హాఫ్ గర్ల్‌ఫ్రెండ్
పుస్తకం : హాఫ్ గర్ల్‌ఫ్రెండ్
రచయిత : చేతన్ భగత్
భాష : ఇంగ్లీష్
హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ నవల ముఖచిత్రం
కథ : మాధవ్ జా బీహార్‌కు చెందిన యువకుడు. డిగ్రీ చదవుల నిమిత్తం ఢిల్లీలోని సేయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చేరతాడు. అక్కడ రియా సోమని అనే డబ్బున్న అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ బాస్కెట్ బాల్ ప్లేయర్స్ కావటంతో సన్నిహితంగా మెలుగుతుంటారు. రియాను చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడిన మాధవ్ చాలా రోజుల తర్వాత ఆ విషయాన్ని ఆమెకు చెబుతాడు. ఆమె ప్రేమా, గీమా వద్దు ఫ్రెండ్స్‌గా ఉందాం అంటుంది. అతను మాత్రం తన ప్రయత్నాల్లో తను ఉంటాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా మనస్పర్థలు వస్తాయి. అప్పటినుంచి రియా, మాధవ్‌ను దూరంగా ఉంచుతుంది. కొద్దిరోజులకే వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధపడుతుంది. రియాతో మాట్లాడటానికి పరితపిస్తున్న మాధవ్‌కు ఓ రోజు ఆమెతో మాట్లాడే అవకాశం లభిస్తుంది. ఆ మాటల సందర్భంలోనే తనకు పెళ్లి నిశ్చయమైనట్లు, కాలేజీ మానేస్తున్నట్లు అతడికి చెబుతుంది. మాధవ్‌కు పెళ్లి పత్రిక ఇచ్చి పెళ్లికి రమ్మంటుంది. దీంతో అతడు పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు. ఎలాగోలా డిగ్రీ పూర్తి చేసుకుని బీహార్ వెళ్లిపోతాడు. తమ కుటుంబం నడుపుతున్న స్కూల్‌లో పనిచేస్తూ తల్లికి తోడుగా ఉంటాడు.
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పాట్నాలోని ఓ హోటల్‌లో రియా అతడికి కన్పిస్తుంది. పెళ్లి అవటం, తర్వాత విడాకులు తీసుకోవటం గురించి అతడికి చెబుతుంది. ఇద్దరు మళ్లీ స్నేహంగా ఉండటం మొదలుపెడతారు. మాధవ్ తల్లికి ఇదంతా నచ్చదు. విడాకులు తీసుకున్న అమ్మాయితో కొడుకు సన్నిహితంగా ఉండటం, రాజవంశానికి చెందిన తన కుమారుడు వేరే కులం అమ్మాయితో తిరగటం సహించలేకపోతుంది. రోజులు గడుస్తున్న కొద్ది మాధవ్, రియాపై మరింత ఆశలు పెంచుకుంటాడు. అయితే ఈ సారైనా రియా, మాధవ్ ప్రేమను అంగీకరిస్తుందా? సున్నితంగా కుదరదని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతుందా? ఒక వేళ అంగీకరిస్తే మాధవ్ తల్లి వీరి పెళ్లికి అడ్డుచెబుతుందా? లేక కొడుకు సంతోషం ముఖ్యమని అంగీకరిస్తుందా? అన్నదే మిగితా కథ.
విళ్లేషణ : ప్రముఖ ఇంగ్లీష్ నవలల రచయిత చేతన్ భగత్ ఊహాల్లోంచి జాలువారిన ఓ అద్భుత ప్రేమ కావ్యం. తొలిప్రేమను దక్కించుకోవటానికి కష్టపడే మాధవ్ పాత్ర పాఠకుల(ప్రేమికుల) మనసులో ముద్రపడిపోతుంది. తెలిసీ తెలియని వయసులో తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు ఎలా జీవితాన్ని ఇబ్బందుల్లో పడేస్తాయో రియా, మాధవ్‌ల పాత్రలు మనకు ఉదహరిస్తాయి. ఇంగ్లీష్ భాషపై పట్టులేని వాళ్లకు కూడా అర్థమయ్యేలా రచయిత ఈ పుస్తకాన్ని రాశారు. 2017లో ఈ నవల ఆధారంగా బాలీవుడ్ ఇదే పేరుతో ఓ సినిమా కూడా తెరకెక్కింది. అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్‌లు ఈ సినిమాలో జంటగా నటించారు. ప్రేమికులు తప్పకుండా చదవాల్సిన నవల ఇది.
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment