
హైదరాబాద్, సాక్షి: మహానగరంలో విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్(హైడ్రా)పై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఇష్టానుసారం కూల్చివేతలు చేపడతారా? అంటూ మండిపడింది. ఈ క్రమంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
హైడ్రా కూల్చివేతల వ్యవహారంపై (HYDRAA Demolitions)పై దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ సందర్భంగా జస్టిస్ కే.లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. ‘‘మీ ఇష్టం వచ్చినట్లు కూల్చివేతలు చేపడతారా? సెలవు దినాల్లో కూల్చివేతలు చట్టవిరుద్ధమని చెప్పినా నిబంధనలు పాటించరా? న్యాయస్థానం ఆదేశాలంటే లెక్కలేకుండా వ్యవహరిస్తే.. అది తెలిసేలా చేస్తాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాలతో హై కోర్టుకు హాజరైన హైడ్రా ఇన్స్‌పెక్టర్ రాజశేఖర్(HYDRAA Inspector Rajasekar) పైనా ధర్మాసనం మండిపడింది. పోలీస్ శాఖను నుంచి డిప్యూటేషన్‌పై వచ్చినంత మాత్రాన అక్కడ వ్యవహరించినట్లు ఇక్కడ ఉంటామంటే కుదరదు అని మందలించారు. మరోసారి ఇలాగే జరిగితే మీపై చర్యలకు డీజీపీకి ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఆక్రమణల స్వాధీనానికి, అక్రమ భవనాల కూల్చివేతకు మేం వ్యతిరేకం కాదన్న జస్టిస్ కే లక్ష్మణ్.. ఏది చేసిన చట్టపరంగా ఉండాలని సూచించారు. అలాగని ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అనంతరం విచారణను వాయిదా వేశారు.