కొత్త పుస్తకాలు: కస్తూరి పంచే మనిషి | New Books: kasthuri human | Sakshi
Sakshi News home page

కొత్త పుస్తకాలు: కస్తూరి పంచే మనిషి

Published Mon, Aug 12 2013 12:19 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

కొత్త పుస్తకాలు: కస్తూరి పంచే మనిషి - Sakshi

కొత్త పుస్తకాలు: కస్తూరి పంచే మనిషి

శాఖమూరు రామగోపాల్ తెలుగు రచయితలకు తెలియడు. కన్నడ రచయితలకు కూడా తెలియడు. ఆయన తెలంగాణ వాళ్లకు తెలియడు. సీమాంధ్ర వాళ్లకూ తెలియడు. ఆయన ప్రవాస తెలుగువాడని ఇక్కడి వాళ్లనుకుంటారు. మనకేం సంబంధం అని కన్నడవాళ్లనుకుంటారు. ఎవరు ఎలా అనుకున్నా రామగోపాల్‌కు తెలిసింది మాత్రం ఒక్కటే. తెలుగు అంటే ప్రేమ. కన్నడం అంటే వెర్రి. కన్నడంలో ఉన్న ఉత్కృష్ట సాహిత్యాన్ని తెలుగుకు అనువాదం చేసి ఇవ్వాలని తపన. ‘భూమిలో పడ్డ విత్తనం హృదయంలో పడ్డ అక్షరం వృథాపోవు’ అని వాళ్ల అమ్మ అనేదట. తెనాలి నుంచి వాళ్ల కుటుంబం చాలా ఏళ్ల క్రితం రాయచూరు వెళ్లి వ్యవసాయం మొదలెట్టింది. రామగోపాల్ ఇక్కడే చదువుకున్నా,  చదువు పూర్తయ్యాక ఉద్యమాలు గిద్యమాలంటూ కొడుకు పట్టకుండా పోతాడేమోనని రాయచూరు తీసుకొచ్చారు తల్లిదండ్రులు.
 
 అక్కడ కన్నడ కస్తూరి పరిమళం మొదటిసారిగా తెలిసింది రామగోపాల్‌కు. హైద్రాబాద్ తిరిగి వచ్చి ఇక్కడే ఉండిపోయినా కన్నడ భాషను, లిపిని, సాహిత్యాన్ని వదల్లేదు. ఇన్నాళ్ల తర్వాత ఖాళీ దొరికి 60 ఏళ్ల వయసులో గత మూడేళ్లుగా కన్నడ కథల అనువాదం మొదలుపెట్టారు. మూడేళ్లు. ఇప్పటికి ఎనిమిది మంచి మంచి పుస్తకాలు వచ్చాయి.  శ్రేష్ఠ కన్నడ కథలు, చినరాపూరులోని గయ్యాళులు, కృష్ణారెడ్డి ఏనుగు, పర్యావరణ కథలు, మాట తీరు... వీటిలో దాదాపుగా ప్రఖ్యాత కన్నడ రచయిత పూర్ణచంద్ర తేజస్వి కథలే ఎక్కువ. ‘కన్నడ నాట రచయితలకు గౌరవం ఎక్కువ. కువెంపు వంటి వారి పుస్తకాలను దేవుడి మందిరంలో పెట్టుకుంటారు’ అంటాడాయన. ‘ఒక కథ చదివితే మన జీవిత దృక్పథమే మారిపోవాలి. ఒక గొప్ప కథ పుట్టాలంటే ఒక గొప్ప రచయితకు పుష్కరకాలం పడుతుంది. కన్నడలో అలా కృషి చేసి రాస్తారు. తెలుగులో వందల కొద్దీ కథలు రాశామని కొందరంటుంటారు. అన్ని కథలు ఎలా రాశారా అని నాకు ఆశ్చర్యం.’ అంటాడాయన చకితుడవుతూ. రామగోపాల్ తెస్తున్న పుస్తకాలను పాఠకులు ఆదరిస్తున్నారు. ‘ఆ అమ్మకాలు కూడా నామ్ కే వాస్తే. ఇక్కడ పుస్తకాలు పెద్దగా కొనరు. న్యూస్ పేపర్లు చదివి తెలుగుకు సేవ చేస్తున్నారనుకుంటారు. పత్రికలు చదివితే వార్తలు తెలుస్తాయి. పుస్తకాలు చదివితే జీవితం మారుతుంది. కన్నడిగులకు ఈ సంగతి తెలుసు.
 
 అందుకే అక్కడ రచయితలు రాసి ఘనంగా బతుకుతున్నారు. ఇక్కడ రాసి చెడిపోతున్నారు. నేను కూడా ఈ పుస్తకాలు అచ్చు వేయడానికి నానా తిప్పలు పడాల్సి వస్తోంది’ అని బాధ పడతాడాయన. అలాగని రామగోపాల్ ప్రొఫెషనల్ ట్రాన్స్‌లేటర్ కాకపోవచ్చు. ఆయన అనువాదంలోని భాష ఒక విధమైన మిశ్రమ సొగసుతో ఉండవచ్చు. కన్నడ ప్రభావంతో కూడా ఉండవచ్చు. అయితే మాత్రం? ఒక అనువాద అకాడెమీ చేయాల్సిన పనిని చేస్తున్నాడు. ‘ఇంకో రెండేళ్లు. అంతటితో నేను రాయాల్సిన పుస్తకాలు ముగుస్తాయి. అంతటితో ఈ వ్యసనాన్ని కట్టిపెడతాను’ అని నవ్వాడాయన. ఇలాంటి వాళ్ల వల్లే సాహిత్యం ఇంకా ‘ప్రయోజనం ఆశించని’ విధంగా స్వచ్ఛంగా కొనసాగుతోంది. ఇలాంటి వాళ్ల వల్లే వానలు కూడా వేరే ఏమీ ఆశించకుండా సకాలానికి కురుస్తూ ఉన్నాయి. ఆయన్ను మెచ్చుకోవాలంటే: 09052563666
 
 ఒక కథకుడు నూరుగురు విమర్శకులు....
 తెలుగులో సుదీర్ఘ చర్చలు జరిగిన కథలు ఏవి? కాళీపట్నం రామారావు ‘యజ్ఞం’. తుమ్మేటి రఘోత్తమరెడ్డి ‘పని పిల్ల’. స్త్రీ- పురుషుల మధ్య, ఆదివాసీ - మైదాన ప్రాంతాల వారి మధ్య ఉన్న వైరుధ్యాల లోతులను చర్చించిన కథ ‘పని పిల్ల’. అయితే దీని మీద ఎవరి దృష్టికోణం నుంచి వారు సుదీర్ఘమైన చర్చ చేశారు. కొన్ని వందల పేజీల చర్చ జరగడం విశేషమే. అలాగే తుమ్మేటి రాసిన ‘నల్లవజ్రం’ నవల మీద, ‘శత్రువు’, ‘బండకింది బతుకులు’ వంటి కథల మీద కూడా చాలా చర్చలు జరిగాయి. ఇక ఇటీవల ‘సెజ్’ల కేటాయింపు, వాటిని ప్రజలు ఎలా చూస్తున్నారు, ‘సెజ్’లను ఏ వైపు నుంచి అర్థం చేసుకోవాలి వ్యాఖ్యానిస్తూ రాసిన ‘సెజ్’ కథ మీద కూడా బోలెడంత చర్చ జరిగింది. ఇలా అనేక సందర్భాలలో తన రచనల మీద జరిగిన చర్చలన్నింటినీ కలిపి ‘ఒక కథకుడు నూరుగురు విమర్శకులు’ పేరుతో పుస్తకం వెలువరించారు. 576 పేజీల ఈ పుస్తకం రచయితలకు, విమర్శకులకు, భవిష్యత్తులో యువ కథకులకు, సాహిత్య విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది. ఒక రచయితను, ఒక కాలాన్ని అర్థం చేసుకోవడానికి పలు దృష్టి కోణాల నుంచి సాహిత్యాన్ని విశ్లేషించడానికి ఇటువంటి ప్రయత్నాలు స్వాగతించదగ్గవి.
 ఒక కథకుడు నూరుగురు విమర్శకులు; తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథల చర్చా సర్వస్వం
 వెల: 400; ప్రతులకు: 9000184107
 
 గురుభక్తుల జీవిత దర్శనం
 డాక్టర్ బిరుదురాజు రామరాజు రాసిన ‘ఆంధ్రయోగులు’ సంపుటాలు సుప్రసిద్ధం. ఆంధ్ర రాష్ట్రంలోని నలుమూలల్లో ప్రజల ఆదరణ పొందిన 50 మంది యోగుల కథలను ఆయన 1998లో మొదటిసారి అచ్చు వేశారు. ఆ తరువాత ఇతర భాగాలు వచ్చాయి. అయితే అంతకు నలభై ఏళ్ల ముందే గుంటూరుకు చెందిన పంగులూరి వీరరాఘవుడు 1957లో ‘శ్రీమదాంధ్ర మహాభక్త విజయము’ పేరుతో 67 మంది గురుభక్తుల జీవిత చిత్రణను పుస్తకంగా వెలువరించారు. ఆనాటికి పాఠకులకు అందుబాటులో లేని యోగుల చరిత్రను తన శక్తిమేరకు సేకరించి రాసి ఎనలేని సేవ చేశారు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని ఆయన ఆత్మీయులు సరళీకరించి కొత్తగా తీసుకొని వచ్చారు.
 
 ఇందులో బమ్మెర పోతన దగ్గరి నుంచి అమరవాది కామళ్ల వెంకట రామానుజాచార్యులవారి వరకు చాలా మంది యోగుల చరిత్రలు ఉన్నాయి. బందా పరదేశి, పోతులూరి బ్రహ్మంగారు, దూదేకుల సిద్దయ్య, రంగారాయుడు, సయ్యద్   అహ్మద్ అలీషా ఖాదర్ వలీ, నల్ల మస్తానయ్య, మాల ఓబులు, మాల పిచ్చమ్మ, బెల్లంకొండ రామరాయకవి, డొక్కా సీతమ్మ, ముమ్మడివరం బాలయోగి, సత్యసాయిబాబా... ఇలా ఎందరో యోగులు ఇందులో కనిపిస్తారు. చారిత్రక ప్రమాణాల కన్నా భక్తులు చెప్పుకునే గాథలనే స్వీకరించి వాటిని లిఖించారు. ఏమైనా ఒక కాలంనాటి యోగులు, ఆ కాలపు వివరాలు కూడా పరోక్షంగా ఇందులో తెలుస్తాయి. అరుదైన పుస్తకం.
 శ్రీ మదాంధ్ర మహాభక్త విజయము; వెల: రూ.150; ప్రతులకు: 99086 48474

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement