సీఎంపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అహంకార దోరణితో వ్యవహరిస్తున్నారని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమా భారతి విమర్శించారు. తాగునీటి సరఫరా విషయంలో ఆమె యువ సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుందేల్ ఖండ్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. కేంద్రం ఈ మధ్య రైళ్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ నుంచి గురువారం ఓ రైలు నీటిని తీసుకెళ్తుండగా ఝాన్సీ ప్రాంతంలో నిలిపివేసినట్లు మంత్రి తెలిపారు. ఈ విషయంలో కేంద్ర జోక్యం అనవసరమని, వారి ప్రమేయం ఎందుకంటూ అఖిలేశ్ వ్యాఖ్యానించడంపై ఉమా భారతి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయాలు చేసేందుకు ఇవి తగిన అంశాలు కావని హితవు పలికారు.
సీఎం అఖిలేశ్ చదువుకున్న వ్యక్తి అయినప్పటికీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని, యూపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. నీళ్లు, ఆహారం లాంటి విషయాల్లో రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టంచేశారు. వాటర్ తో రైలు రావడం, అడ్డగించడం విషయంపై తమ వద్ద సరైన సమాచారం లేదని జిల్లా కలెక్టర్ అజయ్ శుక్లా పేర్కొన్నారు. వచ్చే ఏడాది యూపీలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే పార్టీల నేతలు రాజకీయాలు మొదలుపెట్టారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.