మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్
జార్ఖండ్‌లో నవంబర్ 13, 20న రెండు విడతల్లో పోలింగ్
రెండు లోక్‌సభ సహా 48 అసెంబ్లీ స్థానాలకూ ఉప ఎన్నికలు
ఎన్నికల షెడ్యూళ్లను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, హరియాణా ఎన్నికల కోలాహలం ముగిసిన కొద్దిరోజులకే మరో రెండు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల హడావిడి మొదలుకానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించి కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ఎన్నికల వేడిని పెంచింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూలు మీడియా సమావేశంలో రెండు రాష్ట్రాల ఎన్నికలతోపాటు వయనాడ్, నాందేడ్ లోక్‌సభ స్థానాలు, 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల షెడ్యూళ్లను విడుదలచేశారు.
వారాంతాల్లో పోలింగ్ నిర్వహిస్తే పట్టణప్రాంత ఓటర్లు సెలవుదినంగా దుర్వినియోగం చేస్తున్నారన్న భావనతో పోలింగ్‌ను కేవలం బుధవారాల్లోనే రెండు రాష్ట్రాల్లో చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న, జార్ఖండ్‌లో నవంబర్ 13, 20న రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. జార్ఖండ్ తొలి విడతలో 43 స్థానాలకు, రెండో విడతలో 38 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
పశ్చిమబెంగాల్‌లోని బసిర్హాట్ ఎంపీ, ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్ ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్నికలపై పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలచేయలేదు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే సారథ్యలోని శివసేన పారీ్టతో బీజేపీ అధికారాన్ని పంచుకున్న విషయం తెల్సిందే. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 సీట్లకుగాను 31 సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్–ఎన్సీపీ(ఎస్పీ)–శివసేన(యూబీటీ) కూటమి నుంచి అధికార మహాయుతి కూటమికి గట్టిసవాల్ ఎదురవుతోంది. జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం), కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉండగా ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది.
మహారాష్ట్రలో 288, జార్ఖండ్‌లో 81
మహారాష్ట్రకు సంబంధించి మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 ఎస్సీ, 25 ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలున్నాయి. రాష్ట్రంలో 9.64 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఓట ర్లలో 4.97 కోట్ల మంది పురుషులుకాగా 4.66 కోట్ల మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో 1,00,186 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేస్తున్నారు. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వాటిలో 9 ఎస్సీ, 28 ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలున్నాయి. రాష్ట్రంలో 2.60 కోట్ల మంది ఈసారి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల కోసం 29,562 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment