గౌరిభట్ల నరసింహమూర్తి: ఎన్నికల్లో తొలిసారి ‘రైలు’ ప్రచారాస్త్రంగా నిలవబోతోంది. గతంలో కొన్ని ప్రాంతాల్లో ‘ఇన్ని దశాబ్దాలు గడిచినా మా ప్రాంతానికి రైలు రాలేదు’ అన్న నెగెటివ్ అంశం ప్రచారంలో వినిపించినా.. ఇప్పుడు దానికి భిన్నంగా, ఓ రైలు ఘనతను తమకు అనుకూలంగా మలుచుకుంటూ నేతలు ప్రసంగ పాఠాన్ని సవరించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో కనిపించిన ఈ పంథా, ఇప్పుడు తెలంగాణ ఎనిక్నల్లోనూ కనిపించబోతోంది.
కేంద్రప్రభుత్వం ట్రెయిన్ 18 పేరుతో ప్రయోగాలు నిర్వహించిన తర్వాత ‘’వందేభారత్’గా పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. తొలి రైలే ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. బ్లూ చారలున్న తెలుపు రంగు కోచ్‌లు, ప్రత్యేకంగా పుష్ పుల్ పద్ధతిలో రెండు వైపులా ఇన్‌బిల్ట్ ఇంజిన్‌తో ఉండటం, 180 కి.మీ. వేగం అందుకునే సామర్ధ్యం, విలాసంగా కనిపించే కోచ్‌లు.. ఇలా ఒకటేమిటి, ఇంతకాలం విదేశాల్లోనే కనిపించిన రైలు మన పట్టాలపై పరుగు పెడుతుంటే ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఫలితంగా మా ప్రాంతానికి కావాలంటే మా ప్రాంతానికి కావాలంటూ రైల్వేపై అన్ని రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరిగింది.
ఏకంగా మూడు రైళ్లతో..
దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ వందేభారత్ రైళ్లు తెలంగాణకు ఏకంగా మూడు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలకు వాటిని కేటాయించనే లేదు. ఈ తరుణంలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాచిగూడ నుంచి బెంగళూరు మధ్య మూడు వందేభారత్ రైళ్లు పరుగుపెడుతున్నాయి. ఇప్పుడు ఇదే బీజేపీకి పెద్ద ప్రచారాస్త్రంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కొన్ని దశాబ్దాల కాలంలో తెలంగాణకు సాధారణ రైళ్లు మంజూరు కావటమే గొప్ప అనుకుంటున్న తరుణంలో, మోదీ ప్రభుత్వం సెమీ బుల్లెట్ రైళ్లుగా పేర్కొనే వందేభారత్ రైళ్లను మూడింటిని కేటాయించటాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జరిగిన సభల్లో వందేభారత్ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. వాటి ప్రారంబోత్సవ కార్యక్రమాల్లో కేంద్రమంత్రి హోదాలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రముఖంగా పేర్కొంటూ తెలంగాణకు వరాలుగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు వందేభారత్‌ను కీర్తిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
జనవరి నాటికి స్లీపర్ క్లాస్ రైళ్లు కూడా..
ప్రస్తుతం పగటి పూట నడిచే చెయిర్‌కార్ కోచ్ రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయి. జనవరి నాటికి స్లీపర్ క్లాస్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటి చార్జీ ఎక్కువగా ఉన్నందున, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా వందే సాధారణ్ రైళ్ల తయారీని కూడా ప్రారంభించారు.
ప్రచారం చేయాలని....
ఆ రైళ్లపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయం మొత్తంగా వందేభారత్ రైళ్లు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు రైల్వే శాఖ నుంచి సేకరించారు. వాటి వివరాలను పార్టీ కార్యకర్తలకు కూడా అందిస్తున్నారు. ప్రచారంలో వీటిని విస్తృతంగా ప్రజలకు తెలియజెప్పాలని సూచిస్తున్నారు.
మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు ప్రారంభించిన రైలు సర్వి సు కూడా ప్రచారంలో భాగమవుతోంది. ఆ రైలు సర్వీసు ప్రారంభం రోజు ఆ ఘనత తమదంటే తమది అంటూ బీజేపీ–బీఆర్‌ఎస్ నేతలు పేర్కొంటూ దాడులు చేసుకున్న సంగతి విదితమే. దీంతో ఎన్నికల్లో కూడా స్థానికంగా అది ప్రచారాస్త్రంగా మారబోతోంది.
రెండు దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేసి కాచిగూడ నుంచి దేవరకద్ర మీదుగా కర్ణాటక సరిహద్దులోని కృష్ణా స్టేషన్ వరకు రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వి సును ఇటీవల ప్రారంభించారు.
ఈ రెండు రైళ్లను ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొద్ది రోజుల ముందు స్వయంగా ప్రధాని మోదీ వచ్చి ప్రారంభించిన విషయం తెలిసిందే. అమృత్ భారత్‌స్టేషన్ల పేరుతో రాష్ట్రంలో 21 స్టేషన్లకు పూర్తి ఆధునిక భవనాలు నిర్మించే పని ప్రారంభించారు. ఆధునిక రూపు తెస్తున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment