కుట్టుకూలి అరకొరే..!
♦ గతంలో జతకు రూ.40 చెల్లింపు
♦ ఈసారి పెంచింది రూ.10 మాత్రమే
♦ గిట్టుబాటు కాని స్టిచ్చింగ్ చార్జీలు
♦ కుట్టడానికి ముందుకు రాని దర్జీలు
♦ గత్యంతరం లేక ఏజెన్సీలకు అప్పగింత
♦ యూనిఫాంలు సరిగా కుట్టడం లేదని ఆరోపణలు
♦ సర్కారు స్కూళ్ల విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
♦ పట్టించుకోని అధికారులు, పాలకులు
గీసుకొండ(పరకాల): సర్కారు స్కూళ్లను బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నాం.. వంట గదులు, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం.. వీటికోసం రూ.కోట్లు ఖర్చుచేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం పేద విద్యార్థుల యూనిఫాంల కుట్టుకూలీ విషయంలో పిసినారి తనం చూపిస్తోంది. పిల్లలకు దుస్తుల పంపిణీ ప్రారంభించిన నాటి నుంచి గత పాలకులు కుట్టుకూలి ధర పెంచలేదు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా పెంచినప్పటికీ అదీ రూ.10లతో సరిపెంట్టింది. అరకొర పెంపుతో పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. ఫలితంగా ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ విద్యార్థులకు నాసిరకం కుట్లతో దుస్తులను పంపిణీ చేయనున్నారు. కొన్ని రోజులకే కుట్లు పోయే స్థితిలో ఏజెన్సీలు అంగడి కుట్లతో దుస్తులను తయారు చేయిస్తున్నారని స్వయంగా ఆయా పాఠశాలల హెచ్‌ఎంలే చెబుతున్నారు.
అధ్వానంగా దుస్తులు..!
ప్రభుత్వ పాఠశాల పిల్లల దుస్తులు కుట్టివ్వడానికి స్థానికంగా ఉన్న టైలర్లు ముందుకు రావడం లేదు. ఇందుకు కారణం కుట్టుకూలి గిట్టుబాటు కాకపోవడమే. ప్రతి విద్యార్థికి ఏడాదికి రెండు జతల దుస్తులను అందిస్తుండడగా ఒక్కో జత కుట్టడానికి గతంలో ప్రభుత్వం రూ.40 ఇచ్చేది. ఇటీవల ఆ ధరకు మరో రూ.10 పెంచడంతో మొత్తం రూ.50 అయింది. ఈ లెక్కన రెండు జతలకు రూ.100 కుట్టుకూలి ఇస్తున్నారు. బయట ఒక్కో డ్రెస్ కుట్టాలంలే రూ.200 నుంచి రూ.400 వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంత తక్కువ ధరతో కుట్టించిన యూనిఫాంలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. విద్యాశాఖ అధికారులను అడిగితే కుట్టుకూలి విషయంలో ప్రభుత్వ నిబంధన అలా ఉంది.. అంతకు మించి ఏమీ చేయలేమని అంటున్నారు.
దీంతో దర్జీలు ఎవరూ ముందుకు రావడం లేదని హెచ్‌ఎంలు చెబుతున్నారు. కొన్ని ఏజెన్సీల వారు ముందుకు వస్తున్నా ఆ ధరకు తగినట్టుగానే దుస్తుల కుట్లు నాసిరకంగా(అంగడి కుట్టు) ఉండటం, సైజుల్లో తేడాలు, కుట్టిన కొన్ని రోజులకే కుట్లు పోతున్నాయని అంటున్నారు. వాటిని చూసి విద్యార్థుల తల్లిదండ్రులు తమను నిందిస్తున్నారని హెచ్‌ఎంలు వాపోతున్నారు. పిల్లలకు పంపిణీ చేసిన దుస్తులను తల్లిదండ్రులు మళ్లీ దర్జీల వద్దకు తీసుకెళ్లి సరిచేయిస్తుండడంతో వారిపై ఆర్థిక భారం పడుతోంది, గడిచిన రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది.
కొన్ని సైజుల్లోనే దుస్తుల తయారీ
5, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు సాధారణంగా సిరిపోయే నాలుగైదు సైజుల్లోనే ఏజెన్సీల వారు దుస్తులు తయారు చేస్తున్నారు. అందులో కొంచెం పెద్దవాటిని 9, 10 తరగతుల వారికి అందిస్తున్నారు. దుస్తుల సైజులు సరిగా లేకపోవడంతో పొడవుగా ఉన్న వారికి పొట్టి దుస్తులు, చిన్నగా ఉన్న వారికి పెద్ద సైజు దుస్తులు అందుతుండటం పరిపాటిగా మారింది.
ఈ సారి ముందుగానే పంపిణీ
గడిచిన విద్యా సంవత్సరం ముగిసే సమయంలో విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేశారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పాఠశాలలకు దుస్తులు చేరుకున్నాయి. అయితే ఈసారి అంత ఆలస్యం కాకుండా ముందుగాగే అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 454, యూపీఎస్‌లు 78, ఉన్నత పాఠశాలలు 133 ఉన్నాయి. వీటితో పాటు మోడల్ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు అందిస్తారు. ఇప్పటికే కొన్ని పాఠశాలలకు కుట్టిన దుస్తులు అందుబాటులోకి రాగా విద్యార్థులకు పంపిణీ చేసే పనిలో ఉన్నారు. చాలా పాఠశాలలకు అవసరమైన వస్త్రాన్ని అందజేయగా కుట్టిన దుస్తులు ఇంకా అందలేదు.