stitching
-
స్టిచ్ ఆన్లైన్.. ఒక క్లిక్‌తో వండర్ఫుల్ స్టిచ్చింగ్!
సాక్షి, సిటీబ్యూరో: స్టిచ్ ఆన్లైన్.. ఇప్పుడు ఇదే నగరంలో నడుస్తున్న నయా ట్రెండ్.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిదీ ఆన్లైన్ మయమైంది. కరోనా తర్వాత ఈ ట్రెండ్ మరింతగా పెరిగిపోయింది. ఫుడ్‌తో పాటు మనకు కావాల్సిన వస్తువు ఏదైనా.. ఒక్క క్లిక్‌తో ఇంటికే డెలివరీ ఇస్తున్నారు. నిత్యావసర సరుకులు మొదలుకుని.. ఎలక్ట్రానిక్స్ వరకూ.. టూవీలర్స్ మొదలుకుని.. ఫోర్ వీలర్స్ వరకూ.. ఆఖరికి మెడికల్ సపోర్ట్ కూడా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చేసింది.. దీంతో బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే అన్ని పనులూ చక్కబెట్టేసుకుంటున్నారు. ఇది బిజీబిజీగా ఉండేవారికి ఎంతో వెసులుబాటుగా మారింది. బట్టలు కూడా దాదాపు ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. అయితే మనకు నచ్చిన, మన శరీరానికి నప్పే బట్టలు, కొలతల విషయంలో ఇబ్బంది తలెత్తుతోంది. దీనికి పరిష్కారంగానే స్టిచ్ ఆన్లైన్ ట్రెండ్ అవుతోంది. దీంతో మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న సమయానికి ఇంటికి వచ్చి కొలతలు తీసుకుని, నచ్చిన మెటీరియల్‌తో నచ్చిన మోడల్‌తో స్టిచ్చింగ్ చేసి, ఇంటికే డెలివరీ ఇస్తున్నారు. దీని గురించిన మరిన్ని విశేషాలు..కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. అనే సామెత టైలరింగ్‌కు సరిగ్గా నప్పుతుంది. ఒకప్పుడు బట్టలు కుట్టించుకోవాలంటే.. టైలరింగ్ షాపుకు వెళ్లి కొలతలు ఇచ్చి కుట్టించుకునేవారు. ఆ తర్వాత రెడీమేడ్స్ రాకతో టైలరింగ్ మరుగునపడిపోయింది.. ఆ తర్వాత ఆన్లైన్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే సరిగ్గా ఇదే కాన్సెప్్టని ఉపయోగించి ఆన్లైన్ స్టిచ్చింగ్ పేరుతో టైలరింగ్‌కి నూతన హంగులు అద్దారు. అంతేకాదు.. ఇదే ప్రస్తుతం నగరంలో ట్రెండ్‌గా నడుస్తోంది.. అసలేంటీ ఆన్లైన్ స్టిచ్చింగ్? అనుకుంటున్నారా.. అదేనండి.. మనకు వెసులుబాటు ఉన్న సమయంలో మనం బుక్ చేసుకున్న ప్రాంతానికే వచ్చి కొలతలు తీసుకుని నచ్చిన మోడల్స్‌లో స్టిచ్ చేసి ఇంటికే డెలివరీ ఇస్తారన్నమాట!కరోనా తర్వాత..మన అవసరాలే ఆవిష్కరణలకు మూలం అన్నట్లు.. కరోనా సమయంలో ఎంతోమందికి కొత్త కొత్త ఐడియాలు పుట్టుకొచ్చాయి. ఆ సమయంలో అవసరాల ద్వారా కలిగిన.. అవకాశాలను పలువురు అందిపుచ్చుకున్నారు. ఆ ఆలోచనలను స్టార్టప్స్‌గా మలచి వ్యాపారంలో రాణిస్తున్నారు. చాలామందికి టైలరింగ్ అనగానే ఓ కుట్టు మెషీన్ పెట్టుకుని వచ్చిన వారికి బట్టలు కుట్టడం. కానీ కొందరు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు రాలేని వారు, గర్భిణులకు బట్టలు కుట్టించుకోవడం కష్టం అవుతుంది. అందుకే వారి కోసం ఆన్లైన్ టైలరింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కమాటలో సింపుల్‌గా చెప్పాలంటే క్లౌడ్ టైలరింగ్ అన్నమాట. దీనికే రకరకాల పేర్లు కూడా ఉన్నాయి.. ఆన్లైన్ స్టిచ్, కాల్ దర్జీ, మై టైలర్ ఇలా చాలా వరకూ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్స్ వినియోగదారులకు తమ సేవలను అందిస్తున్నాయి. అభిరుచికి అనుగుణంగా..మోడ్రన్, ట్రెండీ ఫ్యాషన్ డిజైన్స్‌ను ఈ తరం యువత ఎంతగానో ఇష్టపడుతోంది. సోషల్ మీడియాలో నిత్యం వైరల్‌గా మారే వినూత్న డిజైన్లను సైతం వ్యక్తిగతంగా రూపొందించుకోవడానికి ఈ క్లౌడ్ టైలరింగ్ వారధిగా మారింది. తమకు నచ్చిన డిజైన్ల ఫొటోలు లేదా సోషల్ మీడియా లింక్స్ ఈ ఆన్లైన్ టైలర్లకు షేర్ చేస్తే చాలు.. వారి సైజులకు తగినట్టుగా వారు కోరుకున్న ఫ్యాషన్ వేర్ ఇంటికొచ్చేస్తున్నాయి. అంతేకాకుండా అభిమాన సెలబ్రిటీలు ధరించినటువంటి ఫ్యాషన్ హంగులను అనుకరించాలనుకునే ఔత్సాహికులకు కూడా ఈ ఆన్లైన్ వేదిక స్వర్గధామంలా మారింది. ఫ్యామిలీ డాక్టర్, ఫ్యామిలీ లాయర్ మాదిరిగా.. సెలబ్రిటీలకు పర్సనల్ డిజైనర్ మాదిరిగా.. మనకూ ఓ పర్సనల్ టైలర్ అనే చెప్పొచ్చు. అందుకే ఈ ఆన్లైన్ టైలరింగ్ ట్రెండ్‌గా మారుతోంది.సెలబ్రిటీలకు సౌలభ్యంగా..సినీతారలు, బుల్లితెర సెలబ్రిటీలు మొదలు ఈ మధ్య ఫేమస్ అవుతున్న సోషల్‌మీడియా సెలబ్రిటీలు ఎందరో. వీరు షాపింగ్ వెళ్లాలన్నా, బొటిక్స్లో స్టిచ్చింగ్ కోసం వెళ్లాలన్నా అక్కడి పరిస్థితులు సందడిగా మారతాయి. అంతేకాకుండా వారికి కూడా అభిమానుల నుంచి కాస్త ఇబ్బందికర వాతావరణం ఎదురౌతోంది. ఇలాంటి తరుణంలో ఈ ఆన్లైన్ స్టిచ్చింగ్ సెలబ్రిటీలకు సౌలభ్యంగా మారిందని పలువురు తారలు అభిప్రాయపడుతున్నారు. పేజ్ త్రీ పీపుల్ సైతం ఈ ఒరవడికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.డిజైనర్ డ్రెస్సులు సైతం..సోషల్ మీడియాలోనో లేదా సినిమాలోనో ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫాంలోనో.. లేదా నచ్చిన హీరో, హీరోయిన్ వేసుకున్న డ్రెస్ కావాలనిపిస్తే.. ఆ క్లిప్ తీసి ఆన్లైన్ టైలరింగ్‌కి పంపిస్తే.. సరిగ్గా అదే తరహాలో డెలివరీ ఇస్తారు. అయితే.. అలాంటి డ్రెస్ కావాలని దగ్గర్లోని టైలర్ దగ్గరికి వెళ్తే.. వారికి ఆ తరహా స్టిచ్చింగ్ రాకపోవచ్చు.. మరీ పెద్ద పెద్ద బొటిక్‌లకు వెళ్తే కాస్త డబ్బులు ఎక్కువ చెల్లించుకోవాల్సి రావచ్చు.. అసలు అలాంటివి ఎక్కడ ఉంటాయో కూడా తెలియకపోవచ్చు.. తెలిసినా దూరాభారం అవ్వొచ్చు.. అందుకే వీటన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం ఆన్లైన్ టైలరింగ్. మనకు నచ్చిన డిజైన్.. మనకు నప్పేలా.. మనకు ఫిట్ అయ్యేలా కుట్టిస్తారు. ఆన్లైన్లో ఎలా సాధ్యం?టైలరింగ్ అంటే మన శరీర కొలతలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆన్లైన్ ద్వారా ఎలా సాధ్యం అనే కదా డౌటు. ఆన్లైన్లో మనకు కావాల్సిన డిజైన్ డ్రెస్, జాకెట్, కుర్తా ఇలా ఇంకేదైనా సరే.. ఆర్డర్ పెడితే చాలు. మన ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ల స్టోర్ నుంచి ఓ వ్యక్తి వచ్చి కొలతలు తీసుకుంటారు. ఆ తర్వాత అన్ని పనులు చకచకా చేసేస్తారు. మనకు నచ్చిన డ్రెస్.. చెప్పిన టైంలో మన ఇంటికి వచ్చేస్తుంది. ఇందు కోసం కొలతలు తీసుకునేందుకు లోకల్ టైలర్స్‌తో ఒప్పందం చేసుకోవడం.. లేదా సిబ్బందిని నియమించుకోవడం చేస్తారు. లేని పక్షంలో కస్టమర్లు అందించిన సైజులకు అనుగుణంగా వారు కోరుకున్న డిజైన్లను రూపొందించి పంపిస్తారు. -
Azadi Ka Amrit Mahotsav: 7 రోజుల్లో 450 జాతీయ జెండాలు
పట్నా: 91 ఏళ్ల వృద్ధుడు కేవలం వారం రోజుల్లో ఏకంగా 450 జాతీయ జెండాలను తన కుట్టుమెషీన్‌పై కుట్టాడు. ఈ అరుదైన సంఘటన బిహార్ రాష్ట్రం సుపౌల్ జిల్లా నిర్మాలీలో చోటుచేసుకుంది. లాల్మోహన్ పాశ్వాన్(91) అచ్ఛమైన గాంధేయవాది. దర్జీగా జీవనం సాగిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంందర్భంగా ‘హెల్ప్ ఏజ్ ఇండియా’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ జాతీయ జెండాల కోసం లాల్మోహన్కు ఆర్డర్ ఇచ్చింది. కేవలం 7 రోజుల్లో 450 జెండాలు కుట్టి హెల్ప్ ఏజ్ ఇండియాకు అందజేశారు. రోజుకు 12 గంటలపాటు పనిచేసి, జెండాలు కుట్టానని లాల్మోహన్ చెప్పారు. జెండాలు కుట్టడాన్ని పవిత్రమైన బాధ్యతగా భావించానని, స్వాతంత్య్ర దినోత్సవ కంటే ముందు రోజే జెండాలను అందజేసినందుకు చాలా గర్వించానని అన్నారు. -
ఆపరేషన్ చేసి కుట్లు మరిచారు
యశవంతపుర: వృద్ధ మహిళకు డాక్టర్ ఆపరేషన్ చేసి, కుట్లు వేయకుండా మరిచిపోయారు. ఈ సంఘటన దావణగెరెలో జరిగింది. దావణగెరె తాలూకా బుల్లాపురకు చెందిన అన్నపూర్ణమ్మ (65) కడుపునొప్పితో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేసి ఆపరేషన్ చేశారు. కానీ కోత కోసిన చోటకుట్లు వేయకుండా వదిలేశారు. ఆమె నొప్పితో బాధపడుతుండడంతో కొడుకు గమనించి వైద్యులను ప్రశ్నించగా ఏదో సాకు చెప్పారు. ఆపరేషన్ చేసి 15 రోజులు అవుతుంది. ఇంతవరకూ గాయం మానలేదని బాధితులు తెలిపారు. డాక్టర్లు అడిగినంత ఫీజులు చెల్లించామని చెప్పారు. చివరకు ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. (చదవండి: భార్యను కాటేసిన పాము.. బాటిల్లో బంధించి మరీ ఆస్పత్రికి.. సమాధానం విని ఘొల్లుమని నవ్వులు) -
మాస్కులు కుడుతున్న ‘బ్రిటిష్ ఇల్లాలు’
బంజారాహిల్స్: కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాల్సి ఉండగా కొంతమంది పేదలు వీటికి దూరమవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బంజారాహిల్స్ రోడ్ నంబర్–3లో నివసించే బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ విభాగం అధికారి ఆండ్రుఫ్లెమింగ్ భార్య వ్యాన్ఫ్లెమింగ్ గత 3 రోజుల నుంచి మాస్క్‌లు ఉచితంగా అందిస్తున్నారు. నైజీరియన్ క్లాత్‌తో ఆమె ఈ మాస్క్‌లు కుడుతూ తన చుట్టుపక్కల నివసించే పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఆమె చేస్తున్న ఈ సేవకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ఆమె 300కుపైగా మాస్క్‌లను సొంతంగా కుట్టి పంపిణీ చేశారు. -
కుట్టుకూలి అరకొరే..!
♦ గతంలో జతకు రూ.40 చెల్లింపు ♦ ఈసారి పెంచింది రూ.10 మాత్రమే ♦ గిట్టుబాటు కాని స్టిచ్చింగ్ చార్జీలు ♦ కుట్టడానికి ముందుకు రాని దర్జీలు ♦ గత్యంతరం లేక ఏజెన్సీలకు అప్పగింత ♦ యూనిఫాంలు సరిగా కుట్టడం లేదని ఆరోపణలు ♦ సర్కారు స్కూళ్ల విద్యార్థులకు తప్పని ఇబ్బందులు ♦ పట్టించుకోని అధికారులు, పాలకులు గీసుకొండ(పరకాల): సర్కారు స్కూళ్లను బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నాం.. వంట గదులు, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం.. వీటికోసం రూ.కోట్లు ఖర్చుచేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం పేద విద్యార్థుల యూనిఫాంల కుట్టుకూలీ విషయంలో పిసినారి తనం చూపిస్తోంది. పిల్లలకు దుస్తుల పంపిణీ ప్రారంభించిన నాటి నుంచి గత పాలకులు కుట్టుకూలి ధర పెంచలేదు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా పెంచినప్పటికీ అదీ రూ.10లతో సరిపెంట్టింది. అరకొర పెంపుతో పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. ఫలితంగా ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ విద్యార్థులకు నాసిరకం కుట్లతో దుస్తులను పంపిణీ చేయనున్నారు. కొన్ని రోజులకే కుట్లు పోయే స్థితిలో ఏజెన్సీలు అంగడి కుట్లతో దుస్తులను తయారు చేయిస్తున్నారని స్వయంగా ఆయా పాఠశాలల హెచ్ఎంలే చెబుతున్నారు. అధ్వానంగా దుస్తులు..! ప్రభుత్వ పాఠశాల పిల్లల దుస్తులు కుట్టివ్వడానికి స్థానికంగా ఉన్న టైలర్లు ముందుకు రావడం లేదు. ఇందుకు కారణం కుట్టుకూలి గిట్టుబాటు కాకపోవడమే. ప్రతి విద్యార్థికి ఏడాదికి రెండు జతల దుస్తులను అందిస్తుండడగా ఒక్కో జత కుట్టడానికి గతంలో ప్రభుత్వం రూ.40 ఇచ్చేది. ఇటీవల ఆ ధరకు మరో రూ.10 పెంచడంతో మొత్తం రూ.50 అయింది. ఈ లెక్కన రెండు జతలకు రూ.100 కుట్టుకూలి ఇస్తున్నారు. బయట ఒక్కో డ్రెస్ కుట్టాలంలే రూ.200 నుంచి రూ.400 వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంత తక్కువ ధరతో కుట్టించిన యూనిఫాంలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. విద్యాశాఖ అధికారులను అడిగితే కుట్టుకూలి విషయంలో ప్రభుత్వ నిబంధన అలా ఉంది.. అంతకు మించి ఏమీ చేయలేమని అంటున్నారు. దీంతో దర్జీలు ఎవరూ ముందుకు రావడం లేదని హెచ్ఎంలు చెబుతున్నారు. కొన్ని ఏజెన్సీల వారు ముందుకు వస్తున్నా ఆ ధరకు తగినట్టుగానే దుస్తుల కుట్లు నాసిరకంగా(అంగడి కుట్టు) ఉండటం, సైజుల్లో తేడాలు, కుట్టిన కొన్ని రోజులకే కుట్లు పోతున్నాయని అంటున్నారు. వాటిని చూసి విద్యార్థుల తల్లిదండ్రులు తమను నిందిస్తున్నారని హెచ్ఎంలు వాపోతున్నారు. పిల్లలకు పంపిణీ చేసిన దుస్తులను తల్లిదండ్రులు మళ్లీ దర్జీల వద్దకు తీసుకెళ్లి సరిచేయిస్తుండడంతో వారిపై ఆర్థిక భారం పడుతోంది, గడిచిన రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని సైజుల్లోనే దుస్తుల తయారీ 5, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు సాధారణంగా సిరిపోయే నాలుగైదు సైజుల్లోనే ఏజెన్సీల వారు దుస్తులు తయారు చేస్తున్నారు. అందులో కొంచెం పెద్దవాటిని 9, 10 తరగతుల వారికి అందిస్తున్నారు. దుస్తుల సైజులు సరిగా లేకపోవడంతో పొడవుగా ఉన్న వారికి పొట్టి దుస్తులు, చిన్నగా ఉన్న వారికి పెద్ద సైజు దుస్తులు అందుతుండటం పరిపాటిగా మారింది. ఈ సారి ముందుగానే పంపిణీ గడిచిన విద్యా సంవత్సరం ముగిసే సమయంలో విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేశారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పాఠశాలలకు దుస్తులు చేరుకున్నాయి. అయితే ఈసారి అంత ఆలస్యం కాకుండా ముందుగాగే అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 454, యూపీఎస్‌లు 78, ఉన్నత పాఠశాలలు 133 ఉన్నాయి. వీటితో పాటు మోడల్ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు అందిస్తారు. ఇప్పటికే కొన్ని పాఠశాలలకు కుట్టిన దుస్తులు అందుబాటులోకి రాగా విద్యార్థులకు పంపిణీ చేసే పనిలో ఉన్నారు. చాలా పాఠశాలలకు అవసరమైన వస్త్రాన్ని అందజేయగా కుట్టిన దుస్తులు ఇంకా అందలేదు.