విశ్వసాహిత్యంలో మధురవాణితో పోల్చగలిగిన పాత్ర మరొకటి లేదు. కాళిదాసు విక్రమోర్వశీయంలోని ఊర్వశి, శూద్రకుని మృచ్ఛకటికంలోని వసంతసేన కవితాకన్యలుగానే కన్పిస్తారు. షేక్‌స్పియర్ క్లియోపాత్రాగానీ, సోఫోక్లిస్ నాయికలుగానీ వేశ్యలు కారు. ఇందుకు భిన్నంగా గురజాడ సృష్టించిన పాత్ర మధురవాణి. ఆమె వేశ్యామణి కావొచ్చు. కానీ సంగీత, నాట్య, సాహిత్యాలలో విదుషీమణి. ‘మధురవాణి అంటూ ఓ వేశ్యశిఖామణి ఈ కళింగ రాజ్యంలో ఉండకపోతే భగవంతుడి సృష్టికి ఎంత లోపం వచ్చి ఉంటుందో’ అని కరటకశాస్త్రి అనుమానపడతాడు. ‘నువ్వు మంచిదానివి. ఎవరో కాలుజారిన సత్పురుషుడి పిల్లవై వుంటావు’ అని సౌజన్యారావు అభిప్రాయపడతాడు. రామప్పంతులును భర్తలా పూజిస్తుంది మధురవాణి. ‘నేనుండగా మీరెలా వెధవలౌతారు’ అంటుంది. వాక్చాతుర్యంలో ఆమెకు ఆమే సాటి.
ఈ పాత్రకు మరింత వన్నె, ప్రాచుర్యం కల్పించేందుకు ప్రసిద్ధ సంపాదకుడు, రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ ‘మధురవాణి ఇంటర్‌వ్యూలు’ వెలువరించారు. ఇది 1997లో ముద్రితమైంది. సాహితీ దిగ్గజాలైన పలువురితో ఊహాజనిత సంభాషణలివి. ముందుగా గురజాడతో జరిపిన సంభాషణలో ‘మీరు వేగుచుక్క అయితే, మీకు తోకచుక్క కదా శ్రీశ్రీ’ అంటుంది మధురవాణి. ‘నువ్వు రామప్పంతులు, గిరీశంతో పిల్లి– ఎలుకలతో ఆడుకున్నట్టు ఆడుకున్నావు. నాతో మాత్రం ఆడుకోలేవు’ అని గురజాడ అన్నప్పుడు, మధురవాణి జవాబు చూడండి: ‘డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నారు కదా! అది గిరీశం గారికా లేక మీకేనా?’ అని చమత్కరిస్తుంది.
కట్టమంచి రామలింగారెడ్డితో జరిపిన ముఖాముఖిలో ‘మైసూరు వచ్చివుంటే నీకు అర్థశాస్త్రం బోధించేవాణ్ని’ అని కట్టమంచి అన్నప్పుడు, నాకు అర్థంతో పనిగాని అర్థశాస్త్రంతో కాదని సరసమాడుతుంది. విశ్వనాథతో– జాషువా గూర్చి మీరేమంటారు అని ప్రశ్నించి ‘జాషువా వలె తెలుగు నుడికారంలో రచన చేయటం నాకు కూడా సాధ్యం కాదు’ అని ఒప్పిస్తుంది. ‘ఈనాడు మహాకవి అని చెప్పదగినవాడు ఈయనే’ అని శ్రీశ్రీ గురించి పలికిస్తుంది. మీరు మరో మధురవాణిని సృష్టించారట, నాకు పోటీగానా, గురజాడ వారికి పోటీగానా అని రావిశాస్త్రిని నిలదీస్తుంది.
‘అదా, రత్తాలు–రాంబాబులో ప్రోలిటేరియన్ మధురవాణిగా ‘ముత్యాలు’ అని ఉంది. ఈ ముత్యాలు పేదల మధురవాణి. గురజాడకు కృతజ్ఞతతోనే, పోటీ ఏం కాదు’ అని రావిశాస్త్రి జవాబిస్తారు. ఆరుద్రతో జరిపిన సంభాషణలో ‘నిజానికి మీరే శ్రీశ్రీకంటే గొప్పవారు. ఈ విషయం మీకూ నాకూ మాత్రమే తెలిసిన సీక్రెట్’ అంటుంది. ఇలా సాహితీవేత్తల అంతరంగాలను మధురవాణి నెపంతో అద్భుతంగా ఆవిష్కరించారు పురాణం సుబ్రహ్మణ్య శర్మ.
-వాండ్రంగి కొండలరావు
Comments
Please login to add a commentAdd a comment