
పాతబస్తీలో సందడి చేయనున్న ప్రపంచ సుందరాంగులు
ఈ నెల 13న చార్మినార్–లాడ్ బజార్‌లో హెరిటేజ్ వాక్
కట్టుదిట్టమైన భద్రతతో ఆదివారం రిహార్సల్స్ పూర్తి
చార్మినార్: పాతబస్తీలో మిస్ వరల్డ్ సుందరాంగులు సందడి చేయనున్నారు. నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్–2025లో పాల్గొంటున్న పోటీదారులతో ఈ నెల 13న చారి్మనార్‌లో హెరిటేజ్ వాక్ జరగనుంది. దాదాపు 120 దేశాలకు చెందిన ప్రపంచ సుందరాంగులు ఈ హెరిటేజ్ వాక్‌లో పాల్గోనున్నారు. చారి్మనార్ నుంచి లాడ్ బజార్ వరకూ నిర్వహించే వాక్‌లో కంటెస్టెంట్స్ ఇక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోనున్నారు. పాతబస్తీ చారిత్రక కట్టడాల విశేషాలతో పాటు లాడ్ బజార్‌లోని గాజుల తయారీ కళాకారులతో ప్రత్యక్షంగా మాట్లాడనున్నారు. దీనికి సంబంధించి వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.
హెరిటేజ్ వాక్ సందర్భంగా పాతబస్తీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే చారి్మనార్ కట్టడాన్ని మువ్వన్నెల జెండా రంగుల్లో విద్యుత్ దీపాలంకరణ చేశారు. పర్యాటకులు చారి్మనార్ వద్ద సెల్పీలు దిగుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు, డివైడర్లకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అఫ్జల్‌గంజ్ ద్వారా పాతబస్తీకి ప్రవేశించే నయాపూల్ బ్రిడ్జిపై కొత్తగా మొక్కలతో అలంకరించారు.
రిహార్సల్స్ పూర్తి..
నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో దక్షిణ మండలం డీసీపీ స్నేహా మెహ్రా ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం చార్మినార్ నుంచి లాడ్‌బజార్ వరకూ హెరిటేజ్ వాక్ రిహార్సల్స్ జరిగాయి. పోలీసు, పర్యాటక, విద్యుత్, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్, ఆర్కియాలజీ, జలమండలి.. ఇలా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో వ్యవహరించి ఈ రిహార్సల్స్‌లో పాల్గొన్నారు. తెలంగాణ జరూర్ ఆనా..అనే టైటిల్‌తో రూపొందించిన ఏసీ బస్సులో మిస్ వరల్డ్–2025 అభ్యర్థులను తరలించనున్నారు. శివారు ప్రాంతమైన ఆరంఘర్ నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ ద్వారా పాతబస్తీకి ప్రవేశించి బహదూర్‌పురా, పురానాపూల్, పేట్లబురుజు, మదీనా సర్కిల్, పత్తర్‌గట్టి, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్ ద్వారా చారి్మనార్‌కు చేరుకోనుంది.