సంక్షుభితమైన గతాన్నీ, అది నేర్పిన పాఠాల్నీ మర్చిపోవటం సబబేనా? కేవలం నలభై ఏళ్ల క్రితం జరిగిన ఇరాన్ సంఘర్షణా భరిత చరిత్రను అప్పుడే మర్చిపోయి, ఏమీ జరగనట్టు జీవిస్తున్న తరానికి ఆ చరిత్రను గుర్తుచేయటం అవసరమనుకుని రాసిన నవల ఇది అంటారు ‘ది ఎన్‌లైటెన్‌మెంట్ ఆఫ్ ద గ్రీన్‌గేజ్ ట్రీ’ రచయిత్రి షొకుఫే అజా. మనిషి తనలోపలికి ప్రయాణిస్తేనే సత్యం బోధపడుతుందని చెప్పే ఆమె తొలి నవలే బుకర్ ఇంటర్నేషనల్ అవార్డ్ షార్ట్‌లిస్ట్‌లో చోటుచేసుకోవటం విశేషం.
టెహరాన్‌లోని సంపన్న కుటుంబానికి చెందిన హూషాంగ్, రోజాని ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. వారి పిల్లలు –సోరాబ్, బీటా, బహార్. 1979లో ఇరాన్‌లో పాహ్లావీ సామ్రాజ్యపు ఆఖరి రాజుని, రాచరికపు వ్యవస్థని ఇస్లామిక్ రివల్యూషన్ కూల్చేసి ఆయతుల్లా ఖొమేనీ మతరాజ్య వ్యవస్థని ఏర్పాటు చేయడానికి సరీగ్గా రెండు రోజుల ముందు జరిగిన అల్లర్లలో తిరుగుబాటుదారులు వచ్చి హూషాంగ్ ఇంటిని తగలబెట్టేస్తారు. పుస్తకాలూ, సంగీత పరికరాలతో పాటు పదమూడేళ్ల కూతురు బహార్ కూడా ఆ మంటలకు ఆహుతైపోతుంది. ఆత్మ రూపంలో కుటుంబంతో కలిసి ఉండే బహార్ ఈ నవలలోని కథకురాలు. దేశాన్ని అలుముకున్న మతతత్వవాదం రుచించని హుషాంగ్, చుట్టూ ఉన్న అరాచకత్వానికి దూరంగా కుటుంబంతో సహా టెహరాన్ వదిలి వెళ్లిపోతాడు.
తమని వ్యతిరేకించేవారు ద్రోహులని నమ్మే మతతత్వవాదులు కొడుకు సోరాబ్‌ని రాజకీయ ఖైదీని చేస్తారు. అణచివేతలూ, స్వేచ్ఛారహిత పరిస్థితులతో విరక్తి చెంది గ్రీన్‌గేజ్ అనే పళ్లచెట్టెక్కి కూర్చుని మూడు పగళ్లూ రాత్రులూ గడిపిన రోజా మనుషులు తమ వర్తమానపు క్షణాలని నిర్లక్ష్యంగా నాశనం చేసుకుంటూ ముందుకెళుతున్నారనుకుంటుంది. సరిగ్గా ఆ క్షణంలోనే సోరాబ్‌ని కాల్చి చంపేశారు అని మొదలవుతుంది నవల. కూతురు బీటా మత్స్యకన్యగా మారటం లాంటి వింత మలుపులు, ముగిసిన జీవితాలతో కథ నడిచి, ఆ కుటుంబంలోని అయిదుగురూ విచిత్రంగా గ్రీన్‌గేజ్ పళ్లచెట్టులోకి లీనమైపోవటంతో నవల ముగుస్తుంది.
ఆత్మలూ బ్రతికున్నవారూ కలిసిమెలిసి ఉండటం, జీనీ భూతాలూ, మత్స్యకన్యలూ, మార్మిక వనాలూ – పర్షియన్ సాహిత్యంలో కనిపించే మాజిక్ రియలిజాల ప్రపంచం ఒకవైపు; ఇస్లామిక్ రివల్యూషన్, నియంతృత్వ ధోరణులూ, మారణహోమాలూ, విచ్ఛిన్నమైన జీవితాల బరువైన కథనమూ ఇంకో వైపు సమతుల్యం చేస్తూ కవితాత్మక శబ్దాన్ని జారవిడవకుండా రాసిన నవలలో ఇరానియన్ సాహిత్యమూ సంస్కృతితో బాటు, అరబ్బులకంటే ముందునాళ్ల జోరాష్ట్రియన్ సంస్కృతి కలగలసిపోయి ఉంటుంది.
రచయిత్రి సామాజిక పరిస్థితులను చిత్రీకరించిన తీరూ, భాషామాధుర్యం, చిత్రమైన పరిస్థితులూ, పాత్రల మధ్య పరస్పర ప్రేమానురాగాల నేపథ్యంలో వాళ్లు చవిచూసిన విషాదాలూ– ఇవన్నీ కథకున్న బలాలు. మతానికి సంబంధించని సాహిత్యమంతా రాజ్యానికి వ్యతిరేకమనీ నమ్మే మతతత్వవాదులు హుషాంగ్ వాళ్లింట్లో పుస్తకాలన్నింటినీ తగలబెట్టినప్పుడు చుట్టూ ఉన్న జనాల మౌనాన్ని చూసి ‘‘మనుషులకి ప్రేమా, సత్యమూ, చరిత్రా, జ్ఞానమూ ఇవేమీ అవసరం లేదా? భద్రతనిచ్చే కాస్తంత చోటుంటే చాలా?’’అనే బహార్ ప్రశ్నలో విజ్ఞానం లేని జాతి ఎలా ఎదుగుతుంది అన్న వేదన ధ్వనిస్తుంది.
ఇరానియన్ స్త్రీలు అనుభవించిన అణచివేత, స్వేచ్ఛకోసం వారు పడిన తపనని ప్రతిబింబించే బీటా మత్స్యకన్యగా నిస్సహాయంగా ఉన్నప్పుడు, ఆ మత్స్యకన్యను సైతం బలాత్కరించడానికి ప్రయత్నించి చంపేయడం సమాజపు దౌర్జన్యం. సంఘర్షణల నుంచి తప్పుకున్న పలాయనవాదినేమోనన్న మీమాంసతో హుషాంగ్ పడే బాధ సగటు మనిషి బాధ. నవల చివర్లో ‘‘మనకెవరికీ పిల్లలు లేకపోవడం అదృష్టం. ఎందుకంటే, ఈ ప్రపంచంలో పిల్లలకి రక్షణ లేదు,’’ అన్న సోరాబ్ మాటలు భవితవ్యం ప్రశ్నార్థకం అవుతోందనడానికి సూచన.
రచయిత్రి తన దేశాన్నుంచి రాజకీయ శరణార్థిగా ఆస్ట్రేలియాకి వెళ్లవలసి రావడం, అనువాదకుడు తన పేరు చెప్పడానికి నిరాకరించడం కూడా అలాంటి సూచనలే. కానీ– ఇలాంటి నవలలు ఎలాగోలా ప్రజల మధ్యకి రావడం మాత్రం వాంఛనీయం!
నవల: ది ఎన్‌లైటెన్‌మెంట్ ఆఫ్ ద గ్రీన్‌గేజ్ ట్రీ
రచయిత్రి: షొకుఫే అజా
పార్సీ నుంచి ఇంగ్లిష్: ‘అనామకుడు’
ప్రచురణ: 2017
పద్మప్రియ
Comments
Please login to add a commentAdd a comment