kethu viswanatha reddy
-
Kethu Viswanatha Reddy: నాయనా అని సంభోదిస్తూ మాటాడేవారు!
నాకు ఇష్టమైన కథకులలొ కేతు విశ్వనాథరెడ్డి గారున్నారు. నేను ఇష్టపడిన తెలుగు కథల్లో ఆయన రెక్కలు కథ ఉంది. నా అదృష్టాల్లో ఒకటి చిన్నతనాన నే చదువుకున్న ఆ కథకు పెద్దయ్యాకా బొమ్మ వేయడం. ఆ కథకు నా బొమ్మ ఎంతబాగా కుదిరింది అంటే, అంతకన్నా బాగా ఇంకెవరు ఆ కథను బొమ్మల్లో చెప్పలేరన్నంతగా . కేతు గారికి నాకు వ్యక్తిగత పరిచయం తక్కువే, నన్ను నాయనా అని సంభోదిస్తూ ఆయన మాటాడేవారు. మహానుభావులకు, గొప్పవారికి, ప్రాంతీయాభిమానం లేదంటారు. నా పూర్వ జన్మ పుణ్యం కొద్ది నేను ఆ కేటగిరివాడిని కాకపోవడం వలన కేతు విశ్వనాథరెడ్డి పలకరించే ఆ ’"నాయనా" అనే పిలుపులో రాయలసీమ ఒక మానవ ఆకారం రూపు దాల్చి పలకరిస్తున్నట్టుగా పులకరించి పోతాను నేను. పెద్దలు ఇష్టులు మైనంపాటి భాస్కర్ గారు కూడా నన్ను అల్లానే పిలిచేవారు. నాకు ప్రాంతీయాభిమానం ఉంది. నాకు తెలిసిన కేతు విశ్వనాథరెడ్డి గారి ఇంకా పెద్ద గొప్పతనం ఏమిటంటే ఆయన విశాలాంద్ర వారు ప్రచురించిన కోకు సమగ్ర సాహిత్యానికి సంపాదకీయం వహించడం. తరాలు గడిచినా ఆ పుస్తకాల విలువ ఎన్నటికీ తరగనంత నాణ్యమైన పనిగా చేసి తెలుగు పాఠకుల చేతిలో పెట్టడం. కోకు గారి పుణ్యమో, లేదా నావంటి కోకు అభిమానుల పుణ్యమో తెలీదు కానీ కుటుంబరావు గారి రచనలు ఒక ఎత్తయితే దానికి మహాద్భుతమైన పరిమళాన్ని అందించారు కేతు గారు. రాను రాను ఇంకా మళ్ళీ మళ్ళి కొకు రచనా సంపుటాలు వస్తున్నాయి కానీ కొత్తగా వచ్చే వాటి గురించి మాట్లాడుకోవడం శుద్ద దండగ. ఈ కొత్తగా తెచ్చే పుస్తకాల ముద్రణలో సరైన ఎడిటింగ్ లేక లోపలి రచనలు ఎట్లాగూ నాశనం అయిపోతున్నాయి. ఆ పని సంపూర్ణం కాగానే పుస్తకాల అట్ట మీద కుటుంబరావు గారి ఫోటో బదులుగా, టెలిఫోన్ సత్యనారాయణ గారి బొమ్మ వేసి కోకు రచనలు అని నమ్మించే, అమ్మించే నాటికి చేరుకొవడానికి తెలుగు సాహిత్యం, దాని ముద్రణ ఎన్నో అడుగుల దూరంలో లేదు. వాటిని సరైన దారిలో పెట్టగలిగిన కేతులు మరియొకరు మనకు లేరు. కేతు గారిని రచనల పరంగా మాత్రమే ఎరిగి ఉన్నప్పట్టికీ ఆయనని ప్రత్యక్షంగా తెలిసి ఉండని కాలానికి ముందే హైద్రాబాదులో ఆర్టిస్ట్ మోహన్ గారు, పతంజలి గారిని ఎరిగి ఉన్నాను నేను. పతంజలి గారి "ఖాకీ వనం" వ్రాసిన కొత్తలో దానిని విశాలాంద్ర నవలల పోటీకి పంపితే ఆ నవలను వెనక్కి పంపించారు . ఆ నవలా పోటీ న్యాయనిర్ణేతల కమిటీ లో కేతు ఉండేవారని , ఆయన ఈ నవలను కాదన్నారని మోహన్ గారికి, పతంజలి గారికి ఆయన మీద కాస్త మంట ఉండేది. మోహన్ గారిలో ఒక ప్రత్యేక గుణం ఉండేది. వ్యక్తిగతంగా మనకంటూ తెలియని ఎవరి మీదయినా సరే మనలోకి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలివిగా ఇంజెక్ట్ చేసేవాడు. తనకు ఇష్టమైన వ్యక్తుల గురించి అతి గొప్పగా, అయిష్టుల గురించి అతి చెత్తగా స్వీకరించడాన్ని మన బుర్రలోకి చొప్పించేవాడు. ఎవరి సంగతో ఏమో కానీ, నేను మోహన్ గారికి అత్యంత అభిమానిని కాబట్టి ఆయన ఎస్సంటే ఎస్సని, నో అన్నది నో అనే అని నమ్మేవాడిని. ఇప్పుడు కేతు గారు లేరని కాదు కానీ. ఆయన కథలు ఎప్పటి నుండో చదివి ఉండటం వలన మోహన్ గారు చెప్పారు కదా,పతంజలి గారి నవలని తిప్పి కొట్టారు కదాని కేతు గారి మీద ప్రత్యేకమైన వారి అభిప్రాయాన్ని స్వీకరించి పుచ్చుకున్నది మాత్రం జరగలేదు, ఎందుకో! ఆర్టిస్ట్ చంద్ర గారికి కేతు గారు అంటే బాగా అభిమానం. కేతు గారికి కూడా చంద్ర గారు అంటే అదే. ఊరికే అటూ ఇటూ తిరిగి ప్రీలాన్సింగ్ బొమ్మలు వేసుకుంటూ ఉండే చంద్రగార్ని పట్టుకుని తను డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరుగా ఉన్న కాలంలో అదే విశ్వవిద్యాలయం లో ఆర్టిస్ట్ కమ్ డిజైనర్ గా హోదా ఇచ్చి ఆ ఇష్టం ప్రకటించుకున్నాడు. కేతు గారి ’కూలిన బురుజు" కథ అంటే చంద్ర గారికి ఇష్టం. దానిని సినిమాగా తీయాలనే కోరిక చంద్ర గారికి ఉండేది. విశ్వనాథరెడ్డి గారు తన ఉద్యోగబాధ్యతల నుండి రిటైర్ అయ్యాకా సి. సి. రెడ్డిగారి "ఈ భూమి" పత్రికకు చీఫ్ ఎడిటర్ గా తన సేవలందించారు. పంజాగుట్ట లో ఉండేది ఆ అఫీసు. నేను అప్పుడప్పుడు అటు వెళ్ళినపుడు శ్రీ కేతు గారిని కలిసేవాడిని. అక్కడే పొనుగోటి కృష్ణారెడ్డి గారిని కూడా చూసేవాడ్ని. ఆయనా ఈ భూమికి వర్క్ చేసేవారు. అప్పటి సాహితీ సభల్లో తరుచుగా కేతు గారు కనపడినా , ఊరికే భక్తి గా చూసి పలకరింపుగా నవ్వేవాడిని తప్పా అతి వేషాలు వేసి అతి చనువు నటించే పాడులూ పద్దతుల అవసరాలు నాకు ఎప్పుడూ ఉండేవి కావు . అలా అలా అలా చాలా రోజుల తరువాతా కేతు గారు ఇక ఇక్కడ లేరని, కడపకు వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయారని కబురు తెలిసింది. ఆర్టిస్ట్ చంద్ర గారికి 70 ఏళ్ళు వచ్చిన సందర్భానా నేను ’"ఒక చంద్రవంక" అనే పుస్తకం ఒకటి తీసుకు వచ్చా. ఆ సందర్భానా చాలా విరామం అనంతరం కేతు గారికి ఫోన్ చేసి చంద్ర గారిమీద ఒక వ్యాసం వ్రాసి ఇమ్మని ఆడిగా. అదే చివరి సారిగా ఆయనతో మాట్లాడ్డం. అది 2016. ఈ మధ్య కాలంలో అయితే చాగంటి తులసి గారి ముచ్చటైన రచన "ఊహల ఊట" కి కేతు గారు ముందు మాట రాస్తున్నారని ఆవిడ భలే సంతోషంగా చెప్పారు. నాకూనూ సంబరం అనిపించింది. "మంచి కథలు రాయాలనే పోటి మనస్తత్వాన్ని నా కంటే మంచి కథకుల నుంచి నేర్చుకున్నాను. మరో రకంగా కథా రంగాన్ని ఏలాలనుకునే అల్పుల మీద కోపంతో రచనకి దిగాను" అని చెప్పుకున్న విశ్వనాథరెడ్డి గారికి పొద్దస్తమానం సాహితీ చలామణిలో ఉండాలని అనుకున్న రచయితగా మా వంటి కథా ప్రేమికులకు ఎప్పుడూ అనిపించలేదు. ఆయన జంటిల్ మేన్, ఆయన మంచి రచయిత, ఆయన మా రాయలసీమ పెద్ద మనిషి, ఆయన చల్లగా నవ్వే పెద్ద మర్రిమాను. ఈ రోజుకీ రేపటికీ కూడా ఆయన కథల అదే మాను మాదిరిగా, ఆ ఆకుల గలగల మాదిరిగా వినపడుతూ, కనపడుతూనే ఉంటాయి. అవి చదివినప్పుడల్లా మన మనసుల మీద ఆయన చల్లగాలిలా వీస్తూనే ఉంటాడు. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి దినపత్రిక చదవండి: కేతు విశ్వనాథరెడ్డి కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం -
కేతు విశ్వనాథరెడ్డి కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, వైఎస్సార్/ ప్రకాశం: తెలుగు సాహిత్యంలో కురువృద్దులు.. రాయలసీమ కథకు చిరునామా కేతు విశ్వనాథరెడ్డి(84) గారు ఇకలేరు. సోమవారం వేకువ ఝామున గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ఒంగోలులోని ఓ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్ మీద చికిత్స అందించే యత్నం చేసినా ఫలితం దక్కలేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేతు విశ్వనాధ రెడ్డి మృతికి పలువురు వక్తలు, రచయితలు సంతాపం చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కేతు విశ్వనాథరెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. సామాజిక సంస్కరణలను అవశ్యకతను చెబుతూ విశ్వనాథరెడ్డి రాసిన కథలు పలువురికి స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి 2021లో వైయస్సార్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తుచేశారు. విశ్వనాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కేతు విశ్వనాథరెడ్డి (84).. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం రంగశాయిపురం స్వస్థలం. సాహితీ, విద్యావేత్తగా కేతు విశ్వనాథరెడ్డి పేరొందారు. రాయలసీమ మాండలికానికి సాహితీ గౌరవం తీసుకొచ్చిన ఘనత దక్కించుకున్నారు. కేతు విశ్వనాథరెడ్డి కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కడప జిల్లా గ్రామనామాలపై పరిశోధనకు ఆయన డాక్టరేట్ పొందారు. జర్నలిస్టుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. కడప, తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో అధ్యాపకుడిగా విశిష్ట సేవలందించారు. ఒకప్పుడు కడప కేంద్రంగా సుప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) ప్రియ శిష్యునిగా సాహిత్యంలో మెలకువలు నేర్చుకున్నారు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఎస్సీఈఆర్టీ సంపాదకుడిగా, పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి పలు పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించారు. పాఠ్యప్రణాళికలను రూపొందించాడు. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు. అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడిగా కొంత కాలం ఉన్నారు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) కథా సంపుటాలు, వేర్లు, బోధి అనే నవలలు వెలువరించారు. రాయలసీమ మాండలికంలో సాగిన ఈయన రచనలు మట్టి పరిమళాన్ని వెదజల్లాయి. ఈయన రాసిన అనేక కథలు హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఉద్యోగ విరమణ అనంతరం పుట్టిన గడ్డపై మమకారంతో కడపకు చేరుకున్నారు. కడప నగరంలో భార్యతో కలిసి సింగపూర్ టౌన్షిప్లో ఉంటున్న ఆయన.. రెండు రోజుల క్రితం ఒంగోలులో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లారు. ఈ ఉదయం గుండెపోటురాగా.. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. -
ఒక అరుదైన ఆత్మకథ
పుస్తక సమీక్ష మనోవైజ్ఞానిక శాస్త్ర రచనలు తెలుగులో తగినన్ని రాలేదు. మానసిక వ్యాధుల గురించో, వాటితో సతమతమయ్యే వాళ్లను గురించో, ఆ వ్యాధుల నివారణ మార్గాల గురించో తెలుగు పత్రికలు, ప్రచురణకర్తలు, స్వచ్ఛంద సంస్థలు కొన్ని రచనలను అందించక పోలేదు. ఇప్పుడు ఇవి చాలవు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. చదువుల పోటీ పెరిగింది. నిరుద్యోగమూ విజృంభించింది. హింస పెరిగింది. సమాజంలో అసహనం పెచ్చరిల్లింది. ఇమడలేనితనం పెరిగింది. పరాయితనం వెంటాడుతోంది. జన్యులోపాలు లేకపోలేదు. వెంపర్లాటలో మానసికమైన ఒత్తిళ్లు పెరిగాయి. రుగ్మతలూ పెరిగాయి. ఈ అన్నిటిని గురించి, అవి తెస్తున్న విపరిణామాల గురించి విశ్లేషణలు, మానసిక వ్యాధుల విముక్తి మార్గాలనూ తెలిపే రచనలు విరివిగా రావలసిన అవసరం ఎంతో ఉంది. మానసిక వ్యాధుల్లో మనిషిని పీడించే స్కీజోఫ్రెనియా వ్యాధి ఒకటి. ఈ వ్యాధి తమకుందని కూడా చాలామంది గుర్తించలేని మానసిక రుగ్మత ఇది. స్కీజోఫ్రెనియా నియంత్రణకు మానసిక వైద్యనిపుణుల అవసరం ఎంత ఉందో, ఆ వ్యాధి విముక్తి కోసం పోరాడి గెలిచిన వ్యక్తుల కథనాలూ మనకు అంతే అవసరం. ఈ అవసరాన్ని తీర్చడంలో వెలువడిన సరికొత్త రచన ‘ఓడి గెలిచిన మనిషి: ఒక స్కీజోఫ్రెనిక్ ఆత్మకథ’. ఈ ఆత్మకథ మహామహుల స్వీయ చరిత్రల కంటే భిన్నమైంది. ఒక సామాన్యుడి నిజ కథ ఇది. వ్యాధినపడ్డ తన జీవిత కథను తెల్పుతూ, మానసిక వ్యాధిగ్రస్తులకూ, వాళ్ల సంరక్షులకూ ఒక సందేశాత్మక మార్గాన్ని చూపాలన్న ఆర్తితో రాసిన కథ ఇది. చిత్తశుద్ధికి గీటురాయి లాంటి రచన ఇది. అందువల్లనే భిన్నమైంది అనడం! మల్లారెడ్డి 17 సంవత్సరాల కాలంలో 5 సార్లు స్కీజోఫ్రెనియా వ్యాధి బారిన పడ్డాడు. నాలుగుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. మరొక సమయంలో కుటుంబ కలహాల కారణంగా జైలుపాలయ్యాడు. 17 సంవత్సరాల్లో తన సున్నిత మనస్తత్వం వల్ల ఆలోచనలు అదుపు తప్పిపోవడం, వింత వింత భావావేశాలకు గురికావడం, వాస్తవం నుండి దూరం కావడం, విపరీతమైన ప్రవర్తనకూ, మానసికమైన ఒత్తిడికీ, ఘర్షణకూ గురికావడం, తరచూ కుంగిపోవడం, భ్రాంతులకు లోనుకావడం, సమాజం తనను పూర్తిగా ఇముడ్చుకోలేదని బాధపడటం, భరించలేని మానసిక క్షోభ తనను వెంటాడటం- వీటినన్నిటినీ వివిధ సంఘటనలు, సన్నివేశాల ద్వారా తన ఆత్మకథలో వెల్లడించాడు. తన మానసిక ప్రపంచంలో చిన్నతనం నుంచీ, చదువుకొనే రోజులనుంచీ, తర్వాతి తర్వాతి దశల్లో జరిగిన పరిణామాలనూ, తన అలవాట్లనూ, స్వేచ్ఛగా, నిర్భయంగా దాపరికం లేకుండా మానసిక వైద్యుల ముందు ఎట్లా ముందుంచాడో అట్లాగే పాఠకుల ముందుంచాడు. తన వ్యాధి దశల్లో తన మామ, క్లిష్ట సమయాల్లో తనకు చేదోడువాదోడుగా నిల్చిన భార్య ఉమ తెల్పిన విశేషాలను పొందుపరిచాడు. పాఠకులకు తను పడ్డ వేదనను తెల్పడమే కాదు, స్కీజోఫ్రెనిక్ వ్యాధిగ్రస్తులకు వ్యాధిని జయించాలనే ఇచ్ఛ ఉండాలనీ, చికిత్స దశల్లో సరైన మందులు సకాలంలో వాడటం మాత్రమే కాకుండా, సంకల్ప బలంతో వ్యాధిని జయించగలగాలనీ ఇందుకు లక్ష్యం, వ్యాపకం, ఆపేక్షలు తోడవ్వాలనీ తన అనుభవసారాన్ని అందించాడు. మనదేశంలో కోటి మందికి పైగా మానసికమైన జబ్బుల బారిన పడ్డవాళ్లున్నారు. పట్టణ నగర ప్రాంతాల్లోని ఆర్థిక స్తోమత, ఇంగితజ్ఞానం ఉండే విద్యావంతులైన మానసిక వ్యాధిగ్రస్తులకు అవసరమైన మానసిక వైద్యనిపుణుల సహాయం అంతో ఇంతో అందుబాటులో ఉంటుంది. పల్లెపట్టుల్లో తమ మనసును ఏ దయ్యం పట్టుకుందో, ఎవరు చేతబడి చేశారో అనుకుంటూ మూఢనమ్మకాలతో మంత్రగాళ్లు, తంత్రగాళ్లు, సాధులు, సన్యాసుల బారినపడేవాళ్లు లక్షలకు లక్షలున్నారు. పల్లెపట్టుల్లో సరైన శారీరక రోగాలకే సరైన వైద్యం అందడం లేదు. మానసిక జబ్బుల నివారణకు దిక్కూ దివాణం లేదు. ఇట్లాంటి తరుణంలో ‘వెలకట్టలేని ఈ రచన’ను, నవలలాగా సాగిన ఈ రచనను ఎవరైనా డాక్యుమెంటరీగా తీస్తే, దాన్ని తెలుగునేల నలుమూలలా చూపించగలిగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. వైద్యుడు లేనిచోట ఇలాంటి విలువైన పుస్తకాల అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి విలువైన పుస్తకాన్ని హైదరాబాదు బుక్ ట్రస్ట్ వెలువరించడం ఎంతైనా హర్షణీయం. కేతు విశ్వనాథరెడ్డి 9866713647 ఓడి గెలిచిన మనిషి: ఒక స్కీజోఫ్రెనిక్ ఆత్మకథ; రచన: మల్లారెడ్డి; సంపాదకురాలు: శోభాదేవి; పేజీలు: 148; వెల: 120; ప్రచురణ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్; ఫోన్: 23521849