తీతువగొంతును తియ్యగజేసింది | book review : Gorati Venkanna kavitha paramarsha | Sakshi
Sakshi News home page

తీతువగొంతును తియ్యగజేసింది

Published Mon, Dec 4 2017 1:41 AM | Last Updated on Mon, Dec 4 2017 1:41 AM

book review : Gorati Venkanna kavitha paramarsha - Sakshi

వాగ్గేయకారునిగా గోరటి వెంకన్న విశిష్టతకు ప్రధాన కారణాలలో వస్తు వైవిధ్యం ఒకటి. వస్తువు దృష్ట్యా వెంకన్న గేయాలను– విప్లవోద్యమ గేయాలు, దళిత చైతన్య గేయాలు, ప్రపంచీకరణ నిరసన గేయాలు, స్మృతి గేయాలు, వర్ణనాత్మక గేయాలు... మొదలైన విధంగా విభజించుకోవచ్చు.

సంత, వాన, కొంగ, నల్లతుమ్మ, సంచారం, జలచక్రం, వేకువహాయి, రాత్రి, వెన్నెల, అడవి మొదలైన గేయాలు వర్ణనాత్మకమైనవి. ‘వర్ణనాత్మకమైనవి’ అంటే ‘ఏకవస్తు వర్ణన’ ప్రధానమైనవని ఇక్కడ నా ఉద్దేశం.
‘వాన’ పాటలో వర్షరుతు ఆరంభంలోని అందమైన పల్లె దృశ్యాలు ప్రత్యక్షంగా, శ్రమజీవుల ఆనందం పరోక్షంగా వర్ణింపబడినాయి. ఈ పాటకు ప్రాణి లక్షణారోహణ సౌందర్యాన్ని సమకూర్చింది.
‘‘గద్దగూటిలోని గడ్డిని తడిపింది
గువ్వగూటి గులకరాళ్లను జరిపింది
తీతువగొంతును తియ్యగజేసింది
పరికిపిట్ట ముక్కు పాసిని కడిగింది
ఎద్దు మూపురాన్ని ముద్దాడి మురిసింది
ముల్లుగర్ర వొల్లు సల్లగ జేసింది’’
– ఉత్ప్రేక్షా వాచకాలు లేకుండా, నిర్ధారణ వాక్యాలలోనే వర్ణన ఆసాంతం సాగింది. కాని, ఇవన్నీ అందమైన ఉత్ప్రేక్షలే. ‘ముల్లుగర్ర వొల్లు సల్లగ జెయ్యడం’, ‘ఎగిరె దట్టీలకు వెండి మెరుపులద్దడం’ లాంటి వాక్యాలు వెంకన్న పరిశీలనాసక్తినీ, పరిశీలనాశక్తినీ పట్టిస్తాయి. వెంకన్న చాలా పాటలలో ఎక్కడో ఒకచోట ఆ«ధ్యాత్మిక అంశాల ప్రస్తావనలు ఉంటాయి. ఈ పాటలోని ‘తులశమ్మ దీపం’, ‘సాధుల సమాధులు’, ‘సూఫీ దర్గా’ల ప్రస్తావనలు అలాంటివే.
‘తాను రాకముందె తూనీగలను లేపి, తన పాటకే తాను దరువేసి ఆడింది’– తూనీగలు ఎగిరి తిరుగుతూ ఉండటం, వర్షాగమన సంకేతమన్న భావనను తెలుపుతుంది. గానం చేస్తూ, తన గానానికి తానే వాద్య సహకారాన్ని సమకూర్చుకొంటూ నాట్యం చేస్తున్న నర్తకిగా వర్షాన్ని వర్ణించడం విశేషం. సుందరమైన దృశ్యభావచిత్రాల ద్వారా, అంతటా పేరుకున్న ధూళీ, మలినాలూ, వర్షం వల్ల తొలగిపోయి ఒక వినిర్మల కాంతిని సమకూర్చుకోవడమూ, మనుషులతోపాటు సర్వప్రాణులూ ఆనందంలో తేలియాడడమూ సూచింపబడినాయి. వర్షం చేసే వివిధానేక ప్రక్షాళన క్రియలను అందమైన ఊహలతో జోడించి ‘లఘు చలనచిత్రాలు’గా తీర్చిదిద్దడం ఈ గీతంలోని ప్రత్యేకత.
(పెన్నా శివరామకృష్ణ ‘గోరటి వెంకన్న కవితాపరామర్శ’ పుస్తకంలోంచి...)

గోరటి వెంకన్న కవితాపరామర్శ
రచన: పెన్నా శివరామకృష్ణ
పేజీలు: 128; వెల: 80
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు. రచయిత ఫోన్‌: 9440437200

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement