పుస్తకం : సాహితీ సమరాంగణ సార్వభౌమ (వ్యాససంపుటి)
సంపాదకుడు : మోదుగుల రవికృష్ణ
పేజీలు: 240; వెల: 180
ప్రతులకు: క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్. ఫోన్: 9848065658
విషయం : తెలుగు గ్రామీణ జన జీవన అంశాలను కళ్లకు కట్టించిన ‘ఆముక్తమాల్యద’ను రచించిన కవిరేడు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన్ని దక్షిణ భారతదేశపు సాంస్కృతిక చిహ్నంగా పేర్కొనవచ్చు. ఐదు వందల ఏళ్ల నాడు, సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాహిత్య విశ్లేషణకు ఆధారభూతములైన గ్రంథరాజములు వెలువడటానికి విజయ నగర సామ్రాజ్యాధిపతిగా ఆయన చేసిన సాహిత్య సేవ ఎంతగానో దోహదపడింది. 1914 నుండి 2013 వరకు నూరేళ్ల వ్యవధిలో రాయల వారి గురించి వచ్చిన వ్యాసాలలో ముఖ్యమైనవాటిని ప్రచురించాలనే ఆశయంతో ‘సాహితీ సమరాంగణ సార్వభౌమ’ శీర్షికతో ‘మిత్రమండలి ప్రచురణలు’ ద్వారా ఈ వ్యాస సంపుటి వెలుగు చూసింది.
నేలటూరి వెంకటరమణయ్య, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, దివాకర్ల వెంకటావధాని, దేవులపల్లి కృష్ణశాస్త్రిలాంటి వారు రాసిన ఈ 27 వ్యాసాలు రాయల కాలపు రాజవీధుల్లో తిరుగుతున్న అనుభూతిని ఇస్తాయి. ఇందు ప్రచురించిన 102 ఛాయాచిత్రాలు ఆ కాలపు శిల్ప సౌందర్యాన్ని, కోటల ప్రాశస్త్యాన్ని తెలియజేస్తాయి. గత చరిత్రను నేటి పాఠకుల కళ్లకు కట్టించే పుస్తకమిది.
- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
‘ఆదుర్తి’ పై అందమైన సంకలనం
పుస్తకం : దర్శక చక్రవర్తి ఆదుర్తి సుబ్బారావు
సంకలనం : హెచ్.రమేష్‌బాబు
విషయం : ‘మూగ మనసులు’ గుర్తుందా? అసలు మన తెలుగు ప్రేక్షకులు మర్చిపోయే సినిమానా అది! అదొక్కటే కాదు... తోడికోడళ్లు, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, నమ్మిన బంటు... ఇలాంటి సినిమాలన్నీ... చూసిన ప్రతిసారీ బోలెడన్ని జ్ఞాపకాలు పంచే గనులు. ఈ కళాఖండాల సృష్టికర్త ఆదుర్తి సుబ్బారావు. సూపర్‌స్టార్ కృష్ణకు సినీ జన్మనిచ్చిన వ్యక్తి. సాంఘిక సినిమాల రూపురేఖలు మార్చిన దర్శకుడు. తెలుగు సినిమా షూటింగ్‌ని ప్రకృతికి దగ్గర చేసినవాడు.
అంటే అవుడ్డోర్ షూటింగ్స్‌కి ఓ చక్కటి రహదారి వేసినవాడు. ఆదుర్తి కెరీర్‌లో ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయి. ఈ తరమే కాదు, రాబోయే తరాలు కూడా ఆయన గురించి తెలుసుకోవాలి. కానీ వికీపీడియాలో కూడా సరైన సమాచారం లేదు. ఆ లోటు తీరుస్తుందీ పుస్తకం. సంకలనం అయినా కూడా రమేష్‌బాబు చాలా శ్రమించారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల డబ్బు కన్నా కాలమే ఎక్కువ ఖర్చవుతుంది. ఎందరెందరి దగ్గరికో, ఎన్నెన్నో ఊళ్లు తిరిగి ఫొటోలు, సమాచారం సేకరించాలి. ఈ పుస్తకంలో చాలా మంచి డీటైల్స్, వర్కింగ్ స్టిల్స్ ఉన్నాయి. ఆదుర్తి అభిమానులనే కాకుండా సినీ ప్రియులనూ ఈ పుస్తకం అలరిస్తుంది.
- శ్రీబాబు
తుపాకి గుళ్ల లాంటి కథలు
తెల్లజాగాను వీలైనంతగా వాడుకున్న ఈ రెండు అనువాద కథా సంకలనాల ప్రాథమిక గుణం- వేగంగా చదివింపజేయడం. వివిధ భాషల్నుంచి అనువాదం చేసిన ‘పరాయి సిరా’లో 21 కథలున్నాయి. రుచిగల ‘లసగ్నా’తో ప్రియుడి మనసు గెలుచుకోవాలనుకుని, దాన్ని ఉప్పుమయం చేసిన ప్రియురాలి తొలి విఫల వంట ప్రయత్నం- ‘మగాడి హృదయానికి దారి’ (ఇటాలియన్; క్రిస్టినీ డిక్సన్). ‘ఎల్ జెఫే’ ఆవిష్కరించబోయే తపాలా బిళ్ల అంచు నీలంకు బదులుగా నలుపు రంగు రావడంతో- కచ్చితంగా తమకు ఉరిశిక్ష తప్పదనుకున్న ముగ్గురు అధికారులు చావోరేవో ఎలా తిరుగుబాటు తెచ్చారో ‘నియంత’(కొలంబియన్; ఎడ్వర్వ్ వెల్లెన్) కథ చక్కగా చెబుతుంది. ఇక, సంక్షిప్తం చేసిన 68 మినీ క్రైమ్ కథలన్నింటికీ వర్తించే సూత్రం: ‘పేల్చిన తుపాకి గుండు ఎలా తక్షణం గమ్యాన్ని తాకుతుందో అలా ఈ కథలన్నీ త్వరగా, అంటే విసుగు పుట్టించకుండా క్లయిమేక్స్‌కి చేరుకుంటాయి.’
- రాజు
పరాయి సిరా (అనువాద కథలు); పేజీలు: 142; వెల: 120
మినీ క్రైమ్ కథలు; పేజీలు: 142; వెల: 120
అనువాదం: మల్లాది వెంకట కృష్ణమూర్తి, ప్రతులకు: లిపి పబ్లికేషన్స్, గాంధీనగర్, హైదరాబాద్-80. ఫోన్: 9849022344
కొత్త పుస్తకాలు
నన్ను సాయిబును చేసింది వాళ్లే (వ్యాసాలు)
రచన: షేక్ కరీముల్లా
పేజీలు: 100; వెల: 50
ప్రతులకు: రచయిత, 21-55, పెద్దమసీదు బజారు, వినుకొండ-522647, గుంటూరు. ఫోన్: 9441502990
నేలతీపి, అజ్ఞాతం (కథారూపకాలు)
రచన: డా.వి.ఆర్.రాసాని
పేజీలు: 106; వెల: 60
ప్రతులకు: అన్ని విశాలాంధ్ర బ్రాంచీలు.
సమీక్షణం: శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని కళ్లకు కట్టించే వ్యాసాలు
Published Sun, Jan 19 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement