- భయం గుప్పిట్లో నిర్వాసితులు
కోటిలింగాలలో పెరిగిన వరద ఉధృతి
Published Sat, Jul 30 2016 9:37 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
వెల్గటూరు : మండలంలోని కోటిలంగాలను ఎల్లంపల్లి వరద ఉధృతి ముంచెత్తుతోంది. రోజురోజుకు నీటిమట్టం పెరుగుతుండడంతో నిర్వాసితులు భయంగుప్పిట్లో గడుపుతున్నారు. ఎప్పుడు ఏ విష పురుగులు ఇళ్లలోకి చేరుకుంటాయోనని భయాందోళన చెందుతున్నారు. కొందరు స్వయంగా ఇళ్లను వదిలి వెల్గటూర్‌లో అద్దెకుంటున్నారు. నదీతీరంలోని ఆలయం ఎదుట విద్యుత్ స్తంభానికి వేసిన 146 ఎఫ్‌ఆర్‌ఎల్ స్థాయికి వరద నీరు చేరుకుంటోంది. పుష్కరఘాట్లు మునిగిపోయాయి. వరద ప్లాట్‌ఫాంపైన బట్టలు మార్చుకునే గదులను ముంచెత్తి ఆలయ సమీపంలోకి చేరుకుంది. పెద్దవాగులో బ్యాక్ వాటర్ పెరిగి పంట పొలాలను ముంచెత్తింది. ఊరు చుట్టూ ఉన్న పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. గ్రామంలోకి వచ్చే ప్రధాన రహదారిపై ఉన్న అలుగు ఒర్రె వంతెన ఈ రాత్రికి మునిగిపోయేలా ఉంది. ఈ వంతెన మునిగితే గ్రామంలోకి రాకపోకలు స్తంభించిపోతాయి. ఇలాగే ఉంటే గ్రామంలో కలరా, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అధికారులు మాత్రం ఐదు ఇళ్లు మాత్రమే ప్రమాదపుటంచున్న ఉన్నాయని ఆ కుటుంబాలనే తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్తులు మాత్రం అందరినీ తరలించాలని కోరుతున్నారు.
Advertisement