ఒక అరుదైన ఆత్మకథ
పుస్తక సమీక్ష
మనోవైజ్ఞానిక శాస్త్ర రచనలు తెలుగులో తగినన్ని రాలేదు. మానసిక వ్యాధుల గురించో, వాటితో సతమతమయ్యే వాళ్లను గురించో, ఆ వ్యాధుల నివారణ మార్గాల గురించో తెలుగు పత్రికలు, ప్రచురణకర్తలు, స్వచ్ఛంద సంస్థలు కొన్ని రచనలను అందించక పోలేదు. ఇప్పుడు ఇవి చాలవు.
కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. చదువుల పోటీ పెరిగింది. నిరుద్యోగమూ విజృంభించింది. హింస పెరిగింది. సమాజంలో అసహనం పెచ్చరిల్లింది. ఇమడలేనితనం పెరిగింది. పరాయితనం వెంటాడుతోంది. జన్యులోపాలు లేకపోలేదు. వెంపర్లాటలో మానసికమైన ఒత్తిళ్లు పెరిగాయి. రుగ్మతలూ పెరిగాయి. ఈ అన్నిటిని గురించి, అవి తెస్తున్న విపరిణామాల గురించి విశ్లేషణలు, మానసిక వ్యాధుల విముక్తి మార్గాలనూ తెలిపే రచనలు విరివిగా రావలసిన అవసరం ఎంతో ఉంది. మానసిక వ్యాధుల్లో మనిషిని పీడించే స్కీజోఫ్రెనియా వ్యాధి ఒకటి. ఈ వ్యాధి తమకుందని కూడా చాలామంది గుర్తించలేని మానసిక రుగ్మత ఇది. స్కీజోఫ్రెనియా నియంత్రణకు మానసిక వైద్యనిపుణుల అవసరం ఎంత ఉందో, ఆ వ్యాధి విముక్తి కోసం పోరాడి గెలిచిన వ్యక్తుల కథనాలూ మనకు అంతే అవసరం. ఈ అవసరాన్ని తీర్చడంలో వెలువడిన సరికొత్త రచన ‘ఓడి గెలిచిన మనిషి: ఒక స్కీజోఫ్రెనిక్ ఆత్మకథ’.
ఈ ఆత్మకథ మహామహుల స్వీయ చరిత్రల కంటే భిన్నమైంది. ఒక సామాన్యుడి నిజ కథ ఇది. వ్యాధినపడ్డ తన జీవిత కథను తెల్పుతూ, మానసిక వ్యాధిగ్రస్తులకూ, వాళ్ల సంరక్షులకూ ఒక సందేశాత్మక మార్గాన్ని చూపాలన్న ఆర్తితో రాసిన కథ ఇది. చిత్తశుద్ధికి గీటురాయి లాంటి రచన ఇది. అందువల్లనే భిన్నమైంది అనడం!
మల్లారెడ్డి 17 సంవత్సరాల కాలంలో 5 సార్లు స్కీజోఫ్రెనియా వ్యాధి బారిన పడ్డాడు. నాలుగుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. మరొక సమయంలో కుటుంబ కలహాల కారణంగా జైలుపాలయ్యాడు. 17 సంవత్సరాల్లో తన సున్నిత మనస్తత్వం వల్ల ఆలోచనలు అదుపు తప్పిపోవడం, వింత వింత భావావేశాలకు గురికావడం, వాస్తవం నుండి దూరం కావడం, విపరీతమైన ప్రవర్తనకూ, మానసికమైన ఒత్తిడికీ, ఘర్షణకూ గురికావడం, తరచూ కుంగిపోవడం, భ్రాంతులకు లోనుకావడం, సమాజం తనను పూర్తిగా ఇముడ్చుకోలేదని బాధపడటం, భరించలేని మానసిక క్షోభ తనను వెంటాడటం- వీటినన్నిటినీ వివిధ సంఘటనలు, సన్నివేశాల ద్వారా తన ఆత్మకథలో వెల్లడించాడు. తన మానసిక ప్రపంచంలో చిన్నతనం నుంచీ, చదువుకొనే రోజులనుంచీ, తర్వాతి తర్వాతి దశల్లో జరిగిన పరిణామాలనూ, తన అలవాట్లనూ, స్వేచ్ఛగా, నిర్భయంగా దాపరికం లేకుండా మానసిక వైద్యుల ముందు ఎట్లా ముందుంచాడో అట్లాగే పాఠకుల ముందుంచాడు. తన వ్యాధి దశల్లో తన మామ, క్లిష్ట సమయాల్లో తనకు చేదోడువాదోడుగా నిల్చిన భార్య ఉమ తెల్పిన విశేషాలను పొందుపరిచాడు.
పాఠకులకు తను పడ్డ వేదనను తెల్పడమే కాదు, స్కీజోఫ్రెనిక్ వ్యాధిగ్రస్తులకు వ్యాధిని జయించాలనే ఇచ్ఛ ఉండాలనీ, చికిత్స దశల్లో సరైన మందులు సకాలంలో వాడటం మాత్రమే కాకుండా, సంకల్ప బలంతో వ్యాధిని జయించగలగాలనీ ఇందుకు లక్ష్యం, వ్యాపకం, ఆపేక్షలు తోడవ్వాలనీ తన అనుభవసారాన్ని అందించాడు.
మనదేశంలో కోటి మందికి పైగా మానసికమైన జబ్బుల బారిన పడ్డవాళ్లున్నారు. పట్టణ నగర ప్రాంతాల్లోని ఆర్థిక స్తోమత, ఇంగితజ్ఞానం ఉండే విద్యావంతులైన మానసిక వ్యాధిగ్రస్తులకు అవసరమైన మానసిక వైద్యనిపుణుల సహాయం అంతో ఇంతో అందుబాటులో ఉంటుంది. పల్లెపట్టుల్లో తమ మనసును ఏ దయ్యం పట్టుకుందో, ఎవరు చేతబడి చేశారో అనుకుంటూ మూఢనమ్మకాలతో మంత్రగాళ్లు, తంత్రగాళ్లు, సాధులు, సన్యాసుల బారినపడేవాళ్లు లక్షలకు లక్షలున్నారు. పల్లెపట్టుల్లో సరైన శారీరక రోగాలకే సరైన వైద్యం అందడం లేదు. మానసిక జబ్బుల నివారణకు దిక్కూ దివాణం లేదు.
ఇట్లాంటి తరుణంలో ‘వెలకట్టలేని ఈ రచన’ను, నవలలాగా సాగిన ఈ రచనను ఎవరైనా డాక్యుమెంటరీగా తీస్తే, దాన్ని తెలుగునేల నలుమూలలా చూపించగలిగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. వైద్యుడు లేనిచోట ఇలాంటి విలువైన పుస్తకాల అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి విలువైన పుస్తకాన్ని హైదరాబాదు బుక్ ట్రస్ట్ వెలువరించడం ఎంతైనా హర్షణీయం.
కేతు విశ్వనాథరెడ్డి 9866713647
ఓడి గెలిచిన మనిషి: ఒక స్కీజోఫ్రెనిక్ ఆత్మకథ; రచన: మల్లారెడ్డి; సంపాదకురాలు: శోభాదేవి;
పేజీలు: 148; వెల: 120; ప్రచురణ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్; ఫోన్: 23521849