
రెండో ప్రపంచ యుద్ధానంతరం కొన్నేళ్లకి జర్మనీ రెండుగా విడిపొయింది. తూర్పు జర్మనీ, రష్యా తదితరదేశాల కమ్యూనిస్ట్ ధోరణులతో ప్రభావితమవుతూండగా, పశ్చిమ జర్మనీ అమెరికావంటి దేశాల అండతో ఆర్థికంగా ఎదగటం మొదలుపెట్టింది. తమ ప్రభుత్వపు నియంతృత్వ ధోరణుల వల్ల పశ్చిమ జర్మనీ దిశగా జరుగుతున్న మేధోవలసలని గమనించిన తూర్పు జర్మనీ ఇరుదేశాల మధ్య బెర్లిన్ గోడని 1961లో నిర్మించింది. ముప్పై ఏళ్ల తర్వాత వచ్చిన రాజకీయ పరిణామాల వల్ల ఆ గోడను కూల్చేసి తూర్పు, పశ్చిమ జర్మనీలు కలిసిపోయాయి: ద ఫాల్ ఆఫ్ ద వాల్.
‘ద మాన్ హూ సా ఎవ్రీథింగ్’ బెర్లిన్ గోడ కూలగొట్టడానికి సంవత్సరం ముందు మొదలవుతుంది. లండన్‌లో ఉండే కథకుడూ, కథానాయకుడైన సాల్ ఆడ్లర్ చరిత్రకారుడు. తూర్పు జర్మనీలో అతను చేయబోయే పరిశోధనకు ప్రతిగా, వారు సాధించిన ప్రగతి గురించి సానుకూల వ్యాసం రాయాలన్న ఒప్పందం మీద సాల్ తూర్పు జర్మనీ వెళ్లే ప్రయత్నంలో ఉంటాడు. అతని వీలుకోసం వాల్టర్ ముల్లర్ అనే అనువాదకుడిని ఏర్పాటుచేస్తుంది అక్కడి ప్రభుత్వం. ఫొటోగ్రఫీలో శిక్షణ పొందుతూ తనకంటూ ఒక మంచి భవిష్యత్తు çసృష్టించుకోవాలన్న ఆశయంతో ఉన్న జెనిఫర్, సాల్‌కి స్నేహితురాలు. మగవారిలో అరుదుగా కనిపించే విలక్షణమైన అందం, ఆకట్టుకునే విగ్రహం ఉన్న సాల్ ఆమె ఫోటోగ్రఫీకి వస్తువు కూడా! లండన్‌లోని అబీరోడ్డు దాటబోతుండగా సాల్‌కి ఒక చిన్న ఆక్సిడెంట్ అవుతుంది.
తరవాత జెనిఫెర్ అతనినుంచి విడిపోవటం, సాల్ జెర్మనీ ప్రయాణం, వాల్టర్ ముల్లర్‌తో అతని ప్రేమవ్యవహారం, ఆ దేశంనుంచి పారిపోవాలనుకుంటున్న వాల్టర్ చెల్లెలు లూనా ఒక ఆయుధంగా సాల్‌ని వాడుకోవాలనుకోవటం, అనాలోచితంగా వాల్టర్, లూనాలను ఇబ్బందుల్లోకి నెట్టేసి సాల్ లండన్ తిరిగి రావటం జరుగుతుంది. తిరిగి 2016లో, అదే అబీరోడ్దుపైన, అదే ఉల్ఫ్‌గాంగ్ అన్న వ్యక్తి కార్ నడుపుతూ మళ్లీ సాల్‌ని ఢీకొంటాడు. సాల్‌కి ఈసారి బలమైన గాయాలవుతాయి. ఇక్కడినుంచీ సాల్ జీవితం హాస్పిటల్‌లో, మార్ఫిన్ మగతలో అంతరంగ మథనాలతో, జ్జాపకాల గజిబిజిలో గిజిగాడిగూడే అవుతుంది. అస్పష్టమైన నవల ముగింపులో మూడోసారి అబీరోడ్డు చేరుకున్న సాల్, రోడ్డుని క్షేమంగా దాటినట్టే కనిపిస్తుంది.
బ్రిటిష్ రచయిత్రి డెబ్రా లెవీ 2019లో రాసిన ఈ నవల విశ్లేషకుల ప్రశంస పొందింది. కథకుడి వ్యక్తిగత చరిత్ర జర్మనీ దేశచరిత్రతో కలగలిసిపోయి– తన అంతరంగపు లోతులని నిజాయితీగా చూసుకుని, ప్రశ్నించుకుంటూ కదులుతుంది. మార్ఫిన్ మగతల్లో సాల్ చెప్పే కథ లీనియర్, నాన్ లీనియర్ గతుల్లో విచిత్రంగా సాగటంవల్ల కథకుడిని పూర్తిగా నమ్మలేని స్థితి. బెర్లిన్ వాల్ ఉన్న సమయంలోనే జర్మనీ వెళ్లి బీటిల్స్ సంగీతంపై నిషేధం, వ్యక్తిగత స్వేచ్ఛ లేకపోవటం, ప్రజలు దేశాన్ని వదిలి పారిపోవాలనుకోవటం, మనుషులపై ప్రభుత్వ నిఘాలు గమనించిన సాల్, కొద్దిరోజుల్లో ఆ గోడ కూలిపోతుందని చెప్పటం ఊహించని భవిష్యద్దర్శనం. రెండోసారి ప్రమాదం తరవాత సాల్ తన పురాజ్ఞాపకాలలో చిక్కుకుపోయి, వర్తమానానికి రావటానికి ఇబ్బందిపడుతూ ఉంటాడు. తను ఇన్నేళ్లూ పోషిస్తూ వచ్చిన ఆత్మవంచనల పొరలని చీల్చుకుంటూ బయటకొస్తున్న తనలోని చీకటి కోణాలని ఒప్పుకోటానికి కష్టపడతాడు.
‘‘సాల్, నీలో ప్రేమించే లక్షణం ఉందా? నిన్నెవరైనా ప్రేమించారా?’’ లాంటి ప్రాథమిక ప్రశ్నలు అతన్ని నిలదీస్తూ ఉంటాయి. తనను ప్రేమించినవారి పట్ల తను స్వార్థంతో, క్రూరంగా ప్రవర్తించానన్న సత్యాన్ని సాల్ గుర్తించవలసి వస్తుంది. జెనిఫర్ నిర్వహించిన ఒకానొక ఫొటో షోలో ‘ముక్కలైన మనిషి’ పేరున్న ఫొటోలో సాల్ అవయవాలన్నీ ముక్కలుముక్కలుగా, చెల్లాచెదురుగా, శూన్యంలోకి విసిరేసినట్టుగా ఉన్నట్టుగా – సాల్ కూడా ముక్కలైపోయిన మనిషేనా? ‘ప్రతి ఫొటో వెనక కనబడని మనిషి రూపం మరొకటుంటుంది’ అని సాల్ అన్నట్టు, మనుషులు తమలోని ఆ మరోమనిషితో నిజాయితీగా ఉండటం అవసరమంటుందీ నవల. అది సాధించగలిగితే, చివర్లో సాల్ అబీరోడ్డుని ప్రతీకాత్మకంగా, విజయవంతంగా దాటడం అనేది ఊహాత్మక వాస్తవం అయ్యేబదులు, వాస్తవమే అవుతుంది. బద్దలు కొట్టాల్సిన గోడలు మనిషి అంతరంగాల్లో కూడా ఉంటాయి! - పద్మప్రియ