ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎంలో చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని ప్రకటించడాన్ని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లపల్లి అంజి హర్షం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివే సుమారు ఐదున్నర లక్షల విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల వృత్తి విద్యా కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో అందిస్తున్నారని గుర్తుచేశారు. ఇక్కడ మాత్రం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించకపోగా కోట్ల రూపాయల బకాయిలు ఉండటంతో విద్యార్థులను కళాశాలల యాజమాన్యం విద్యాభ్యాసం పూర్తయినా సర్టీఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అడ్మిషన్ ఇవ్వాలని, అవసరమైతే అదనపు సెక్షన్‌లు తెరవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మెస్ చార్జీలను రూ. 1575 నుంచి రూ. 2500లకు పెంచాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్యను 300 మందికి మాత్రమే ఎందుకు కుదించారని ప్రశ్నించారు.
బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎం చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తూ, ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంసీఏ చదివే విద్యార్థులకు ఎందుకు నిరాకరిస్తుందని ఇది సవతి తల్లి ప్రేమ కాదా అని ప్రశ్నించారు. బీసీ హాస్టల్స్‌కు ఒక్క సొంత భవనం కూడా లేదని అద్దెలకు మాత్రం కోట్లాది రూపాయలు చెల్లిస్తూ అధికారులు మధ్య దళారుల పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment