బాలీవుడ్ అందాల నటి పరిణీతి చోప్రాకు ఇష్టమైన పుస్తకాలో ఒకటి...ది గర్ల్ ఆన్ ది ట్రైన్. ‘ది న్యూయార్క్ టైమ్స్ ఫిక్షన్ బెస్ట్ సెల్లర్స్’లో మొదటి స్థానంలో నిలిచిన ఈ పుస్తకం 34 దేశాల్లో ఎన్నో భాషల్లోకి అనువాదం అయింది. ఈ సైకాలాజికల్ థ్రిల్లర్ సంక్షిప్త పరిచయం...
30 సంవత్సరాల రేచల్ వాట్సన్ కొన్ని కారణాల వల్ల భర్త టామ్‌తో విడాకులు తీసుకుంటుంది. ఆ బాధలో డిప్రెషన్‌లోకి వెళుతుంది. తాగుడుకు బానిసగా మారుతుంది. ఉద్యోగం పోతుంది. ఇప్పుడు ఆమె పని లోకల్ ట్రైన్‌లో రోజూ పోవడం, రావడం. తాను ఇంకా ఉద్యోగం చేస్తున్నానని భ్రమ కలిపించడం కావచ్చు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కావచ్చు, ఖాళీగా ఇంట్లో కూర్చోలేకపోవడం కావచ్చు...కారణం ఏదైతేనేం ఆమె రోజూ రైలుప్రయాణం చేస్తూనే ఉంది. ఒకరోజుకు ఇంకోరోజుకు మధ్య కొత్త వ్యక్తులు, కొత్త మాటలు, కొత్త జీవితాలు. రేచల్ ప్రయాణించే రైలు మాజీ భర్త టామ్ ఇంటి మీదుగా వెళుతుంది. ఆ ఇంటికి రెండు, మూడు ఇండ్ల పక్కన ఒక జంటను చూసి ‘అబ్బ! ఎంత ముచ్చటైన జంట’ అనుకుంటుంది. వాళ్ల పేరేమిటో తెలియదు. తానే ఇద్దరికి కల్పిత పేర్లు పెడుతుంది. అమ్మాయి పేరు: జెస్ (అసలు పేరు: మేఘన్) అబ్బాయి పేరు: జాసన్ (అసలు పేరు: స్కాట్)
ఒకరోజు మందు మత్తులో ఉన్న రేచల్, ఒక వ్యక్తితో మేఘన్ సన్నిహితంగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అతడు స్కాట్ కాదు. ఎవరో? కట్ చేస్తే...
మేఘన్ అదృశ్యమైపోతుంది. ఎవరు మాయం చేశారు? అసలు బతికి ఉందా? రేచల్ అనుకున్నట్లు వారిది బంగారుజంట కాదు. జెస్ అసలు పేరు మేఘన్. మేఘన్‌కు చాలామంది మగాళ్లతో ఎఫైర్ ఉంటుంది. ఇక స్కాట్ విషయానికి వస్తే ఎప్పుడూ ఏదో ఒక అభద్రతలో ఉంటాడు. మేఘన్‌పై పెత్తనం చేయాలని చూస్తుంటాడు. రేచల్ మాజీ భర్త టామ్, అతని రెండో భార్య అనా ఇంట్లో మేఘన్ బేబిసిట్టర్.
మేఘన్ అదృశ్యం గురించి మాట్లాడడానికి స్కాట్‌ను కలుస్తుంది. మేఘన్ ఫ్రెండ్‌గా తనను పరిచయం చేసుకుంటుంది. మేఘన్ ఒకవ్యక్తితో సన్నిహితంగా ఉన్న దృశ్యాన్ని తాను చూసినట్లు చెబుతుంది. ఎవరా వ్యక్తి? అనే శోధనలో ఆ వ్యక్తి సైకియాట్రిస్ట్ డా.కమల్ అని తెలుస్తుంది. పోలీసులు డా.కమల్‌ను పిలిచి విచారిస్తారు. తనకు మేఘన్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఆమె తన పేషెంట్ మాత్రమే అని చెబుతాడు డాక్టర్. కానీ రేచల్, స్కాట్ ఆయన మాటలు నమ్మరు. ఒకరోజు టామ్ జిమ్‌బ్యాగ్‌లో సీక్రెట్ ఫోన్ చూసి ఆశ్చర్యపోతుంది అతడి భార్య అనా. ఆ ప్రీ–పెయిడ్ ఫోన్ మేఘన్ కోసమని తెలిసి ఆమె ఆశ్చర్యపోతుంది.
అసలు కథ ఏమిటంటే, భార్యకు తెలియకుండా టామ్ మేఘన్‌తో సంబంధం పెట్టుకుంటాడు. ఆమె గర్భం దాల్చుతుంది. ‘అబార్షన్ చేసుకో...’ అంటాడు టామ్. అందుకు ఆమె నిరాకరిస్తుంది. గట్టిగా అరుస్తుంది. తమ మధ్య ఉన్న సంబంధాన్ని లోకానికి తెలియజేస్తానని హెచ్చరిస్తుంది. నిజం బయటకు రాకుండా ఉండడానికి మేఘన్‌ను టామ్ హత్య చేస్తాడు. టామ్ దుర్మార్గాన్ని అంతం చేయడానికి ఒకప్పటి ప్రత్యర్థులు రేచల్, అనా ఒక్కటవుతారు. టామ్‌ను హత్య చేస్తారు. ఆత్మరక్షణ కోసమే తాము టామ్‌ను చంపామని చెబుతారు. మద్యం మానేసి కొత్త జీవితంలోకి ప్రవేశిస్తుంది రేచల్. ముగ్గురు మహిళలు...రేచల్, అనా, మేఘన్ ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నవల ఉంటుంది.
మై ఫెవరెట్ బుక్: ది గర్ల్ ఆన్ ది ట్రైన్
రచన: పాలో హాకిన్స్
Comments
Please login to add a commentAdd a comment