఉన్నవారం తా క్షేమంగా బయటపడ్డారు. హెలికాప్టర్ ఎక్కువ ఎత్తులో లేకపోవడంతో పెను ప్రమా దం తప్పింది. ఈ ఘటనలో హెలికాప్టర్ దెబ్బతిందని డీజీసీఏ అధికారులు తెలిపారు. దీనిపై పౌరవిమాన యాన శాఖ అధీనంలోని విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఏఐబీ) విచారణ చేపట్టనుంది. దేశంలో జరిగే విమాన ప్రమాదాలు, తీవ్ర ఘటనలకు సంబంధించిన కేసులను ఏఐబీ దర్యాప్తు చేస్తుంది.
ప్రమాదంపై ఫడ్నవిస్ ట్వీట్..: ‘‘మేము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లాతూర్‌లో ప్రమాదానికి గురైంది. నేను.. మా బృందం సురక్షితంగా ఉన్నాం. ఆందోళన చెందాల్సిన పనిలేదు’’ అని సీఎం ఫడ్నవిస్ ప్రమాదం అనంతరం ట్వీటర్‌లో పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి రోడ్డు మార్గంలో లాతూర్‌కు చేరుకున్న ఫడ్నవిస్ అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్నారు. ప్రమాద సమయంలో విమానంలో ఫడ్నవిస్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ పర్‌దేశీ, వ్యక్తిగత సహాయకుడు అభిమన్యు పవార్, మీడియా సలహాదారు కేతన్ పాఠక్ ఉన్నారు.
‘‘11 కోట్ల మంది మహారాష్ట్ర ప్రజల ఆశీస్సులతో నేను సురక్షితంగా బయట పడ్డా. ప్రజలు వదంతులు నమ్మొద్దు. ఎవరికీ ఏమీ కాలేదు. ఈ ఘటనపై పోలీసుల నుంచి సమాచారం సేకరిస్తాం’’ అని ఫడ్నవిస్ విలేకరులకు చెప్పారు. ఇటీవలే విదర్భ ప్రాంతంలోని గచ్చిరోలి పర్యటన సందర్భం గా ఫడ్నవిస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆయన రోడ్డు మార్గంలో నాగ్‌పూర్ చేరుకు న్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, చెన్నైలో ఉన్న మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు,శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతోపాటు పలువురు ప్రముఖులు ఫడ్నవిస్‌కు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు.
ఫడ్నవిస్‌కు కేసీఆర్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఫడ్నవిస్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా రు. ఈ ఘటన గురించి తెలియగానే కలవరపాటుకు గురయ్యానని, అందరూ క్షేమంగా ఉండటం సంతోషకరమని కేసీఆర్ అన్నారు.