ఐఐఎం పరీక్షల్లో అంధురాలి ప్రతిభ | Impaired Student Shivani Got Seat In IIM Indor | Sakshi
Sakshi News home page

ఐఐఎం పరీక్షల్లో అంధురాలి ప్రతిభ

Published Sat, Jul 6 2024 7:52 AM | Last Updated on Sat, Jul 6 2024 7:52 AM

 Impaired Student Shivani Got Seat In IIM Indor

కనుచూపు లేక ముసిరిన చీకటిలో పట్టుదల కాంతిపుంజమై దారి చూపింది. రెప్పల మాటున దాగున్న కలలను చదువుతో సాకారం చేసుకుంది.అంధత్వాన్ని జయించి జాతీయ స్థాయిలో నిర్వహించే ఐ.ఐ.ఎం. (ఇండియ   ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌) పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చి దేశంలోని 21 ఐ.ఐ.ఎం. కళాశాలల్లోని 19 కళాశాలల్లో అర్హత సాధించింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలోని గడి మహెలాలకు చెందిన కొత్తకాపు శివాని భవిష్యత్తుకు నిర్మించుకుంటున్న సోపానాలను ఇలా మన ముందుంచింది.

‘మాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలు కొత్తకాపు విజయలక్ష్మి, గోపాల్‌రెడ్డిలకు రెండోసంతానాన్ని. మా అక్క కీర్తన గ్రూప్‌ 4 పరీక్ష రాసి ఉద్యోగం సాధించింది. మా చెల్లి భవానికి 80 శాతం చూపులేదు. హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీ లో ఎంబీఏ సీటును సాధించింది. నాకు పుట్టుకతోనే చూపు లేదు. అయినా, చదువంటే మాకెంతో ఆసక్తి. అదే మమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని మా నమ్మకం. జహీరాబాద్‌లోని శ్రీ సరస్వతీ శిశుమందిరంలో నా ప్రైమరీ చదువు ఆరంభమైంది. కానీ, చూపు లేక΄ోవడంతో చాలా ఇబ్బంది పడేదాన్ని. 

నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమ్మానాన్నలు హైదరాబాద్‌లోని బేగంపేటలో గల దేవనార్‌ పబ్లిక్‌ స్కూల్‌లోని అంధుల పాఠశాలలో చేర్పించారు. ఒకటి నుంచి పదోతరగతి వరకు అదే బడిలో చదువుకున్నాను. పదోతరగతిలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. ఇంటర్మీడియెట్‌ను జహీరాబాద్‌లోని మాస్టర్‌ మైండ్స్‌ కాలేజీలో కామర్స్‌తో పూర్తి చేశాను. కాలేజీలో క్లాసులను విని, సహాయకులతో పరీక్షలు రాశాను. ఆ రెండేళ్లూ కాలేజీ టాపర్‌గా నిలిచాను.

ఉన్నతస్థాయి ఉద్యోగమే లక్ష్యం
చెన్నైలోని సత్యభామ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చేరి బీబీఏ కోర్సు పూర్తి చేశాను. క్యాట్‌ ఎగ్జామ్‌ కోసం ఆ¯Œ ౖలñ న్‌లో కోచింగ్‌ తీసుకున్నాను. 2023లో నిర్వహించిన ఐఐఎం ప్రవేశ పరీక్ష రాసి 93.51 శాతం మార్కులతో దేశంలోని 21 ఐఐఎం కళాశాలల్లోని 19 కళాశాలల్లో ప్రవేశార్హత సాధించాను. వాటిలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌ ఐఐఎంను ఎంపిక చేసుకున్నాను. కిందటి నెల 23న కళాశాలలో చేరాను.

శక్తినిచ్చే గీతోపదేశం 
చూపు లేక΄ోవడంతో చదువు కష్టంగా ఉండేది. బ్రెయిలీ లిపి నేర్చుకునేంతవరకు చదువు పట్ల నాకున్న తపనను ఎలా తీర్చుకోవాలో తెలిసేది కాదు. అంధుల పాఠశాలలో చేరాక నాకు పెద్ద అండ దొరికినట్టుగా అనిపించింది. కార్పొరేట్‌ కంపెనీలలో టాప్‌ లెవల్‌ ఉద్యోగం చేయాలని ఉంది. అందుకు తగిన అర్హతలు సం΄ాదించుకోవడానికి స్పెషలైజేషన్‌ కూడా చేస్తాను. శ్రీకృష్ణుడి గీతోపదేశం వింటూ ఉంటాను. జీవితంలోని ఒడిదొడుకులను ఎలా ఎదుర్కోవాలో, సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎలా నిలబడాలో గీత ద్వారానే నేను తెలుసుకుంటున్నాను. రెండు సంవత్సరాల ఐఐఎం కోర్సును విజయవంతంగా పూర్తి చేసి, ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని సాధించాలన్నదే నా లక్ష్యం. అమ్మానాన్నలకు, పుట్టిన ఊరికి మంచి పేరు తేవాలన్నదే నా ఆకాంక్ష’’ అని చెప్పింది శివాని. 
– యెర్భల్‌ శ్రీనివాస్‌రెడ్డి, సాక్షి, జహీరాబాద్‌

ఎంతో గర్వంగా ఉంది
మా అమ్మాయి శివానీ జాతీయ స్థాయిలో ఐఎంఎ సీటును సాధించడం మాకెంతో గర్వంగా ఉంది. ఆమె పుట్టుగుడ్డిగా పుట్టినప్పుడు కొంత బాధపడ్డాం. కొందరు మనసు నొప్పించే మాటలు అనేవారు. కానీ, వాటిని పట్టించుకోకుండా అమ్మాయిలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో కష్టపడి చదివించాం. ఇప్పుడు శివానీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. 
– విజయలక్ష్మి, గో΄ాల్‌రెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement