రాజిగాడు రాజయ్యాడు | Rajigadu Rajayyadu Book Review | Sakshi
Sakshi News home page

రాజిగాడు రాజయ్యాడు

Published Mon, May 6 2019 12:40 AM | Last Updated on Mon, May 6 2019 12:40 AM

Rajigadu Rajayyadu Book Review - Sakshi

సామాజిక న్యాయ సాధన కోసం ఉవ్వెత్తున వీస్తున్న అంశాన్ని ముందుకు తెస్తున్న నాటకం ‘రాజిగాడు రాజయ్యాడు’. ఉత్తరాంధ్ర సాహిత్య సుసంపన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రచన ఇది. శ్రామిక వర్గాలకు చెందిన దళిత బహుజనులు పాలకులుగా ఎదగాలని, రాజ్యాధికారం ద్వారానే వారి సమస్యలు పరిష్కారమవుతాయనే లక్ష్యంతో డాక్టర్‌ దీర్ఘాసి విజయభాస్కర్‌ ఈ నాటకాన్ని రాశారు.

రాజిగాడుగా పిలిచే శ్రామిక వర్గానికి (మంగలి) చెందిన వ్యక్తి తనపై వర్ణ వివక్ష, దౌర్జన్యం భరించలేక రాజ్యాధికారంతోనే విముక్తి కలుగుతుందని గ్రహిస్తాడు. జనాలను సమీకరించి తిరుగుబాటు బావుటా ఎగరేసి గ్రామసర్పంచి కావడమే ఇందలి ఇతివృత్తం.

అది నైమిశారణ్యం. ఆ అరణ్యంలోనే సూతుడు శౌనకాది మహామునులకు పురాణం చెబుతుంటాడు. తన ప్రవచనాన్ని కొనసాగిస్తూ భరతఖండంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంలో– ‘‘ఏ భూమిపై తూర్పు వాకిట బలిదానాల తోరణం అమరివుందో! ఏ నేలపై నూరు కొత్త ఉదయాలకై ఉద్యమం ఉప్పెనైందో! ఏ గడ్డపై సమభావం కోసం సమరం సాగిందో! ఏ మట్టిపై సాయుధులు నేలకొరిగి నింగికెగిశారో! ఆ గడ్డపై గడ్డిపోచవంటివాడు, గరుత్మంతుడై, గరళ కంఠుడై, సంప్రదాయ సర్పపు కోరలు పీకాడు. సామాన్యుని సామ్రాజ్యానికి పునాదులు వేశాడు’’ అని చెప్పినప్పుడు, ఎవరా వీరుడని మునులంతా ఆత్రుతతో ప్రశ్నిస్తారు. అందుకు సూతుడు శ్రామిక వర్గానికి చెందిన రాజిగానిలో క్షాత్రగుణం ఎలా వీరవిహారం చేసిందో చెబుతానంటాడు. ఇలా ప్రారంభమౌతుంది నాటకం.

సమాజంలో వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఈ వర్గాల్లో కొన్ని సామాజిక వర్గాల వారే ఆధిపత్యం వహిస్తున్నారు. మిగిలిన అణగారిన వర్గాలను అణచివేస్తున్నారు. ఈ నాటకంలో నాయుడు బీసీ వర్గీయుడే. బలవంతుడు కావడం వల్ల ఏళ్ల తరబడి సర్పంచి పదవి ఈయన గుప్పిట్లోనే ఉంది. ఫ్యూడలిస్టు దృక్పథంతో వ్యవహరిస్తుంటాడు. ఈ నేపథ్యంలో రాజయ్య ‘‘నాయుడూ! మీ బోటి కులాలన్నీ మావల్లే గెలిచి రాజ్యమేలుతున్నాయి. ఇకనుంచీ రాజ్యాధికారంలో మా వాటా మాకివ్వకపోతే ఊరుకొనేది లే’’దంటాడు. మరో సన్నివేశంలో ‘‘నీకన్నా ఎన్నోరెట్లు అధమ స్థితిలో ఉన్న వాళ్లతో సమానంగా నువ్వు రిజర్వేషన్లు అనుభవించడం మంచి పనా?’’ అని సూటిగా ప్రశ్నిస్తాడు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు కొన్ని బడావర్గాలకే అందుతున్నాయనీ, అత్యంత పీడిత తాడిత వర్గాలకు అవి అందని ద్రాక్షగా మారుతున్నాయనీ రచయిత ఈ పాత్రద్వారా చెప్పిస్తాడు.

ఆ పల్లెలోని అణగారిన వర్గాలన్నీ ఏకతాటిపై నిలుస్తాయి. నాయుడు నిరంకుశ పాలనను ప్రతిఘటిస్తాయి. నాయుడులో మార్పు వస్తుంది. రాజయ్య గ్రామ సర్పంచవుతాడు. అప్పటివరకు రాజిగాడుగా పిలిచినవారే రాజయ్య, సర్పంచిగారు అని సహజంగానే పిలవడం మొదలుపెడతారు. సాంస్కృతిక రంగంలో సరికొత్త చైతన్యం ‘రాజిగాడు రాజయ్యాడు’. 

-వాండ్రంగి కొండలరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement