లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్, అరవింద్ అడిగా
ముంబయిలో, విమానాశ్రయం దగ్గరే ఉన్న ‘వకోలా’ అన్న ప్రాంతంలో ఉన్న ‘విశ్రామ్ టవర్స్ సొసైటీ’లో రెండు బిల్డింగులుంటాయి. అవి శిథిలమవుతున్నప్పటికీ ‘పక్కా’వే. రోజుకి రెండుసార్లు నీళ్ళొస్తాయి. వాటిల్లో ఉండేది, వివిధ వర్గాలకు చెందిన దిగువ మధ్య తరగతి కుటుంబాలు. చుట్టుపక్కలుండేవి గుడిసెలు.
అరవింద్ అడిగా రాసిన, ‘లాస్ట్ మాన్ ఇన్ టవర్’లో ‘ఇతరుల వద్దనున్నవాటి గురించీ, నీ వద్ద లేకపోయిన వాటి గురించీ కలలు కను. అదే నిన్ను ధనవంతుడిని చేస్తుంది’ అని నమ్మే– ధర్మేష్ షా, ‘వంటినిండా బంగారం, ఉబ్బసం’ ఉన్న వ్యక్తి. ఆ బిల్డింగులను పడగొట్టి, ‘షాంఘై’ అన్న ఆకాశహార్మాన్ని కడదామనుకుంటాడు.
ప్రతీ అపార్టుమెంటు యజమానికీ 1.52 కోట్ల రూపాయలు ఇస్తాననీ, సెప్టెంబర్ చివరికల్లా ఇళ్ళు ఖాళీ చేయాలనీ, మే నెలలోనే ప్రకటిస్తాడు. ఏ వొక్కరు ఒప్పుకోకపోయినా, తన ప్రతిపాదన వెనక్కి తీసుకుంటానని, తన సహాయకుడైన షణ్ముగం ద్వారా వారికి చెప్పిస్తాడు. అంత సొమ్ముకి రెండు అపార్టుమెంట్లు కొనుక్కోవచ్చుననుకున్న బిల్డింగ్ నివాసులలో కొందరు, వెంటనే ఒప్పేసుకుంటారు. అయితే ‘పింటో’లు, శ్రీమతి రేగో, శ్రీ కుడ్వా లాంటివారు తమతమ కారణాలవల్ల నిరాకరిస్తారు. అందరికన్నా ఎక్కువ బలంగా నిలుచుని, ఆ డబ్బుని తోసిపుచ్చిన వ్యక్తి, ‘మాస్టర్జీ’ అని అందరూ పిలిచే, ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన యోగేశ్ మూర్తి. చనిపోయిన తన భార్యా, కూతురి జ్ఞాపకాలతో బతుకుతున్నవాడు. ‘అతను ముంబయిలో 44 ఏళ్ళు గడిపాడు. నాస్తికుడయినప్పటికీ, ‘మురికి చెరువులో కమలంలా లోకంలో ఉండు కానీ, దానిలో భాగం అవకు’ అని బోధించిన హిందూ తత్వవేత్తల మాటలను తు.చ. తప్పకుండా పాటించేవాడు.’ ‘నా ఇల్లు అమ్మకపోవడం నా ఇష్టం అయి ఉండాలి’ అని నమ్మే వ్యక్తి.
అయితే, దీని తరువాత, మాస్టర్జీ–భార్య చనిపోయిన తరువాత మొట్టమొదటిసారి, లోకంలో తను ఒంటరివాడిని కాననుకుంటాడు. అపార్టుమెంట్ల అమ్మకాన్ని ఆపేందుకు– సామాజిక సంస్థలనూ, పోలీసులనూ, వకీలునూ, వార్తాపత్రిలనూ, పాత విద్యార్థులనూ సమీపిస్తాడు కానీ ఫలితం ఉండదు.
అతని నిర్ణయాన్ని మార్చడానికి మొదట్లో షా బతిమాలతాడు, సున్నితంగా ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, మాస్టర్జీ ఆదర్శవాదాన్ని అర్థం చేసుకోలేకపోతాడు. ‘డబ్బవసరం లేని వ్యక్తి తన హృదయంలో రహస్య అరలు లేనివాడు. ఎటువంటివాడితను! బేరసారాల విధానాలన్నిటినీ చూశాను. ఇలా ‘వద్దు’ అని స్థిరంగా చెప్పే ఎత్తుగడని ఎప్పుడూ చూడలేదు’ అనుకుంటాడు. సొసైటీ ప్రెసిడెంట్, సెక్రెటరీ ఒత్తిడికి లోనై, మొదట ప్రతిఘటించినవారు తమ నిర్ణయం మార్చుకుంటారు.
ఈ లోపల, సెప్టెంబర్ వస్తుంది, పోతుంది. షా నుండి ఏ స్పందనా రాకపోవడంతో ఆదుర్దాపడిన కొందరు సొసైటీ సభ్యులు, మాస్టర్జీని సుత్తితో కొట్టి స్పృహ తప్పించి, డాబా మీదినుంచి కిందకి తోసేస్తారు. అతని మరణాన్ని ఆత్మహత్యగా ప్రకటిస్తారు. షా అందరి డబ్బూ చెల్లిస్తాడు. రెండు నెల్ల తరువాత, మిగతావారు కొత్త చోట్లలో నివాసం ఏర్పరచుకుంటారు. కొందరు మాస్టర్జీ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, షా ఇచ్చిన డబ్బు తీసుకోరు. తమ అపరాధ భావాన్ని తొలగించుకునేందుకు, పేదపిల్లలకు చదువు చెప్పడం ప్రారంభిస్తారు. మాస్టర్జీ పోరాటం విజయవంతం అవనప్పటికీ, అర్థవంతమైనదిగా అయితే మారుతుంది.
నవల చివర్న, విశ్రామ్ సొసైటీ బయటున్న మర్రిచెట్టు, మాస్టర్జీ ఆత్మలాగే– కూల్చివేతను, ముళ్ళకంచెలను, గాజుపెంకులను తట్టుకొని, కొత్తగా వేళ్ళూనుతుంది. రచయిత రాస్తారు: ‘స్వేచ్ఛ పొందాలనుకున్న దేన్నీకూడా, ఆపేదేదీ ఉండదు’. దురాశా, కలలూ– మనిషిని ఎలా నిర్బంధిస్తాయో చెబుతుందీ నవల. అయితే, ఉన్నదాని కన్నా ఎక్కువ కావాలనుకోవడం పాపమా? అని కూడా ప్రశ్నిస్తుంది. షా కన్నా మాస్టర్జీ తక్కువ స్వార్థపరుడా? అన్న సందేహమూ కలిగిస్తుంది. ఈ పుస్తకాన్ని 2011లో ప్రచురించినది అట్లాంటిక్ బుక్స్.
చెన్నైలో పుట్టిన కన్నడిగుడు అరివింద్ అడిగా. ప్రస్తుతం ఆస్ట్రేలియా పౌరుడు. వృత్తి రీత్యా పాత్రికేయుడు. 2008లో తన తొలి నవల ‘వైట్ టైగర్’కుగానూ మ్యాన్ బుకర్ బహుమతి పొందారు.
-కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment