అమెరికాలో పుట్టి నగరంలోనూ హవా..
అక్టోబరులో అట్టహాసంగా వరల్డ్ కప్..
హాబీ గేమ్‌గా, ప్రొఫెషన్‌గానూ ఆదరణ
సాక్షి, సిటీబ్యూరో: ఓ అంతర్జాతీయ సరికొత్త క్రీడ నగరవాసుల్ని ఉర్రూతలూగిస్తోంది. హాబీగా ఆడుకునేవాళ్లని ఉత్సాహపరుస్తోంది.. సీరియస్ ప్రొఫెషన్‌గానూ ఊరిస్తోంది. నటేకర్ స్పోర్ట్స్ అండ్ గేమింగ్ ఆధ్వర్యంలో జరగనున్న వరల్డ్ పికిల్ బాల్ లీగ్ (డబ్ల్యూపీబీఎల్)లో చెన్నై టీమ్‌ను నటి సమంత సొంతం చేసుకున్నారు. తొలిసారిగా క్రీడా పోటీల బరిలో సమంత దిగడంతో అందరి దృష్టి పికిల్ బాల్‌పై మళ్లింది. సిటీకి పరిచయమై ఏడాదిన్నరలోనే ఇంతింతై పికిలింతై అన్నట్టుగా విస్తరిస్తోన్న పికిల్ బాల్ గురించిన విశేషాలివే..
అమెరికాలో అత్యంత ఆదరణ పొందిన ఆట పికిల్ బాల్.. మన దేశానికి ఇటీవలే పరిచయమైనప్పటికీ.. శరవేగంగా ఔత్సాహికులకు చేరువవుతోంది. శిల్పాశెట్టి వంటి నిన్నటి తరం బాలీవుడ్ టాప్ స్టార్స్ సైతం హాబీగా పికిల్‌బాల్‌ను ఎంచుకుంటున్నారంటే ఈ ఆట ఎంత క్రేజీగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
మూడు ఆటల మేలు కలయిక...
టెన్నిస్, బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్‌ల మేలు కలయికగా పికిల్‌బాల్‌ను చెప్పుకోవచ్చు. ఇతర క్రీడలతో పోలిస్తే తక్కువ కదలికలు పరుగు అవసరం కాబట్టి ఏ వయస్సు వారైనా ఆడేందుకు వీలుంటుంది. బ్యాడ్మింటన్ కోర్ట్ లా పికిల్ బాల్ కోర్టు 44 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉంటుంది. నెట్ ఎత్తు 36 అంగుళాలు మాత్రమే ఉంటుంది. పికిల్‌బాల్‌లో ఉపయోగించే పాడిల్ (చెక్క బ్యాట్) టేబుల్ టెన్నిస్‌లో ఉపయోగించే బ్యాట్ కంటే కొంచెం పెద్దది. దీని ధర రూ.3 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. చిల్లులున్న ఓ గట్టి ప్లాస్టిక్ బంతిని ఉపయోగించి ఆడతారు. సింగిల్స్ లేదా డబుల్స్/మిక్స్‌డ్ డబుల్స్ కూడా ఆడవచ్చు. మొత్తం 11 పాయింట్ల కోసం ఆడాల్సి ఉంటుంది. 2 పాయింట్ల తేడాతో గెలవాల్సి ఉంటుంది. నేర్చుకోవడం చాలా సులభమే గానీ నైపుణ్యం సాధించడం చాలా కష్టం కావడం వల్ల తొలిదశలో చాలా మంది హాబీగా మాత్రమే దీన్ని ఎంచుకుంటున్నారు.
విశేషాలివే..
ప్లేయర్లు కోర్టుల సంఖ్య పరంగా దేశంలో పికిల్‌బాల్‌లో అహ్మదాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఈ సంవత్సరం అక్టోబర్ 23 నుంచి 27 వరకు ప్రపంచ పికిల్‌బాల్ ఛాంపియన్‌షిప్ (డబ్లు్యపీసీ)కి ఈ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. గుజరాత్ స్టేట్ పికిల్‌బాల్ అసోసియేషన్, ఇండియన్ పికిల్‌బాల్ అసోసియేషన్, మార్చిలో ప్రకటించాయి. అక్టోబర్‌లో అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించనున్న పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొంటారు.
టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి ఇతర క్రీడలను ఆడినవారు సైతం పికిల్‌బాల్‌కు మారుతుండటం కనిపిస్తోంది. ఆసియాలో అగ్రశ్రేణి ఆటగాడిగా పేరొందిన 12 ఏళ్ల వీర్ షా సైతం టెన్నిస్ నుంచి పికిల్‌కు మారగా బ్యాడ్మింటన్ నుంచి పికిల్‌బాల్‌కు మారిన తేజస్ మహాజన్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బహుళ పతకాలను గెలుచుకున్నాడు.
‘రాబోయే సంవత్సరాల్లో, క్రికెట్ తర్వాత భారతీయులలో పికిల్‌బాల్ రెండవ ఇష్టమైన క్రీడగా మారుతుందని పలువురు క్రీడా నిపుణుల అంచనా.
కోర్టు నిర్మాణానికి వ్యయప్రయాసలు తక్కువ ఉండటం వల్ల ఈ పికిల్ బాల్ కోర్టులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అంతేగాకుండా, దీని పట్ల ఆసక్తి చూపిస్తున్నవారిలో మహిళలతో సహా అన్ని వయసుల వారూ ఉన్నారు.
పికిల్‌బాల్ మూలాలు 1960 ప్రాంతంలో యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నాయి. ఆల్ ఇండియా పికిల్‌బాల్ అసోసియేషన్ 2008లోనే ప్రారంభించబడినప్పటికీ, చాలా ఆలస్యంగా ఇది పుంజుకుంది.
జాతీయ స్థాయి ర్యాంకింగ్ టోర్నమెంట్‌లు ఎలా ఉన్నప్పటికీ, 2022లో ముంబైలో పికిల్‌బాల్ ప్రపంచ కప్‌గా పరిగణన పొందిన బైన్‌బ్రిడ్జ్ కప్‌ను నిర్వహించడం పికిల్ బాల్‌కి బాగా ఊపు తెచ్చింది.
సిటీలో ఏడాదిన్నరగా..
ఈ ఆట నగరానికి పరిచయమై దాదాపుగా ఏడాదిన్నర కావస్తోంది. కొండాపూర్‌లో తొలిసారి పికిల్ బాల్ ఎరీనా పేరుతో ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఒకే చోట నాలుగు కోర్టులు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం మాదాపూర్, బంజారాహిల్స్‌లలో ఉన్న గేమ్ పాయింట్ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో కూడా ఇది అందుబాటులో ఉంది. త్వరలోనే ఔటర్ రింగ్‌రోడ్ సమీపంలో 8 కోర్టులు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. అమెరికా రిటర్న్‌డ్‌కి దీనిపై బాగా అవగాహన ఉంది. వాళ్లే ఎక్కువ ఏర్పాటు చేస్తున్నారు. అమెరికాలో టెన్నిస్ కోర్టులన్నీ పికిల్ బాల్ కోర్టులుగా మారుతున్నాయి.
రిక్రియేషన్ క్రీడగా ప్రాచుర్యంలోకి..
టెన్నిస్ బాల్‌తో పోలిస్తే పికిల్ బాల్ స్లోగా నేర్చుకోవడం సులభంగా ఉంటుంది. మరీ ఎక్కువ ఫిట్‌నెస్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. అందువల్ల చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ ఇష్టపడుతున్నారు. అమ్మాయిలు కూడా ఇష్టం చూపిస్తున్నారు. ఒక్కో గేమ్ కనీసం 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకూ ఉండటం వల్ల ఒక మంచి వ్యాయామంగా కూడా ఉపకరిస్తోంది. సో.. ప్రస్తుతం ఒక రిక్రియేషన్ గేమ్‌గా ఇది సిటీలో పాపులర్ అయ్యింది. అయితే ఇటీవలే దీన్ని ఒక సీరియస్‌గా కూడా తీసుకుని ఆడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేం ఇటీవలే ఒక పికిల్‌బాల్ టోర్నమెంట్ కూడా నిర్వహించాం. భవిష్యత్తులో ఇది బలమైన క్రీడగా మారనుండటం మాత్రం తథ్యం. – ఆదిత్య, నిర్వాహకులు, గేమ్ పాయింట్ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్
లవ్ ఎట్ ఫస్ట్ సైట్..
పికిల్ బాల్‌తో నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పాలి. ఈ ఆటతో నేను అమాంతం ప్రేమలో పడిపోయాను. తొలిసారి దీన్ని పరిచయం చేసిన దగ్గర్నుంచే ఇది నా మనసు దోచుకుంది. భారతీయ క్రీడాభివృద్ధిలో భాగం కావాలనేది ఎప్పటి నుంచో నా కోరిక.. అలాగే క్రీడల్లో మహిళల పురోగతిని మరింతగా కోరుకుంటున్నా. – సమంత, సినీనటీ
Comments
Please login to add a commentAdd a comment