పుస్తక సమీక్షణం | book review | Sakshi
Sakshi News home page

పుస్తక సమీక్షణం

Published Sun, Sep 15 2013 2:26 AM | Last Updated on Sat, Aug 11 2018 8:27 PM

book review

అయిదు పదుల సినీ సంగీత ప్రయాణం
 పుస్తకం    :    స్వర్ణయుగ సంగీత దర్శకులు (1932-82)
 జానర్    :    నాన్ ఫిక్షన్
 రచన    :    పులగం చిన్నారాయణ
 పేజీలు: 760 వెల: రూ.500
 ప్రతులకు: రచయిత, ప్లాట్ నం.89, ఎఫ్-2, రాధా సదన్,
 బాలాజీ స్వర్ణపురి కాలనీ, మోతీనగర్ దగ్గర,
 హైదరాబాద్-18
 
 
 సినీ జర్నలిస్టుగా పనిచేస్తూ, ఎన్నో మజిలీల మధ్య పద్నాలుగేళ్ల కాలంలో చిన్నారాయణ చేసిన నాలుగో పుస్తక రచన ఇది. అనుభవజ్ఞులను అడగడానికీ, తప్పొప్పులు తెలుసుకోవడానికీ, తానే అడిగి మరీ దిద్దించుకోవడానికీ, మొహమాట పెట్టయినా సరే ఆ విషయంలో తనకు కావాల్సిన పని చేయించుకోవడానికీ చిన్నారాయణ ఎప్పుడూ చిన్నతనంగా భావించలేదు. ‘స్వర్ణయుగ సంగీత దర్శకులు’ అందుకు తాజా సాక్ష్యం. టాకీల తొలినాళ్ల నాటి హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి, గాలి పెంచల నరసింహారావుల నుంచి సుసర్ల దక్షిణామూర్తి, ఘంటసాల, పెండ్యాల మీదుగా నిన్నటి చక్రవర్తి, ఇళయరాజాల దాకా ప్రసిద్ధ సంగీత దర్శకుల జీవితాన్ని ఈ పుస్తకంలో ఇమిడ్చారు. వాళ్ల ప్రయాణంలోని మేలి మలుపులను కళ్లముందు నిలిపేందుకు ప్రయత్నించారు. వారి చిరస్మరణీయ గీతాల చిట్టా ఇచ్చారు.
 
 అపూర్వమైన ఛాయాచిత్రాలను పొందుపరిచారు. వెరసి, తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ విడుదలై 1932 (ఫిబ్రవరి 6) నుంచి 1982 వరకు యాభై ఏళ్ల తెలుగు సినీ సంగీతానికి ఓ రిఫరెన్స్ గ్రంథం చేశారు. మొదటి ముద్రణలో ఉన్న 30 మంది సంగీత దర్శకులకు సరికొత్తగా వివరాలు కలిపారు. లేని మరో 30 మంది గురించి కొత్తగా అందించారు. ఆర్.సుదర్శన్ - గోవర్ధనం, బి.శంకర్ లాంటి దర్శకుల గురించి వివరంగా రాశారు. పేర్లే తప్ప సినీ సంగీత ప్రియుల్లో కూడా చాలామందికి వివరాలు తెలియని ప్రభల సత్యనారాయణ, అద్దేపల్లి రామారావు, వింజమూరి అనసూయ - సీత, టి.జి.లింగప్ప, ఎ.ఎ.రాజ్ తదితరుల గురించి ఈ మలి ముద్రణలో అచ్చేశారు.
 - డా॥రెంటాల జయదేవ
 
 మరోసారి చైనా...
 పుస్తకం    :    చైనా- వంద ప్రశ్నలు జవాబులు
 జానర్    :    నాన్ ఫిక్షన్
 అనువాదం    :    జి.సత్యనారాయణరెడ్డి
 
  పేజీలు: 190 వెల: 75
 ప్రతులకు: పోరునేల, వినమ్రత క్లాసిక్స్, ఫ్లాట్ 201,
 రోడ్ 1, అల్కాపురి,
 హైదరాబాద్-35. ఫోన్:
 9912072601
 
 విషయం    :    ‘అక్కడెక్కడో చైనాలో వర్షం కురిస్తే, ఇక్కడ మన కమ్యూనిస్టులు గొడుగులెత్తుతారు’; ‘చైనా ఛైర్మన్‌కు జలుబు చేస్తే మన కమ్యూనిస్టులకు తుమ్ములొస్తాయి’; ఇలాంటి సరదా అనధికార సామెతలు ఎన్నో విని నవ్వుకున్నవాళ్లం. ఒకానొక కాలంలో రష్యా, చైనాలతో మనకు బీరకాయ పీచు సంబంధం కాదు; రక్తబంధం లాంటిదేదో ఉండేది. అక్కడి మనుషులు, భౌగోళిక స్థితిగతులు, రాజకీయ వ్యూహాలు, సాహిత్యం...ఇలా సమస్త విషయాలు మన ఆసక్తికర జాబితాలో పెద్ద పీట వేసుకొని కూర్చునేవి. రష్యా, చైనాల్లో సోషలిజం బిక్కముఖం వేశాక, ఆ తరువాత గల్లంతయ్యాక, ఇక ఆ ఆసక్తి ఆచూకి లేకుండా పోయింది. అయినా సరే, రష్యా మీదో చైనా మీదో ఎవరైనా ఏదైనా రాస్తే సరికొత్త ఆసక్తేదో మొలకలెత్తుతుంది. ‘చైనా  వంద ప్రశ్నలు జవాబులు’ పుస్తకం చూస్తే కూడా.
 
 ‘ఈరోజు చైనా ప్రపంచ వ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. గత 30 సంవత్సరాల కాలంలో, అది సాధించిన అపూర్వమైన ఆర్థికాభివృద్ధి ఆ చర్చలో కేంద్రబిందువుగా ఉంటున్నది’ అంటున్న రచయిత చైనాలోని ప్రస్తుత స్థితి గతులను పుస్తకంలో వివరించారు. దీనికి ఆయన ‘చైనా అధికారిక సమాచారం’ మీద మాత్రమే ఆధారపడ్డారు. నిజానికి పేచీ ఇక్కడే వస్తుంది. గణాంకాలకు ఎలాగైతే వక్రీకరణ తెలివితేటలు ఉంటాయో ప్రభుత్వ అధికారిక సమాచారానికీ అంతే ఉంటుంది. ‘ప్రామాణికత’ ‘వాస్తవాలు’ సంగతి పక్కన పెడితే ప్రస్తుత చైనా తన గురించి తాను (వ్యవసాయం నుంచి ద్రవ్య వ్యవస్థలో సంస్కరణల వరకు) ఏమి చెప్పుకుంటుందో ఈ పుస్తకంలో చదువుకోవచ్చు, చర్చ చేయవచ్చు.
 - యాకుబ్ పాషా
 
 కొత్త పుస్తకాలు
 ఏకలవ్య ప్రబంధం
 రచన: డా.ఆమళ్లదిన్నె వేంకటరమణ ప్రసాద్
 పేజీలు: 128; వెల: 40
 ప్రతులకు: రచయిత, 3/696, రామాలయం దగ్గర, సోమనాథ నగర్, అనంతపురం-4.
 ఫోన్: 9440596127
 
 శకుంతల (పద్యకావ్యం)
 రచన: డా. అయాచితం నటేశ్వరశర్మ
 పేజీలు: 152; వెల: 200
 ప్రతులకు: రచయిత, 7-136/9, నిజాంసాగర్ రోడ్, కామారెడ్డి-503111.
 ఫోన్: 9440468557
 
 స్కాంద పురాణాంతర్గత
 శ్రీ శివలీలా విలాసము
 రచన: డా. మంగళగిరి వేణుగోపాలాచార్యులు
 పేజీలు: 326; వెల: 500
 ప్రతులకు: రచయిత, ఆర్/ఒ బాలినేపల్లి, మొల్కచర్ల పోస్టు, నల్లగొండ. ఫోన్: 9963955454
 
 ఆమె అతడిని మార్చుకుంది (నవల)
 రచన: అంగులూరి అంజనీదేవి
 పేజీలు: 286; వెల: 100
 ప్రతులకు: మధుప్రియ పబ్లికేషన్స్, మాచవరం, విజయవాడ-4. ఫోన్: 0866-2431969
 
 నవ్వుతున్న నేలతల్లి (కథలు)
 రచన: కటుకోజ్వల మనోహరాచారి
 పేజీలు: 114; వెల: 80
 ప్రతులకు: వసుధ, 5-3-190, సాయిరాం నగర్, కోరుట్ల, కరీంనగర్-505326.
 ఫోన్: 9441023599
 
 ఆలోచింపజేసే కథలు
 రచన: మొండెపు ప్రసాద్
 పేజీలు: 112; వెల: 60
 ప్రతులకు: విక్టరీ పబ్లిషర్స్, 30-17-18, వారణాశి వారి వీధి, సీతారాంపురం, విజయవాడ-2. ఫోన్: 0866-2444156

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement