రాజంపేట, న్యూస్‌లైన్ : జిల్లాలో సోమశిల బ్యాక్ వాటర్ తాకిడి క్రమక్రమేణా పెరుగుతూ వస్తోంది. ముంపు గ్రామాల సమీప ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి. మొన్నటి వరకు వెనుకజలాలు బాగా తగ్గిపోయాయి. కృష్ణజలాలు విడుదలైన క్రమంలో పెన్నానదిలో నీటి ప్రవాహం కొనసాగుతూ వచ్చింది.
దీంతో గుండ్లమడ వద్దకు చేరుకొని చెయ్యేరునదిలోకి కూడా వెనుకజలాలు, పెన్నా వాటర్ మిళితమై వెనక్కి వస్తున్నాయి. కృష్ణజలాలు విడుదలైన తొలిరోజుల్లో 269 కాంటూరు వద్ద జలాలు ఉన్నాయి. ఇప్పుడు వెనుకజలాలు పెరుగుతుండటంతో 303 కాంటూరు లెవల్‌కు చేరుకుంది. జలాశయాన్ని పూర్తి సామర్థ్యంతో నింపితే జిల్లాలో 340 కాంటూరు వరకు వెనుకజలాలు చేరుకుంటాయి.
వర్షాలతో సోమశిలకు వరదనీరు
రాయలసీమ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో సోమశిల జలాశయం వరద ప్రవాహం పెరుగుతోంది. శనివారం కన్నా మంగళవారం సాయంత్రం ఇన్‌ఫ్లో పెరిగింది. జలాశయం నుంచి అవుట్‌ఫ్లో 4,113 క్యూసెక్కులు తెలుగుగంగకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 34.290 టీఎంసీలకు చేరుకున్నట్లు సమాచారం. జలాశయం ఎగువ భాగం ఉన్న నంద్యాల సమీపంలో రాజోలు బండ వద్ద కుందూ నది 4వేల క్యూసెక్కుల వంతున ప్రవాహిస్తోంది. ఆదినిమ్మాయపల్లె వద్ద 8000 క్యూసెక్కులు నీరు విడుదల జరుగుతోంది. చెన్నూరు గేజి వద్ద సాయంత్రానికి 8, 500 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. బద్వేలు సమీపంలోని సగిలేరులో 300 క్యూసెక్కులు నీటి ప్రవాహం కొనసాగుతోంది. జలాశయంలో ప్రస్తుతం 92.750 నీటిమట్టం వద్ద నీరు ఉంది.
ముంపుగ్రామాల సమీపాల్లోకి వెనుకజలాలు
జిల్లాలో ముంపుగ్రామాల సమీప ప్రాంతాల్లో వెనుకజలాలు తిష్టవేశాయి. నందలూరు మండలం కోనాపురం రాళ్లరేవు వద్దకు వెనుకజలాలు చేరుకున్నాయి. కొండమాచుపల్లె పంచాయతీ పరిధిలో కృష్ణమ్మ చెరువులోకి నీళ్లు వచ్చి చేరుకుంటున్నాయి. ఒంటిమిట్ట మండలం పాతమాధవరం, బోయనపల్లె, ఉప్పరపల్లె, కోటపాడు ప్రాంతాల్లోకి నీళ్లు ప్రవేశిస్తున్నాయి. ఇప్పుడు సోమశిల ముంపుగ్రామాల సమీపాల్లో జలకళ ఉట్టిపడుతోంది.
పెరుగుతున్న వెనుక జలాలు
Published Wed, Sep 18 2013 3:53 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM
Advertisement